అంతర్జాతీయంటాప్ స్టోరీస్

బైడెన్‌కు ఆ “బిస్కెట్” ఇవ్వకుండానే వెళ్లిపోయిన ట్రంప్‌

2018.. 

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కొత్త సంవత్సరంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. “నా ఆఫీసు టేబుల్‌పై అణు బటన్ ఉన్నది. అమెరికా మొత్తం మా అణు క్షిపణుల పరిధిలో ఉన్నది” అని చెప్పారు.

అదే రోజు సాయంత్రానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ నుంచి సమాధానం వచ్చింది. “నా దగ్గర న్యూక్లియర్ బటన్ కూడా ఉన్నది. ఇది కిమ్ బటన్ కంటే పెద్దది, అలాగే శక్తివంతమైనది. మరో విషయం ఏమిటంటే నా బటన్ కూడా పనిచేస్తుంది”.

రెండు దేశాల అధినేతల వాగ్వాదం మధ్య.. అణు బటన్ చర్చ ఆనాడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కాగా, ఇన్నిరోజులకు న్యూక్లియార్‌ ఫుట్‌బాల్‌, న్యూక్లియార్‌ బిస్కెట్‌ మరోసారి వార్తల్లో ప్రధానాంశాలుగా మారాయి. న్యూక్లియార్‌ ఫుట్‌బాల్‌తోపాటు న్యూక్లియార్‌ బిస్కెట్‌ను కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌కు అందజేయకుండానే డొనాల్డ్‌ ట్రంప్‌ శ్వేతసౌధాన్ని వీడి తన రిసార్ట్స్‌కు వెళ్లిపోయారు. దాంతో ఫుట్‌బాల్‌, బిస్కెట్‌ గురించిన గుసగుసలు వినిపించాయి. ఇలా జరుగడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

న్యూక్లియర్ ఫుట్‌బాల్, బిస్కెట్లు ఏమిటి..?


బుధవారం ఉదయం డొనాల్డ్‌ ట్రంప్ వైట్ హౌస్ నుంచి నిష్క్రమించారు. మధ్యాహ్నం జో బైడెన్ అమెరికా కొత్త అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకరించారు. పాత అధ్యక్షుడు కార్యాలయాన్ని విడిచిపెట్టి, కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారంతో అధికార బదిలీ జరుగాల్సి ఉండగా.. ట్రంప్ గైర్హాజరయ్యారు. సంప్రదాయాల ప్రకారం అధికార బదిలీ జరిగి ఉంటే.. ప్రపంచాన్ని నాశనం చేసే శక్తి.. అణుశక్తి కొత్త అధ్యక్షుడి చేతిలోకి వచ్చేది. వాస్తవానికి, ఈ అణుశక్తికి సంబంధించిన వివరాలు, సీక్రెట్ కోడ్‌లు నల్ల బ్రీఫ్‌కేస్‌లో పెట్టి సీల్‌ వేసి ఉంచుతారు. ఈ బ్రీఫ్‌కేస్‌ను న్యూక్లియర్ ఫుట్‌బాల్ అని అంటారు. అధ్యక్షుడి వద్ద రెండు ‘న్యూక్లియర్ ఫుట్‌బాల్’ , మరీ ముఖ్యంగా ‘న్యూక్లియర్ లాంచ్ కోడ్’ రెండు సెట్లు ఉంటాయి. అణు సంకేతాలు కార్డుపై వ్రాసి ఉంటాయి. ఈ కార్డునే ‘న్యూక్లియర్ బిస్కెట్’ అని కూడా పిలుస్తారు. ఈ రెండూ అమెరికా అధ్యక్షుడి వెన్నంటే ఉంటాయి. ఆయన ఎక్కడికి వెళ్లిన ఈ రెండింటినీ తనతో తీసుకెళ్లడం ఆనవాయితీ. 

బదిలీ ప్రక్రియ ఎలా జరుగుతుంది?

బ్లాక్ బ్రీఫ్‌కేస్‌లో అణు దాడులకు సంబంధించిన సంకేతాలు ఉంటాయి. దీని ద్వారా మాత్రమే అమెరికా అధ్యక్షుడు పెంటగాన్‌కు అణు దాడిని ఆదేశించగలరు. ఈ అణు నియమావళి ప్రెసిడెంట్‌ మారినప్పుడల్లా మారకుండా ఎప్పటికీ ఒకే కోడ్‌తో ఉంటాయి. అమెరికా కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. ఈ రెండు బ్రీఫ్‌కేస్‌లు ఒకదాని వెంట మరొకటి కొత్త అధ్యక్షుడికి అందజేస్తారు. అయితే, ట్రంప్ గైర్హాజరీతో ఈసారి బ్లాక్‌ బ్రీఫ్‌కేస్‌ బదలాయింపు జరగలేదు. అమెరికన్ చరిత్రలో ఒక పాత అధ్యక్షుడు అణు ప్రయోగ కోడ్‌ను కొత్త అధ్యక్షుడికి బదిలీ చేయకపోవడం బహుశా ఇదే మొదటిసారి.

ఎక్స్‌పైర్‌ అయిన కోడ్‌లు..

డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఉదయం వైట్ హౌస్ నుంచి ఫ్లోరిడా బయలుదేరారు. అతనితో పాటు న్యూక్లియర్ ఫుట్‌బాల్ కూడా ఫ్లోరిడాకు వెళ్ళింది. కానీ, అందులో ఉంచిన అణు ప్రయోగ సంకేతాలు మధ్యాహ్నం 12 గంటలకు ఎక్స్‌పైర్‌ అయిపోయాయి. క్రెడిట్ కార్డు పాస్‌వర్డ్‌ల గడువు ముగిసినట్లే బైడెన్ ప్రమాణ స్వీకారం చేయడంతో న్యూక్లియార్‌ ఫుట్‌బాల్‌ గడువు కూడా ముగిసిపోయింది. ఇలాఉండగా, కొత్త అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన జో బైడెన్‌కు రెండు న్యూక్లియార్‌ ఫుట్‌బాల్స్‌తోపాటు బిస్కెట్లు కూడా అందాయి. వీటిని ఆమెరికా ఆర్మీ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌.. బైడెన్‌కు బదిలీ చేశారు. అమెరికాలో ఈ విధానం అమలులోకి వచ్చిన ఏడు దశాబ్దాల తర్వాత తొలిసారి ఇలా జరిగినట్లు అధికారులు చెప్తున్నారు.

రాష్ట్రపతి విదేశాల్లో ఉన్నప్పుడు ఏమి చేస్తారు?

అమెరికా అధ్యక్షుడు విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో అతని వెంట న్యూక్లియర్ కంట్రోల్, కమాండ్ బృందం కూడా ఉంటుంది. ఇందులో కమ్యూనికేషన్ టూల్స్, ఆర్మీ అధికారులతో యుద్ధ ప్రణాళిక పుస్తకం కూడా ఉంటాయి. అధ్యక్షుడు విదేశాల నుంచి దాడికి ఆదేశించాలంటే.. అతను అణు కోడ్ ద్వారా పెంటగాన్‌లోని సైనిక అధికారులను సంప్రదిస్తారు. ఈ కోడ్ ప్రెసిడెంట్‌ వద్ద మాత్రమే ఉంటుంది. అధ్యక్షుడు ఇచ్చిన అణు ప్రయోగ ఆదేశాలు పెంటగాన్ నుంచి స్ట్రాటజిక్ కమాండ్‌ చేరుకుని.. అక్కడి నుంచి అమలవుతుంది. ఇలాఉండగా, అత్యవసర సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అమెరికా అధ్యక్షుడి వద్ద అణు ప్రయోగ కోడ్‌కు సంబంధించి 4 న్యూక్లియార్‌ ఫుట్‌బాల్స్‌ ఉన్నాయని చెప్తుంటారు. ఒక ఫుట్‌బాల్‌ ఉపాధ్యక్షుడి వద్ద ఉండగా.. మిగతా రెండు ఫుట్‌బాళ్లను స్టాండ్‌బైలో ఉంచుతారంట. అమెరికాలో న్యూక్లియర్ ఫుట్‌బాల్, లాంచ్ కోడ్‌లు అన్నీ ఒకే మాదిరిగా ఉంటాయని అమెరికా భద్రతా నిపుణుడు స్టీఫెన్ స్వర్ట్జ్ చెప్తున్నారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close