క్రైమ్

యాసిడ్ దాడి వీడియో.. టిక్‌టాక్ స్టార్ అకౌంట్ తొల‌గింపు

టిక్‌టాక్ స్టార్ ఫైజ‌ల్ సిద్ధిఖీ అకౌంట్‌ను ఆ యాప్ సంస్థ స‌స్పెండ్ చేసింది.  ఫైజ‌ల్ పోస్టు చేసిన ఓ వీడియో వివాదాస్ప‌దం కావ‌డంతో అత‌ని అకౌంట్‌ను తొల‌గించారు.  యాసిడ్ దాడిని ప్రోత్స‌హించే విధంగా టిక్‌టాక్ స్టార్ నెల రోజుల క్రితం ఓ వీడియోను పోస్టు చేశాడు. ఆ వీడియోలో ఓ యువ‌తిపై అత‌ను యాసిడ్ పోస్తాడు.  దానిపై అభ్యంత‌రాలు వ్య‌క్తం అయ్యాయి.  ఇండియాలో టిక్‌టాక్‌ను బ్యాన్ చేయాల‌ని కూడా విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.  ట్విట్ట‌ర్‌లోనూ ఈ అంశం ట్రెండింగ్ అయ్యింది.  యాసిడ్ దాడి వీడియో వివాదాస్ప‌దం కావ‌డమే కాదు, దాన్ని ప్రోత్స‌హంగా తీసుకుని అనేక మంది కూడా ఇలాంటి దాడి వీడియోల‌ను చేయ‌డం మొద‌లుపెట్టారు.  ఈ నేప‌థ్యంలో టిక్‌టాక్ యాప్ సంస్థ‌.. ఫైజ‌ల్ సిద్దిఖీ అకౌంట్‌ను స‌స్పెండ్ చేసింది. 

ఫైజ‌ల్‌కు సుమారు 13 ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు. అయితే యాసిడ్ అటాక్ దాడి వీడియోలో మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రుస్తున్న‌ట్లు కూడా ఫైజ‌ల్ డైలాగ్‌లు ఉన్నాయి. వాడి కోసం న‌న్ను వ‌దిలేశావు, ఇప్పుడు వాడు నిన్ను వ‌దిలేశాడ‌న్న డైలాగ్ కొట్టిన ఫైజ‌ల్‌.. ఆ త‌ర్వాత ఓ యువ‌తిపై యాసిడ్ పోస్తాడు. ఆ త‌ర్వాత ఆ అమ్మాయి ముఖం మారిపోతుంది. ఈ వీడియోపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.  యాసిడ్ దాడిని గొప్ప‌గా చిత్రీక‌రించ‌డాన్ని యాసిడ్ దాడి బాధితురాలు ల‌క్ష్మీ అగ‌ర్వాల్ త‌ప్పుప‌ట్టారు. ఆ వీడియో తీసిన ఫైజ‌ల్‌పై ఆమె విరుచుకుపడింది. ఆ వీడియో ప‌ట్ల ఫైజ‌ల్‌కు నోటీసులు ఇచ్చిన జాతీయ మ‌హిళా క‌మిష‌న్‌కు ఆమె థ్యాంక్స్ చెప్పింది.   

టిక్‌టాక్‌లో ప్ర‌జ‌లు భ‌ద్ర‌త‌కు ప్రాముఖ్య‌త ఇస్తామ‌ని, ఇత‌రుల భ‌ద్ర‌త‌ను ఇబ్బందుల్లో పెట్టే వీడియోలు రూపొందించే వారి ప‌ట్ల క‌ఠినంగా ఉంటామ‌ని టిక్‌టాక్ ప్ర‌తినిధి ఒక‌రు తెలిపారు.మ‌హిళ‌ల ప‌ట్ల హింస‌ను ప్రోత్స‌హించ‌మ‌న్నారు. ఫైజ‌ల్ అకౌంట్ తొల‌గించి, ఈ అంశంలో  పోలీసుల‌కు స‌హ‌క‌రిస్తున్న‌ట్లు టిక్‌టాక్ పేర్కొన్న‌ది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close