ఆంధ్ర

సీఐడీ నోటీసుల‌పై ఏపీ హైకోర్టులో విచార‌ణ‌.. పిటిషన్ లో పలు విషయాలను ఉటంకించిన చంద్ర‌బాబు

  • అసైన్డు భూముల హక్కుదారులకు ప్రయోజనాలు
  • చట్ట నిబంధనల మేరకే జీవో జారీ
  • ఇన్నేళ్ల త‌ర్వాత దురుద్దేశంతో వైసీపీ నేత ఫిర్యాదు
  • న‌న్ను నేర బాధ్యుడిగా పేర్కొనడం అసంబద్ధం

ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణకు ఇటీవ‌ల సీఐడీ నోటీసులు జారీ చేయ‌డంతో వాటిని స‌వాలు చేస్తూ హైకోర్టులో వారిద్ద‌రు క్వాష్ పిటిషన్‌ దాఖలు చేసిన విష‌యం తెలిసిందే. ఈ రోజు హైకోర్టులో వాటిపై విచార‌ణ జరుగుతోంది.

అమ‌రావ‌తి అసైన్డ్‌ భూముల వ్యవహారంలో ప‌లు వివ‌రాలను తన పిటిషన్ లో పేర్కొన్న చంద్ర‌బాబు.. సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని త‌న‌ తరఫు న్యాయవాదుల ద్వారా కోర్టును కోరారు. చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ్‌ లూత్ర, నారాయణ తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తున్నారు.

 హైకోర్టులో వీటిపై విచారణ జరుగుతోంది. చంద్రబాబు త‌న పిటిష‌న్‌లో తెలిపిన వివ‌రాల ప్రకారం.. అమ‌రావ‌తి రాజధాని ఏర్పాటు కోసం విజయవాడ చుట్టుపక్కల 2014, సెప్టెంబర్ 1న అప్ప‌టి ఏపీ కేబినెట్‌ నిర్ణయం తీసుకుని, సెప్టెంబర్‌ 4న శాసనసభ ముందు ఉంచారు. దీంతో సభ ఏకగ్రీవంగా తీర్మానించింది.  

అనంత‌రం రాజధాని గ్రామాల ప్రజలకు భూసమీకరణ విధానాన్ని తెలిపారు. భూసమీకరణ పథకాన్ని తీసుకొచ్చి, ఏపీ సీఆర్‌డీఏ చట్టాన్ని రూపొందించారు. భూసమీకరణపై 2015, జనవరి 1న జీవో 1 జారీ, అసైన్డు భూముల హక్కుదారులకు ప్రయోజనాలు కల్పించేందుకు 2016, ఫిబ్రవరి 17న జీవో 41 జారీ అయ్యాయి.  

చట్ట నిబంధనల మేరకే ఆ జీవో జారీచేశారు. ఇప్పుడు ఇన్నేళ్ల త‌ర్వాత దురుద్దేశంతో వైసీపీ నేత‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా త‌న‌పై తప్పుడు కేసు నమోదు చేశారని చంద్ర‌బాబు పిటిష‌న్‌లో ఆరోపించారు. ఒక‌వేళ‌ నిబంధనలపై అభ్యంతరాలు ఉంటే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కోర్టులో సవాలు చేసుకోవచ్చని, అంతేగానీ, గ‌త ప్రభుత్వ హయాంలో నిబంధనలు రూపొందించారనే కారణంతో త‌న‌ను నేర బాధ్యుడిగా పేర్కొనడం అసంబద్ధమ‌ని చంద్ర‌బాబు పిటిషన్ లో తెలిపారు.

తాము నష్టపోయామని గ్రామస్థులుగానీ, భూ యజమానులుగానీ ఇన్నేళ్లుగా ముందుకు రాలేదని, ఇప్పుడు వారి తరఫున వైసీపీ నేత అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తుండ‌డం చూస్తే ప్ర‌త్య‌ర్థి పార్టీపై అనుమానాలు క‌లుగుతున్నాయ‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close