ఆర్మీ నకిలీ ఐడీకార్డులు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్

డెహ్రాడూన్ : ఇండియన్ ఆర్మీకి చెందిన నకిలీ గుర్తింపు కార్డులు తయారు చేస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు ఉత్తరాఖండ్‌కు చెందిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ గురువారం తెలిపింది. ఈ సందర్భంగా ఎస్టీఎఫ్ పోలీస్ సూపరింటెండెంట్ అజయ్ సింగ్ మాట్లాడుతూ ఎస్టీఎఫ్ బృందానికి అందిన సమాచారం మేరకు నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. నకిలీ ఇండియన్ ఆర్మీ కార్డులను వినియోగించి ఉద్యోగాలు పొందవచ్చని, ముఖ్యంగా ఆఫ్గనిస్తాన్ వంటి దేశాల్లో అనేక ఉద్యోగావకాశాలను లభిస్తాయని మభ్యపెడుతూ నిందితులు మోసానికి పాల్పడ్డారని తెలిపారు. ఇప్పటి వరకు వందల సంఖ్యలో ఐడీకార్డులు తయారు చేసి పోస్ట్‌లో పంపినట్లు నిందితులు వెల్లడించారని ఎస్టీఎఫ్ ఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి కొన్ని నకిలీ ఐడీ కార్డులు, ఇండియన్ ఆర్మీ స్టాంప్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు.