సినిమా

‘వ‌రల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్’ రివ్యూ

పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి లాంటి ప్రేమకథలతో యువతరం ఆరాధ్య కథానాయకుడిగా పేరుతెచ్చుకున్నారు విజయ్‌దేవరకొండ. సహజత్వం వైవిధ్యత మేళవించిన ఈ ప్రేమకథా చిత్రాలు నటుడిగా ఆయన్ని కొత్త కోణంలో ఆవిష్కరించాయి. ‘వరల్డ్‌ఫేమస్‌ లవర్‌’ తన చివరి ప్రేమకథా చిత్రమంటూ ప్రచార వేడుకల్లో ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు విజయ్‌దేవరకొండ. మూడు భిన్న గెటప్‌లలో విజయ్‌దేవరకొండ  కనిపించడం, నలుగురు కథానాయికులతో ప్రచార చిత్రాలు  ఆసక్తిని రేకెత్తించాయి. ‘మళ్లీ మళ్లీ ఇది రాని  రోజు’ లాంటి వినూత్నమైన ప్రేమకథతో  ప్రతిభను చాటుకున్న క్రాంతిమాధవ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. క్రియేటివ్‌ కమర్షియల్‌ పతాకంపై కె.ఎ.వల్లభ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎన్నో అంచనాల నడుమ ప్రేమికుల రోజున ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకున్నది.  తన చివరి ప్రేమకథతో విజయ్‌దేవరకొండ ప్రేక్షకుల్ని మెప్పించాడా?లేదా? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

గౌతమ్‌(విజయ్‌ దేవరకొండ) ఓ అనాథ. తొలిచూపులోనే యామినిని ప్రేమిస్తాడు. యామిని(రాశీఖన్నా) గౌతమ్‌ను ఇష్టపడుతుంది. ఇద్దరూ సహజీవనం చేస్తుంటారు. రచయితగా పేరుతెచ్చుకోవాలనే తన కల కోసం చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు గౌతమ్‌.  కానీ ఆ దిశగా ప్రయత్నాలు చేయకుండాసమయాన్ని వృథాచేస్తుంటాడు. యామినిని నిర్లక్ష్యం చేస్తుంటాడు. గౌతమ్‌లో మార్పు కోసం ఎదురుచూసిన యామిని అతడికి బ్రేకప్‌ చెబుతుంది. యామిని తనకు దూరమవ్వడం సహించని గౌతమ్‌ ఆమె ప్రేమ కోసం పరితపిస్తుంటాడు. యామిని కోరుకున్నట్లుగానే కథ రాయడం మొదలుపెడతాడు. మరోవైపు ఇల్లందులో శీనయ్య(విజయ్‌ దేవరకొండ) ఓ బొగ్గుగని కార్మికుడు. చదువులో  ప్రతిభావంతుడైన కుటుంబబాధ్యతల కారణంగా తండ్రి ఉద్యోగాన్ని స్వీకరిస్తాడు. సువర్ణ(ఐశ్వర్యారాజేష్‌)తో పాటు ఐదేళ్ల కొడుకుతో జీవిస్తుంటాడు. శీనయ్య జీవితంలోకి స్మిత(కేథరిన్‌) ప్రవేశిస్తుంది.  ఆమె ఆకర్షణలో పడి  భార్యతో పాటు కుటుంబాన్ని నిర్లక్ష్యంచేయడం మొదలుపెడతాడు శీనయ్య. భర్త ప్రేమ కోసం సువర్ణ ఏం చేస్తుంది. గౌతమ్‌(విజయ్‌ దేవరకొండ? ఓ పారిస్‌లో ఓ రెడియోస్టేషన్‌ను నిర్వహిస్తుంటాడు. పైలెట్‌ ఇజా(ఇజాబెల్లె)ను  ప్రాణంగా ప్రేమిస్తాడు. ఇజా పుట్టినరోజు మధురజ్ఞాపకంగా మలచాలని అనుకుంటాడు. కానీ అనుకోకుండా ఆ రోజు వారి జీవితంలో విషాదాన్ని మిగుల్చుతుంది. ఇజా ప్రేమ కోసం గౌతమ్‌ ఎలాంటి త్యాగానికి సిద్ధపడతాడు. హైదరాబాద్‌ గౌతమ్‌కు, ఇల్లెందుకు చెందిన శీనయ్యకు, పారిస్‌ గౌతమ్‌కు ఉన్న సంబంధమేమిటన్నదే  ఈ చిత్ర ఇతివృత్తం. 

నిజమైన ప్రేమంటే ఏమిటో, ప్రేమలో త్యాగం ఉంటుందని, ఎవరూ రాజీపడాలనే సత్యాన్ని ఓ యువకుడు ఎలా తెలుసుకున్నాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.  ఈ సింపుల్‌ పాయింట్‌ను దర్శకుడు క్రాంతిమాధవ్‌ వినూత్నంగా తెరపై ఆవిష్కరించారు.విఫల ప్రేమికుడి దృక్కోణం నుంచి మూడు భిన్న కథలు, పాత్రలతో ఈ పాయింట్‌ను తెరపై ఆవిష్కరించిన తీరు కొత్త అనుభూతిని పంచుతుంది.నిజజీవితంలో సాఫల్యం కానీ తన కలను, అహాన్ని ఓ రచయిత ఊహాప్రపంచంలో ఎలా సంతృప్తిపరుకున్నాడున్నాడనే పాయింట్‌ను వైవిధ్యంగా మలిచారు.   ప్రతి కథను వాస్తవికతకు దగ్గరగా నడిపించిన విధానం బాగుంది. మూడు కథల మధ్య లింక్‌ను ఆసక్తికరంగా చూపించారు. ప్రేమలోని భావోద్వేగాల్ని తాత్వికత మేళవిస్తూ హృద్యంగా తెరపై ఆవిష్కరిస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు క్రాంతిమాధవ్‌. 

విజయ్‌ దేవరకొండ, రాశీఖన్నా ప్రేమకథ పూర్తిగా హృద్యంగా  సాగుతుంది.  గౌతమ్‌ తన ప్రపంచం అని ఊహించుకున్న యామిని కలలు కల్లలుగా మార్చడంతో తట్టుకోలేక ఆమె ఎదుర్కొనే సంఘర్షణ,  యామిని దూరం కావడంతో గౌతమ్‌ పడే ఆవేదన, తపనను  తీవ్రమైన భావోద్వేగాలతో తీర్చిదిద్దారు. భార్యభర్తలైన శీనయ్య, సువర్ణ అనుబంధాన్ని ఇల్లెందు నేపథ్యంలో సహజత్వంగా చూపించారు. స్వచ్ఛమైన తెలంగాణ మాండలికంతో, ఇల్లెందు  నేటివిటీని, బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికుల జీవితాల్ని కళ్లకు కట్టినట్లుగా ఈ సన్నివేశాల్లో దర్శకుడు  ఆవిష్కరించారు. తెరపై పాత్రల్ని కాకుండా నిజమైన జీవితాల్ని చూస్తున్న అనుభూతి కలుగుతుంది.  ఇల్లెందు ప్రాంతంలో విహరించిన అనుభూతికి లోనుచేస్తాయి. తెలంగాణలోని మార్మిక సౌందర్యాన్ని అద్భుతంగా చూపించిన చిత్రాల్లో ఇది ఒకటిగా నిలుస్తుంది. పారిస్‌కు చెందిన గౌతమ్‌, ఇజాల ఎపిసోడ్‌ ఆధునిక ఛాయలతో సాగుతుంది. భిన్న సంస్కృతులు, దేశాలకు చెందిన వారి మధ్య ఎలా ప్రేమ అంకురించిందో ైస్టెలిష్‌గా చెబుతూనే ఎమోషన్స్‌ను పండించారు.  

రొటీన్‌ సినిమాలకు భిన్నంగా ఈ ప్రేమకథను నడిపించారు క్రాంతిమాధవ్‌. కథను నేరుగా చెప్పకుండా బ్యాక్‌ అండ్‌ ఫోర్త్‌ స్క్రీన్‌ప్లే టెక్నిక్‌తో చెప్పడం బాగుంది.  ఇలాంటి ప్రేమకథలతో సినిమా రావడం కొంత అరుదనే చెప్పాలి. అయితే  కథలో వేగం తగ్గడం, పూర్తి ఎమోషనన్‌ అంశాలకు ప్రాధాన్యతనివ్వడం కొంత మైనస్‌గా మారింది. రచయిత ఎపిసోడ్‌ పూర్తిగా అర్జున్‌రెడ్డి ఛాయలతో సాగుతుంది. కొన్ని సన్నివేశాలు ఆ సినిమాను గుర్తుకు తెస్తాయి. 

మూడు భిన్న పార్శాలతో కూడిన పాత్రలతో విజయ్‌ అద్వితీయ అభినయాన్ని కనబరిచాడు. గౌతమ్‌, శీనయ్య, విదేశీ యువకుడిగా మూడు పాత్రల మధ్య చక్కటి వేరియేషన్‌ను చూపించారు.   అమాయకత్వం, మంచితనం, బాధ్యతలు కలిగిన శీనయ్యగా అతడి నటన బాగుంది. శీనయ్య పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారు. వ్యక్తిగత జీవితానికి, రచయిత పేరుతెచ్చుకోవాలనే తపనకు మధ్య నిరంతరం సంఘర్షణకు లోనయ్యే గౌతమ్‌ ఉద్వేగాల్ని పలికించిన తీరు మెప్పిస్తుంది. నటుడిగా తన ప్రత్యేకత ఏమిటో ఈసినిమాతో మరోమారు చాటిచెప్పారు విజయ్‌ దేవరకొండ.  సువర్ణగా ఐశ్వర్యారాజేష్‌ సహజ నటనతో మెప్పించింది. భర్త ప్రేమ కోసం పరితపించే భార్యగా పరిణితితో కూడిన  నటనను కనబరిచింది. తెలంగాణ యాసలో ఆమె చెప్పిన సంభాషణలు అలరిస్తాయి. రాశీఖన్నా కెరీర్‌లో ఉత్తమ పాత్రల్లో ఇది ఒకటిగా నిలుస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. యామిని పాత్రలో ఒదిగిపోయింది. ఇజాబెల్లె,  ప్రియదర్శి, జయప్రకాష్‌ కనిపించేది కొద్ది క్షణాలే అయినా తమ అభినయంతో ఆకట్టుకున్నారు. 

సాంకేతికంగా జయకృష్ణ గుమ్మడి ఛాయాగ్రహణం ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.  ఇల్లెందు, పారిస్‌ అందాలను చక్కగా కెమెరాలో బంధించారు. గోపీసుందర్‌ స్వరాల్లో ‘బొగ్గు గనిలో’ పాట బాగుంది.

రొటీన్‌ సినిమాలకు అలవాటుపడిన తెలుగు ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ను అందించే సినిమా ఇది. విజయ్‌ దేవరకొండ అభిమానుల్ని పూర్తిగా సంతృప్తి పరుస్తుంది

రేటింగ్‌:  2.75/5

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close