అంతర్జాతీయంటాప్ స్టోరీస్

చైనాకు జీవితకాల అధ్యక్షుడయ్యేందుకు.. షి జిన్ పింగ్ మాస్టర్ ప్లాన్

  • ప్రారంభమైన కమ్యూనిస్ట్ పార్టీ ప్లీనమ్స్
  • తీర్మానాలను ప్రవేశపెట్టిన సెంట్రల్ కమిటీ
  • మూడోసారి అధ్యక్షుడయ్యేందుకు జిన్ పింగ్ ముందడుగు
  • హిస్టారిక్ రిజల్యూషన్ లో విజయాల ప్రస్తావన

చైనాకు జీవితకాల అధ్యక్షుడయ్యేందుకు షి జిన్ పింగ్ మాస్టర్ ప్లానే వేశారు. ఇప్పటికే రెండు టర్మ్ లు పూర్తి చేసుకున్న ఆయన.. మూడోసారీ అధ్యక్ష పీఠంపై కూర్చునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు నిన్నటి నుంచే చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (సీసీపీ) ప్లీనరి సమావేశాలను/ప్లీనమ్ లను ప్రారంభించింది. మొత్తంగా ఏడు సమావేశాలను నిర్వహించనున్నారు. వచ్చే ఐదేళ్ల పాటు పార్టీ అజెండాకు సంబంధించిన అంశాలను అందులో చర్చించనున్నారు. వచ్చే ఏడాది నిర్వహించే అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి పలు తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు.

ఈ ఏడు ప్లీనమ్స్ లలో ఆరోదానిని ఎన్నికల ప్రచారానికి సమానంగా చూస్తారు. ఈ ప్లీనమ్స్ లోనే జీవితకాల అధ్యక్షుడయ్యేందుకు పార్టీలోని పెద్దలందరి మద్దతు కూడగట్టుకునేందుకు షి జిన్ పింగ్ ప్రయత్నిస్తున్నారు. నిన్న మొదలైన సమావేశంలో ఆయన తన పనితనం గురించి చెబుతూ ఓ నివేదికను విడుదల చేసినట్టు ఆ దేశ అధికారిక పత్రిక షిన్హువా వెల్లడించింది. వందేళ్లలో పార్టీ సాధించిన చారిత్రక విజయాలు, ముసాయిదా తీర్మానాలపై వివరణలతో నివేదికను తయారు చేసినట్టు పేర్కొంది. జిన్ పింగ్ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ షిన్హువా కథనాలను ప్రసారం చేసింది. మావో జెడాంగ్ తర్వాత అంతటి గొప్ప నాయకుడంటూ కీర్తించింది.

దేశంలో అవినీతి రహిత పాలనను అందిస్తున్నా.. విదేశీ విధానాల విషయంలో మాత్రం జిన్ పింగ్ విమర్శల పాలవుతూనే ఉన్నారు. షిన్ జియాంగ్ లో వీగర్ల అణచివేత, హాంకాంగ్, టిబెట్ ఆక్రమణలు సహా సరిహద్దుల్లో గొడవలతో దూకుడుగా ముందుకెళ్తున్నారు. అంతేకాదు.. విమర్శలను తొక్కిపెట్టేసే నాయకత్వాన్ని ఆయన సృష్టించారు. ప్రత్యర్థులను తొక్కిపెట్టేశారు. దాంతో పాటు ఓ కొత్త రాజకీయ సిద్ధాంతాన్ని సృష్టించి ‘షి జిన్ పింగ్ ఆలోచనలు’ పేరిట స్కూలు విద్యార్థులకూ పాఠాల్లా బోధిస్తున్నారంటే ఆయన.. చైనాను తన గుప్పిట్లో పెట్టుకునేందుకు ఎంతలా ప్రయత్నిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

మావో జెడాంగ్ తర్వాత దేశాధ్యక్షుడైన డెంగ్ జియావోపింగ్.. 68 ఏళ్లు నిండినవారంతా రిటైరైపోవాల్సిందేనని, రెండుసార్లకు మించి పదవిలో కొనసాగకూడదని అప్పట్లో ఓ కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. కానీ, దానిని జస్ట్ ఒక చట్ట సవరణతో కొట్టిపారేసిన షి జిన్ పింగ్.. జీవితాంతం అధ్యక్షుడిగా కొనసాగేందుకు మాస్టర్ ప్లాన్ వేశారు. 68 ఏళ్లు నిండినా అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. ఇటు పొలిట్ బ్యూరోలోని సభ్యుల్లో సగం మందికి వచ్చే ఏడాది 68 ఏండ్లు నిండుతాయి. మరి, వారి భవితవ్యం ఏంటన్నది తెలియదు.

వాస్తవానికి జిన్ పింగ్ ఎత్తేసింది పదవీ విరమణ పరిమితులే. అయితే, మళ్లీ మళ్లీ ఎన్నికవడమన్నది మాత్రం దానితో సంబంధం ఉండదు. సెంట్రల్ కమిటీలోని ఉన్నత అధినాయకత్వాన్ని మెప్పించాల్సి ఉంటుంది. అందుకే చారిత్రాత్మక తీర్మానాన్ని షి జిన్ పింగ్ ప్రవేశపెట్టారు. అందులో తాను చేసిన గొప్ప పనులన్నింటినీ ఏకరువు పెట్టారు. వైఫల్యాలు, కొన్ని నిర్ణయాల్లో విమర్శలకు సమాధానంగా.. దేశం సాధించిన విజయాలను ఆ తీర్మానంలో ప్రస్తావించారని తెలుస్తోంది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close