అంతర్జాతీయం

కరోనా నిర్ధారణ నిమిషాల్లోనే!

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ నిర్ధారణకు బ్రిటన్‌ పరిశోధకులు సులువైన విధానాన్ని కనుగొన్నారు. నిమిషాల వ్యవధిలోనే కరోనా వైరస్‌ను నిర్ధారించే స్మార్ట్‌ఫోన్‌ ఆధారిత పోర్టబుల్‌ కిట్‌ను రూపొందించారు. గొంతు నుంచి సేకరించిన నమూనాతో ఈ కిట్‌ ద్వారా 50 నిమిషాల్లోనే కోవిడ్‌-19ను నిర్ధారించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం ల్యాబ్‌ పరీక్షల ద్వారా కోవిడ్‌ నిర్ధారణకు 24 నుంచి 48 గంటల సమయం పడుతోంది. అయితే యూనివర్సిటీ ఆఫ్‌ ఈస్ట్‌ ఆంగ్లియా(యూఈఏ)కు చెందిన పరిశోధకులు రూపొందించిన కిట్‌తో తక్కువ సమయంలోనే కోవిడ్‌ను గుర్తించవచ్చు. ఈ కిట్‌ను నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌(ఎన్‌హెచ్‌ఎస్‌) రెండు వారాల పాటు పరీక్షించనుంది.

కొత్తగా రూపొందించిన కిట్‌ ద్వారా ఒకేసారి 16 నమూనాలను పరీక్షించే వీలుందని పరిశోధకులు వెల్లడించారు. ల్యాబ్‌ ఆధారిత నిర్ధారణ యంత్రం ద్వారా 384 నమూనాల వరకు పరీక్షించవచ్చని తెలిపారు. స్వీయ నిర్భంద వైద్య సిబ్బంది త్వరగా తిరిగి విధుల్లో చేరేందుకు ఈ కిట్‌ ఉపయోగపడుతుందన్నారు. తమకు వైరస్‌ సోకిందో, లేదో తెలుసుకోవడం పాటు తమ ద్వారా కోవిడ్‌ వ్యాప్తి​ చెందకుండా చేయడానికి ఈ కిట్‌ ఉపయోగపడుతుందని వివరించారు. 

‘ఎన్‌హెచ్‌ఎస్‌ సిబ్బందికి వేగంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలన్న ఆలోచనతో​ ఈ కిట్‌ను తయారుచేశాం. వారు ఆరోగ్యంగా ఉంటే ఎక్కువ సమయం వైద్య సేవలు అందించగలుగుతారు. ఒకవేళ వైరస్‌ సోకిందని తెలిస్తే వారి నుంచి ఇతరులకు వ్యాపించకుండా చేయడానికి వెంటనే వీలు కలుగుతుంది. రెండు వారాల్లో దేశంలోని అన్ని ఆస్పత్రుల్లో ఈ కిట్‌ అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నాం. గొంతు నుంచి సేకరించిన నమూనా నుంచి 3 నిమిషాల్లోనే ఆర్‌ఎన్‌ఏను వెలికితీసి కోవిడ్‌-19 నిర్థారిత పరీక్షలు చేస్తాం. తక్కువ నైపుణ్యం కలిగిన వైద్య సిబ్బంది కూడా ఈ కిట్‌ను ఉపయోగించేలా రూపొందించామ’ని పరిశోధక బృందానికి నేతృత్వం వహించిన జస్టిన్‌ ఓ గ్రాడీ పేర్కొన్నారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close