అంతర్జాతీయం

ఆల్‌ఫ్రెడ్ నోబెల్‌కు ఘ‌న నివాళి ఇదే..

ఆల్‌ఫ్రెండ్ నోబెల్ ఏ ఉద్దేశంతో నోబెల్ అవార్డుల‌ను ఏర్పాటు చేశారో.. ఆ ల‌క్ష్యం నెర‌వేరిన‌ట్లు క‌నిపిస్తున్న‌ది.  ప్ర‌పంచవ్యాప్తంగా ఆక‌లితో అల‌మ‌టిస్తున్న వారికి అన్నం పెడుతున్న వ‌ర‌ల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్‌కు ఈ ఏడాది శాంతి బ‌హుమ‌తి ద‌క్క‌డ‌మే దానికి నిద‌ర్శ‌నం. క‌రోనా వైర‌స్‌తో విల‌విలలాడుతున్న అభ్యాగులెంద‌ర్నో ఫుడ్ ప్రోగ్రామ్ ఆదుకున్న‌ది. అల‌మ‌టిస్తున్న పేగుల‌కు ఆహారం అందిస్తున్న ప్ర‌పంచ ఆహార ప్రోగ్రామ్‌కు శాంతి బ‌హుమ‌తి ద‌క్క‌డం నిజంగా హ‌ర్ష‌ణీయం. క‌రోనా వైర‌స్‌తో అత‌లాకుత‌ల‌మైన ప్ర‌పంచ ఆర్థిక గ‌మ‌నం .. దాదాపు అన్ని దేశాల‌ను నిస్తేజంలోకి నెట్టేసింది.  అలాంటి స‌మ‌యంలో వ‌ర‌ల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ .. నిజంగా ఆశాకిర‌ణంలా ఎంద‌ర్నో ఆదుకున్న‌ది. వైర‌స్ ఒక్క‌టే కాదు.. నిత్యం అగ్నికాష్టంలా ర‌గులుతున్న యుద్ధ క్షేత్రాల్లో తిండిలేక మ‌ల‌మ‌ల‌మాడుతున్న వారికి కూడా వ‌ర‌ల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఓ దివ్య‌జ్యోతిలా మారింది. 

క‌డుపు నిండా అన్నం తింటేనే మ‌న‌స్సుకు శాంతి. ఆ  శాంతి సందేశాన్ని ఇవాళ నోబెల్ క‌మిటీ త‌న విలువైన ప్ర‌క‌ట‌న‌లో వినిపించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఆక‌లి స‌మ‌స్య‌ల‌ను తీరుస్తున్న వ‌ర‌ల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్‌కు పీస్ ప్రైజ్‌ను ప్ర‌క‌టించ‌డం శుభ‌సంకేతం.  2019లో ప‌ది కోట్ల మందికి 88 దేశాల్లో డ‌బ్ల్యూఎప్‌వో అన్నం పెట్టింది.  ఆక‌లి, ఆహార భ‌ద్ర‌త‌తో కొట్టుమిట్టాడుతున్న‌వారిని ఆద‌రించింది. ఆక‌లి చావుల్ని నివారించ‌డమే సుస్థిర అభివృద్ధి ల‌క్ష్య‌మ‌ని 2015లో యూఎన్ తీర్మానించింది. ఆ భావ‌న‌తోనే వ‌ర‌ల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ నిరాటంకంగా ముందుకు సాగుతున్న‌ది.  2019లో సుమారు 13.5 కోట్ల మంది  ఆక‌లితో ఇబ్బందిప‌డిన‌ట్లు రికార్డులు చెబుతున్నాయి. యుద్ధాలు, అంత‌ర్ క‌ల‌హాల వ‌ల్ల ఈ ప‌రిస్థితి ఉత్ప‌న్నం అయిన‌ట్లు తెలుస్తోంది. 

 క‌రోనా వైర‌స్ రాక‌తో హంగ‌ర్ అనేది అంద‌రి స‌మ‌స్య‌గా మారింది. యెమెన్‌, కాంగో, నైజీరియా, ద‌క్షిణ సుడాన్‌, బుర్కినా ఫాసో లాంటి దేశాల్లో అల్ల‌ర్ల‌కు తోడు ఆక‌లిబాధ‌లూ ఎక్కువ అయ్యాయి. ఆ దేశాల్లో తిండిలేక విగ‌త జీవులైన వారి సంఖ్య పెరుగుతూ పోయింది. వారి కోసం వ‌ర‌ల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అద్భుత ప్రాజెక్టును చేప‌ట్టింది.  క‌రోనాకు వాక్సిన్ వ‌చ్చే వ‌ర‌కు..  ఆహార‌మే ప‌ర‌మ ఔష‌ధం  అన్న రీతిలో వ‌ర‌ల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ త‌న సేవ‌ల‌ను అందించింది. ఆక‌లి సంక్షోభం చాలా దేశాల్లో ఉన్న‌ట్లు డ‌బ్ల్యూఎఫ్‌వో పేర్కొన్న‌ది. త‌మ‌కు ఆర్థిక సాయం చేస్తే .. త‌మ సేవ‌ల్ని మ‌రింత విస్తృతంగా అందించ‌నున్న‌ట్లు ఆ సంస్థ వెల్ల‌డించింది.  

సంక్షోభం.. ఆక‌లి అనేవి విడ‌దీయ‌రానివి.  యుద్ధం, ఘ‌ర్ష‌ణ‌ల వ‌ల్ల ఆహార భ‌ద్ర‌త క్షీణిస్తుంది. దీంతో అలాంటి ప్రాంతాల్లో ప‌రిస్థితి మ‌రింత‌ అధ్వాన్నంగా మారుతుంది. అక్క‌డ ఉన్న అల్ల‌ర్లు మ‌రింత ప్ర‌జ్వ‌రిల్లుతాయి.  అంతేకాదు యుద్ధానికి అంతం ప‌ల‌క‌నిది.. ఆక‌లిలేని సామ్రాజ్యాన్ని స్థాపించ‌లేమ‌న్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.   ఆహార భ‌ద్ర‌తా కార్య‌క్ర‌మాల‌కు సాయం చేయ‌డం వ‌ల్ల ఆక‌లి ఆర్త‌నాదాల్ని నివారించ‌వ‌చ్చు అని, దాంతో స్థిర‌త్వం, శాంతి కూడా సాధ్యం అవుతాయ‌ని నోబెల్ క‌మిటీ త‌న ప్ర‌క‌ట‌న‌లో అభిప్రాయ‌ప‌డింది. ద‌క్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాల కోసం వ‌ర‌ల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ రూపొందించింది. 

శాంతి స్థాప‌న‌లో ఆహార భ‌ద్ర‌త కీల‌క‌మైంద‌ని, ఈ యేటి శాంతి అవార్డుతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా మిలియ‌న్ల సంఖ్య‌లో జ‌నం ఆక‌లి బాధ‌ల నుంచి విముక్తుల‌వుతార‌ని భావిస్తున్న‌ట్లు నోబెల్ క‌మిటీ చెప్పింది.  ఆల్‌ఫ్రెడ్ నోబెల్ వీలునామాలో రాసిన‌ట్లే వ‌ర‌ల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ త‌న కర్త‌వ్యాన్ని నెర‌వేరుస్తున్న‌ది. యూఎన్‌కు అనుబంధంగా ఉన్న డ‌బ్లూఎఫ్‌పీ .. శాంతికి ఆధునిక ఆయుధంగా మారిన‌ట్లు నోబెల్ క‌మిటీ అభిప్రాయ‌ప‌డింది. మాన‌వ జాతి క్షేమం కోసం అన్ని దేశాలు వ‌ర‌ల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్‌ను ఆద‌రిస్తాయ‌ని నోబెల్ క‌మిటీ ఆశాభావం వ్య‌క్తం చేసింది. నిజంగా ఆక‌లి బాధ‌లు తీరుస్తున్న డ‌బ్ల్యూఎఫ్‌పీ సిబ్బందికి ఇది నోబెల్ అందించిన న‌వోత్తేజం. 

Tags
Back to top button
error: Content is protected by G News !!
Close
Close