రాజకీయం

ప్రధాని మోదీ చెవిలో ఏం చెప్పానంటే… వైరల్​ అవుతున్న ఫొటోపై సదరు వ్యక్తి వివరణ!

  • ఫొటోలోని వ్యక్తి జుల్ఫికర్ గా గుర్తింపు
  • కేవలం ఒక ఫొటోనే అడిగానన్న జుల్ఫికర్
  • 40 సెకన్లే మాట్లాడుకున్నామని వెల్లడి
  • 40 ఏళ్ల పాటు తన జీవితంలో ఉండిపోతుందని కామెంట్

పశ్చిమ బెంగాల్ ఎన్నికలను బీజేపీ బాగా సీరియస్ గానే తీసుకుంది. అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇటీవల సోనాపూర్ లో నిర్వహించిన సభ సందర్భంగా ఓ ముస్లిం వ్యక్తి ప్రధాని మోదీ చెవిలో ఏదో చెబుతున్నట్టున్న ఒక ఫొటో వైరల్ అయింది. ఫొటోషాప్ చేసి పెట్టారని ట్రోల్స్ కూడా వచ్చాయి. ఇంతకీ, ప్రధాని మోదీ చెవిలో ఆ వ్యక్తి ఏం చెబుతున్నట్టు? అని ప్రశ్నలూ తలెత్తాయి.

అయితే, అది నిజంగా తీసిన ఫొటోనే అని ఆ ఫొటోలో ఉన్న వ్యక్తే ధ్రువీకరించాడు. ప్రధాని చెవిలో తాను ఏం చెప్పిందీ వెల్లడించాడు. ఆ వ్యక్తి పేరు జుల్ఫిఖర్ అలీ. ‘‘అవును, ఆ ఫొటోలో ఉన్నది నేనే. ఎన్నో ఏళ్లుగా బీజేపీలోనే ఉన్నాను. అయితే, ఎప్పటి నుంచో ప్రధాని మోదీని కలవాలని కోరుకుంటున్నాను. కానీ, అది ఇలా నిజమవుతుందని ఊహించలేదు. ఆయన రాగానే నేను సెల్యూట్ చేశాను. ఆయనా తిరిగి అభివాదం చేశారు’’ అని చెప్పారు.

ప్రధాని తన పేరును అడిగారన్నారు. ‘ఇంకా ఏమైనా కావాలా?’ అని అడిగారన్నారు. ‘‘నాకు ఎమ్మెల్యే టికెట్ గానీ, కౌన్సిలర్ పోస్టుగానీ వద్దని చెప్పా. నాకు కావాల్సిందల్లా మీతో ఒక ఫొటో మాత్రమే అని ఆయన చెవిలో చెప్పా. వెంటనే ఫొటోలు తీసుకున్నాం’’ అని జుల్ఫికర్ వివరించారు. కేవలం 40 క్షణాల పాటే జరిగిన ఆ సంభాషణ.. తన జీవితంలో 40 ఏళ్ల పాటు నిలిచిపోతుందని చెప్పారు.

ఫొటోషాఫ్ చేశారని ట్రోల్ చేస్తున్న వారికి.. తన ఓటర్ ఐడీ, తన వివరాలను జుల్ఫికర్ చూపించారు. చాలా మంది రాజకీయ నాయకులు ముస్లింలు కాకపోయినా.. ఓట్ల కోసం టోపీలు పెట్టుకుంటున్నారని, కానీ, తాను అసలైన ముస్లింనని చెప్పారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close