జాతీయంటాప్ స్టోరీస్

దాడి వెనుక ఏబీవీపీ నాయకుల పాత్ర!

  • జేఎన్‌యూలో జరిగిన హింసాకాండపై దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలు
  • విదేశాల్లోని ఆక్స్‌ఫర్డ్‌, కొలంబియా, ససెక్స్‌యూనివర్సిటీల్లోనూ ప్రదర్శనలు
  • వీసీ రాజీనామా లేదా బర్తరఫ్‌కు జేఎన్‌యూఎస్‌యూ, జేఎన్‌యూటీఏ డిమాండ్‌
  • ప్లాన్‌ ప్రకారమే దాడి జరిగిందన్న ఆయిశీ ఘోష్‌
  • రేపు దేశవ్యాప్తంగా యూనివర్సిటీల్లో ఆందోళనలకు జేఎన్‌యూఎస్‌యూ పిలుపు
  • గూండాగిరిపై ఆగ్రహం

అంతర్జాతీయ సమాజంలో మన దేశం పేరు ప్రతిష్ఠల గురించి ఆలోచించే భారతీయులెవరైనా ఆవేదన చెందే పరిస్థితి ఇది. నాజీల పాలనలోకి వెళ్లే ముందు జర్మనీలో చోటుచేసుకున్న ఘటనల తాలూకు ప్రతిధ్వని నేడు (భారత్‌లో) వినిపిస్తున్నది. జేఎన్‌యూలో వాస్తవానికి ఏం జరిగిందనేదానికి ప్రభుత్వం ప్రాధాన్యమివ్వాలి.. అంతేగానీ, ప్రత్యారోపణల జోరులో అది కనుమరుగయ్యేలా వ్యవహరించవద్దు.
-అభిజిత్‌ బెనర్జీ, నోబెల్‌ బహుమతి గ్రహీత, జేఎన్‌యూ మాజీ విద్యార్థి
ఢిల్లీలోని జేఎన్‌యూలో ఆదివారం రాత్రి జరిగిన హింసాకాండకు నిరసనగా సోమవారం దేశవ్యాప్తంగా విద్యార్థులు గర్జించారు. విదేశాల్లోని ఆక్స్‌ఫర్డ్‌, కొలంబియా వర్సిటీల్లోనూ ప్రదర్శనలు జరిగాయి. వీసీ వ్యతిరేక నినాదాలతో జేఎన్‌యూ క్యాంపస్‌ దద్దరిల్లింది. హింసకు ఆయనే కారణమని ఆరోపించిన విద్యార్థులు.. వీసీ రాజీనామా లేదా బర్తరఫ్‌కు డిమాండ్‌ చేశారు. పక్కా ప్లాన్‌ ప్రకారమే విద్యార్థులు, సిబ్బందిపై దాడి జరిగిందని జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు ఆయిశీ ఘోష్‌ పేర్కొన్నారు. ఇందులో వర్సిటీ భద్రతాసిబ్బంది, పలువురు ప్రొఫెసర్లకు పాత్ర ఉన్నదని ఆరోపించారు. మరోవైపు హింసలో ఏబీవీపీ నేతల పాత్ర ఉన్నట్టు నిరూపించే పలు ఆధారాలు బయటికి వచ్చాయి. విపక్ష పార్టీల నేతలు, వివిధ రాష్ర్టాల సీఎంలు కేంద్రంపై దుమ్మెత్తిపోశారు. బాలీవుడ్‌ ప్రముఖులు, పలువురు పారిశ్రామికవేత్తలు జేఎన్‌యూ ఘటనను ఖండించారు. తాజా పరిణామాలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ, ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆరా తీశారు.
న్యూఢిల్లీ, జనవరి 6: ఢిల్లీలోని జవహర్‌లాల్‌ యూనివర్సిటీలో (జేఎన్‌యూ) ఆదివారం రాత్రి జరిగిన హింసపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. జేఎన్‌యూ క్యాంపస్‌ సోమవారం వైస్‌ చాన్స్‌లర్‌ (వీసీ) వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లింది. హింసకు వీసీ ఎం జగదీశ్‌ కుమారే కారణమని విద్యార్థులు ఆరోపించారు. వెంటనే ఆయన రాజీనామా చేయాలని లేదా కేంద్రం ఆయన్ను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. బుధవారం దేశవ్యాప్తంగా వర్సిటీల్లో ఆందోళనలు చేపట్టా లని జేఎన్‌యూఎస్‌యూ పిలుపునిచ్చింది.

వీసీ.. పెద్ద రౌడీ: జేఎన్‌యూఎస్‌యూ

వర్సిటీలో హింసకు వీసీయే కారణమని జేఎన్‌యూ స్టూడెంట్స్‌ యూనియన్‌ (జేఎన్‌యూఎస్‌యూ) ఆరోపించింది. ఆయన పెద్ద రౌడీ మాదిరిగా ప్రవర్తిస్తున్నారని, చట్టవ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘ఫీజుల పెంపును నిరసిస్తూ దాదాపు 70 రోజులుగా ఆందోళన చేస్తున్నాం. ఎంతకీ తగ్గకపోవడంతో వీసీ ఒత్తిడి, నిరాశలో కూరుకుపోయారు. దాని ఫలితంగానే ఆదివారం హింస జరిగింది’ అని పేర్కొన్నది. ఏబీవీపీ గూండాలు బయటి నుంచి స్వేచ్ఛగా క్యాంపస్‌లోకి వెళ్లేలా పోలీసులు సహకరించారని, పలుమార్లు ఫోన్‌ చేసినా ఒక్కరూ రాలేదని సంఘం ఉపాధ్యక్షుడు సాకేత్‌ మూన్‌ ఆరోపించారు. జేఎన్‌యూ టీచర్స్‌ అసోసియేషన్‌(జేఎన్‌యూటీఏ) ఆధ్వర్యంలో సోమవారం సబర్మతి హాస్టల్‌ నుంచి ప్రధాన గేట్‌ వరకు నిరసన ర్యాలీ జరిగింది. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ హింసకు పూర్తి బాధ్యత వీసీదేనని, ఆయనను తొలిగించాలని కోరుతూ రాష్ట్రపతి కోవింద్‌కు లేఖరాశామన్నారు.

JNU2

విద్యార్థుల మధ్య ఘర్షణే: జేఎన్‌యూ

విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణే హింసకు దారితీసిందని జేఎన్‌యూ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నది. ‘ఫీజుల పెంపును నిరసిస్తూ.. సెమిస్టర్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను వ్యతిరేకిస్తున్న విద్యార్థుల గుంపు ఆదివారం సాయంత్రం 4:30 గంటలకు అడ్మినిస్ట్రేషన్‌ బ్లాక్‌ నుంచి హాస్టళ్లవైపు దూకుడుగా వెళ్లింది. కొందరు విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ కోసం వర్సి టీ భవనంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. వారు భౌతికదాడికి పాల్పడ్డారు. అదేసమయంలో ముసుగు ధరించిన వ్యక్తులు హాస్టళ్లలోకి చొరబడి రాడ్లు, కట్టెలతో విద్యార్థులపై దాడి చేశారు’ అని పేర్కొన్నారు. కొందరు సెక్యూరిటీగార్డులు కూడా గాయపడ్డారని తెలి పారు. విద్యార్థులు హాస్టళ్లవైపు వెళ్లగానే పోలీసులకు సమాచారం ఇచ్చామని, వారు వచ్చేసరికే హింస చెలరేగిందన్నారు. వర్సిటీ ప్రకటన ప్రకారం.. ఈ నెల 1న సెమిస్టర్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. కొందరు దీనిని అడ్డుకునేందుకు 3న సర్వర్‌లను పనిచేయకుండా చేశారు. 4న సర్వర్‌లను తిరిగి అందుబాటులోకి తేగా మళ్లీ సర్వర్‌ కేబుళ్లను ధ్వంసంచేశారు. ఈ గుంపు కొన్నాళ్లుగా తరగతి గదులను మూసివేస్తున్నారని, నిరసనల్లో పాల్గొనని విద్యార్థులు, సిబ్బందిని అడ్డుకుంటున్నారని చెప్పారు.

శాంతియుతంగా ఉండండి: వీసీ జగదీశ్‌

విద్యార్థులంతా శాంతియుతంగా ఉండాలని వీసీ జగదీశ్‌ కుమార్‌ విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల విద్యాప్రయోజనాలను కాపాడటమే తమకు అత్యంత ప్రాధాన్య అంశమని ఓ ప్రకటనలో తెలిపారు. కొందరు నిరసనకారులు అకడమిక్‌ కార్యకలాపాలను అడ్డుకుంటూ వేల మంది నిజమైన విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని,వారిని విడిచిపెట్టబోమని హెచ్చరించారు.

వెంటనే స్పందించాం: పోలీసులు

దాడి ఘటనలో తమ నిర్లక్ష్యమేమీ లేదని ఢిల్లీ పోలీసు శాఖ అధికార ప్రతినిధి మన్‌దీప్‌ సింగ్‌ స్పష్టంచేశారు. కాల్స్‌కు వెంటనే స్పందించామని, హింసను అదుపు చేయడానికి బాధ్యతాయుతంగా వ్యవహరించామన్నారు. ఫిర్యాదులన్నింటిపై కేసు నమోదు చేసి దర్యాప్తు బాధ్యతను క్రైమ్‌ బ్రాంచ్‌కు అప్పగించినట్టు తెలిపారు. కొన్ని కీలక ఆధారాలు దొరికాయని, నిందితులను గుర్తిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్‌ చేయలేదన్నారు. మరోవైపు పోలీసులకు ఢిల్లీ మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసింది.

Bengaluru

లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు అమిత్‌ షా ఫోన్‌

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సోమవారం ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌కు ఫోన్‌ చేశారు. జేఎన్‌యూ ప్రతినిధుల బృందాన్ని పిలిపించుకొని సమీక్షించాలని సూచించారు. ఈ మేరకు జేఎన్‌యూ ప్రో-వీసీ చింతామణి మహాపాత్ర, రిజిస్ట్రార్‌ ప్రమోద్‌కుమార్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వద్దకు వెళ్లి పరిస్థితిని వివరించారు. మరోవైపు కేంద్ర మానవ వనరుల (హెచ్చార్డీ) మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారుల బృందం సోమవారం జేఎన్‌యూ అధికారులతో సమావేశమైంది. దీనికి వీసీ జగదీశ్‌ కుమార్‌ హాజరుకాలేదు. కాగా, సెమిస్టర్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఈ నెల 12 వరకు పొడిగిస్తున్నట్లు జేఎన్‌యూ ప్రకటించింది.

-హెచ్చార్డీ మంత్రి రమేశ్‌ ఫోక్రియాల్‌ స్పంది స్తూ.. విద్యాసంస్థలు రాజకీయ కేంద్రాలుగా మారొద్దని కోరారు.
-విద్యార్థులకు రక్షణ కల్పించనందుకు నైతిక బాధ్యత వహిస్తూ జేఎన్‌యూలోని సబర్మతి హాస్టల్‌కు చెందిన వార్డెన్లు రామావతార్‌ మీనా, ప్రకాశ్‌ చంద్ర సాహో సోమవారం రాజీనామా చేశారు.
-జేఎన్‌యూ విద్యార్థులు, సిబ్బంది కలిపి మొత్తం 36 మంది గాయాలతో తమ దవాఖానలో చేరినట్టు ఎయిమ్స్‌ తెలిపింది. వారందరినీ సోమవారం డిశ్చార్జి చేశామని చెప్పింది. వీరిలో నలుగురికి తలకు గాయాలైనట్టు అధికారులు తెలిపారు.
-సోమవారం పదుల సంఖ్యలో విద్యార్థిను లు క్యాంపస్‌ను వదిలి ఇండ్లకు వెళ్లడం కనిపించింది. పరిస్థితులు చక్కబడిన తర్వాతే తిరిగివస్తామని చెప్పినట్టు సమాచారం. జేఎన్‌యూ వద్ద దాదాపు 700 మంది పోలీసులను మోహరించారు. జేఎన్‌యూ లో మూక దాడులను నియంత్రించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించని కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

మొదటి అంతస్తు నుంచి కిందికి దూకేశాం

జేఎన్‌యూకు చెందిన ఓ కశ్మీరీ విద్యార్థి తన భయానక అనుభవాన్ని వివరించారు. ‘ఆదివారం సాయంత్రం హాస్టల్‌లోని మొదటి అంతస్తులో ఉన్న మా గదిలో ముగ్గురు నలుగురం ఉన్నాం. ఆ సమయంలో మా స్నేహితుడొకరు వచ్చి ఏబీవీపీ వాళ్లు లాఠీలు, రాడ్ల తో వస్తున్నారని చెప్పాడు. దీంతో మేము తలుపులు మూసేసి గొళ్లెం పెట్టాం. కొన్ని సెకండ్లకే కొందరు మా గది తలుపులు బాదడం మొదలుపెట్టారు. అద్దాలను పగలగొట్టారు. దీంతో మేము మా గది కిటికీ లోనుంచి కిందికి దూకేశాం’ అని చెప్పారు.
– నేను మరో ఇద్దరు ప్రొఫెసర్లతో కలిసి బస్టాప్‌ వద్ద ఉండగా 50 మంది ముసుగు ధరించిన వ్యక్తులు మాపై రాళ్లు విసిరారు. చుట్టుముట్టి తీవ్రంగా కొట్టారు. నాతోపాటు ప్రొఫెసర్‌ సుచిత్రాసేన్‌ తీవ్రంగా గాయపడ్డారు.
– ప్రొఫెసర్‌ సౌగతా భాదురి
– జేఎన్‌యూలోనే చదువుకొని, ఇక్కడే అధ్యాపకురాలిగా పనిచేస్తున్న నాకు.. 20 ఏండ్లలో మొదటిసారి వర్సిటీకి వెళ్లాలంటేనే నాకు భయంగా ఉన్నది. క్యాంపస్‌లోని పరిస్థితులపై విద్యార్థులతో కలిసి చర్చిస్తుండగా కొందరు దుండగులు దాడిచేశారు.
– ప్రొఫెసర్‌ సుచిత్రా సేన్‌

ఇది వ్యవస్థీకృత దాడి

-ఆయిశీ ఘోష్‌

JNU1

తనతోపాటు మిగతా విద్యార్థులపై ప్రణాళిక ప్రకారమే దాడి జరిగిందని జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు ఆయిశీ ఘోష్‌ ఆరోపించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆదివారం క్యాంపస్‌లో శాంతిర్యాలీ నిర్వహిస్తుండగా కొందరు నన్ను లక్ష్యంగా చేసుకొన్నారు. ముసుగు వేసుకున్న 25మంది ర్యాలీని అడ్డుకొని నా తలపై ఇనుప రాడ్లతో కొట్టారు’ అని పేర్కొన్నారు. దుండగుల్లో వర్సిటీ విద్యార్థులతోపాటు బయటివారు కూడా ఉన్నారని, ప్లాన్‌ ప్రకారం ఒక్కొక్కరిని ఒంటరిని చేసి కొట్టారని చెప్పారు. ఈ దాడిని వ్యవస్థీకృత దాడిగా అభివర్ణించారు. ‘దుండగులను అడ్డుకునేందుకు వర్సిటీలోని భద్రతా సిబ్బంది కనీస ప్రయత్నం చేయలేదు. వారికి, దుండగులకు సంబంధం ఉన్నదనేది సుస్పష్టం. మా ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేందుకు ఆరెస్సెస్‌ అనుబంధ ప్రొఫెసర్లు గత నాలుగైదురోజులుగా హింసను ప్రేరేపిస్తున్నారు’ అని ఆరోపించా రు. అయినా వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశా రు. వీసీ రాజీనామాకు డిమాండ్‌ చేశారు. బుధవారం దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారు.
‘ప్రజాస్వామ్యంపై ప్రణాళికాబద్ధంగా జరిగిన దాడి ఇది. విద్యార్థులమీద బీజేపీ నియంతృత్వ మెరుపుదాడులకు (సర్జికల్‌ స్ట్రైక్స్‌కు) పాల్పడుతున్నది. బీజేపీకి వ్యతిరేకంగా గళమెత్తిన వారిని దేశ వ్యతిరేకులు, పాకిస్థానీయులుగా ముద్రవేస్తున్నారు’
-మమతా బెనర్జీ, బెంగాల్‌ సీఎం
‘జేఎన్‌యూలోనే గాక ఇతర యూనివర్సిటీల్లోనూ విద్యార్థులను బీజేపీ అణగదొక్కుతున్నది. విద్యార్థుల శక్తి, అండతో అధికారంలోకి వచ్చిన ఎన్టీయే ప్రభుత్వం వారిని అణచివేస్తున్నది. కేంద్రంలో అధికారం నుంచి తప్పుకోవాల్సిన సమయం బీజేపీకి ఆసన్నమైంది’
-భూపేశ్‌ భగేల్‌, ఛత్తీస్‌గఢ్‌ సీఎం
జేఎన్‌యూ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు, ప్రభుత్వాన్ని వ్యతిరేకించేవారిని అణగదొక్కేందుకు జరిగిన పిరికి ఫాసిస్ట్‌ దాడి ఇది.
-డీ రాజా, సీపీఐ ప్రధాన కార్యదర్శి
‘జేఎన్‌యూ విద్యార్థులు, అధ్యాపకులపై నాజీల మాదిరిగా దాడులకు పాల్పడిన వారు దేశంలో అశాంతి, హింసకు ప్రయత్నిస్తున్నారు. వర్సిటీల్లో రక్తపాతం సృష్టించి విద్యార్థుల నోళ్లు మూయించేందుకు చేస్తున్న కుట్రలను సంఘ్‌ పరివార్‌ ఇకనైనా ఆపాలి’
-పినరాయి విజయన్‌, కేరళ సీఎం
జేఎన్‌యూ వీసీని వెంటనే తొలిగించాలి. వర్సిటీలో విద్యార్థుల మధ్య ఆయన గొడవలు సృష్టిసున్నారు. వీసీపై రాష్ట్రపతి వెంటనే చర్యలు తీసుకోవాలి.
– సీతారాం ఏచూరి, సీపీఎం ప్రధాన కార్యదర్శి
‘ పాక్‌ వ్యవస్థాపకుడు జిన్నా ప్రతిపాదించిన రెండు దేశాల (మత ప్రాదిపతికన దేశాన్ని విభజించిన) సిద్ధాంతాన్ని ప్రధాని అనుసరిస్తున్నారు. హిందూ జిన్నాగా మోదీ అవతరించారు. -తరుణ్‌ గొగోయ్‌, అసోం మాజీ సీఎం

జేఎన్‌యూ దాడిలో ఏబీవీపీ పాత్ర!

-వెలుగులోకి పలు ఫొటోలు, వీడియోలు

ABVP

ఢిల్లీలోని జేఎన్‌యూలో ఆదివారం రాత్రి ముసుగులు ధరించిన గూండాలు విద్యార్థులపై దాడికి పాల్పడిన ఘటనలో బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ‘అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌-ఏబీవీపీ’ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏబీవీపీ జేఎన్‌యూ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడు వికాస్‌ పటేల్‌.. లాఠీలు చేతబట్టిన కొంతమందితో కలిసి ఉన్న ఫొటో బయటకు వచ్చింది. పోలీసుల వద్ద ఉండే ఫైబర్‌ లాఠీని పటేల్‌ చేతబట్టినట్లు అందులో కనిపిస్తున్నది. ఆయన పక్కన నీలం, పసుపు షర్టు ధరించిన విద్యార్థిని శివ్‌ పూజన్‌ మండల్‌గా గుర్తించారు. బీఏ మొదటి సంవత్సరం చదువుతున్న అతడిని ఏబీవీపీకి చెందినవాడిగా భావిస్తున్నారు. మరికొన్ని ఫొటోలు, క్యాంపస్‌లోకి ప్రవేశిస్తున్న గుంపులోనూ, బయటకు వస్తున్నప్పుడు రికార్డయిన వీడియోలోనూ మండల్‌ ఉన్నాడు. ఈ నేపథ్యంలో మండల్‌, పటేల్‌ తమ సామాజిక మాధ్యమ ఖాతాలను డిలీట్‌ చేయడం గమనార్హం. ఏబీవీపీ సభ్యులకు చెందిన ఒక వాట్సాప్‌ గ్రూపులో దాడిపై జరిగిన చర్చకు సంబంధించిన స్క్రీన్‌షాట్లు బయటకు రాగా, అందులో పటేల్‌ నంబర్‌ కనిపించింది. విద్యార్థులైన యోగేంద్ర భరద్వాజ్‌, సందీప్‌ సింగ్‌ నంబర్లు కూడా ఆ స్క్రీన్‌ షాట్లలో ఉన్నాయి. భరద్వాజ్‌ తన సోషల్‌ మీడియా ఖాతాలను డిలీట్‌ చేసినప్పటికీ, ఆయన ట్విట్టర్‌ ఖాతాకు సంబంధించిన స్క్రీన్‌షాట్లను బట్టి ఆయన ఏబీవీపీ సభ్యుడిగా తెలుస్తున్నది. సందీప్‌ సింగ్‌ కూడా తన ఖాతాను డీయాక్టివేట్‌ చేశాడు. అయితే దాడిలో తమ ప్రమేయంపై వస్తున్న వార్తలను ఏబీవీపీ ఖండించింది. పొటోలు, వాట్సాప్‌ సందేశాలను మార్ఫింగ్‌ చేశారని ఆరోపించింది. వామపక్ష సంఘాలే దాడికి పాల్పడ్డాయని పేర్కొంది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close