పీపీఈ కిట్లో వచ్చి 13 కోట్ల బంగారం దోచుకెళ్లాడు

న్యూఢిల్లీ: దొంగలు బాగా తెలివి మీరిపోయారు. కరోనా మహమ్మారి నుంచి తమను తాము కాపాడుకోవడానికి డాక్టర్లు వేసుకొనే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ (పీపీఈ) కిట్లను దొంగతనానికి వాడుతున్నారు. ఇలాగే ఢిల్లీలో ఓ దొంగ పీపీఈ కిట్ వేసుకొని ఓ జువెలరీ షాపులోకి చొరబడ్డాడు. ఏకంగా రూ.13 కోట్లు విలువ చేసే 25 కేజీల బంగారాన్ని దోచుకెళ్లాడు. అయితే ఆ వెంటనే పోలీసులకు దొరికిపోయాడు. ఈ పీపీఈ కిట్ దొంగను మహ్మద్ షేక్ నూర్గా గుర్తించారు. కర్ణాటకలోని హుబ్లీకి చెందిన నూర్ ఈ జువెలరీ షాపు పక్కనే ఉన్న ఓ ఎలక్ట్రానిక్స్ షాపులో పని చేసేవాడు.
ఐదు మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నా..
జువెలరీ షాపు పక్క బిల్డింగ్ పైకప్పు నుంచి అతడు మంగళవారం రాత్రి షాపులోకి ప్రవేశించినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. ఆ సమయంలో షాపు బయట ఐదు మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. అయినా వాళ్లు షేక్ నూర్ రావడాన్ని గుర్తించలేకపోయారు. షాపులో తాను చోరీ చేసిన బంగారాన్ని ఓ ఆటోలో తీసుకెళ్లినట్లు కూడా సీసీటీవీ ఫుటేజీలో తేలింది. అయితే పోలీసులు 24 గంటల్లోనే కేసును ఛేదించి అతన్ని అరెస్ట్ చేయడం విశేషం. దొంగలు ఇలా పీపీఈ కిట్లలో వచ్చి చోరీలు చేస్తున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. ఇండియాలోనే కాదు.. ఆస్ట్రేలియా, చైనాల్లోనూ ఇలాంటి ఘటనలు జరిగినట్లు ఈ మధ్య వార్తలు వచ్చాయి.