ఒక గుణపాఠం.. ఒక అవకాశం

- కరోనాతో వైద్య పరిశోధనల్ల్లో అనూహ్య ప్రగతి
- మహమ్మారిపై పోరులో ఏకమైన ప్రపంచదేశాలు
- రికార్డు సమయంలో అందుబాటులోకి టీకా
- పేద దేశాలకు వ్యాక్సిన్ అందించడంపై దృష్టి పెట్టాలి
- బయోఏషియా-2021 సదస్సు వక్తల పిలుపు
హైదరాబాద్ : ప్రపంచానికి మహా విపత్తుగా అవతరించిన కరోనా మహమ్మారి.. అదే సమయంలో మంచి అవకాశంగా కూడా మారిందని బయోఎషియా-2021 సదస్సులో వక్తలు అభిప్రాయపడ్డారు. వైద్యారోగ్య రంగంలోని లోపాలను కొవిడ్-19 ఎత్తిచూపిందని అన్నారు. మారుమూల ప్రాంతాలకు టెక్నాలజీని చేర్చాల్సిన ఆవశ్యకతను గుర్తుచేసిందని చెప్పారు. కరోనా కారణంగానే ప్రపంచవ్యాప్తంగా వైద్య సదుపాయాలు అనూహ్యంగా మెరుగయ్యాయని, పరిశోధనల వేగం పెరిగిందని గుర్తుచేశారు. సదస్సులో మొదటిరోజు ‘ప్రపంచ ఆరోగ్యం, కొవిడ్-19’ అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. సీబీఈఆర్ డైరెక్టర్ పీటర్ మార్క్స్ కీలకోపన్యాసం చేశారు. మూడు ప్యానల్ చర్చలు జరిగాయి. ఇప్పటికీ 100కుపైగా దేశాలకు కరోనా టీకాలు చేరలేదని, ఈ దిశగా అన్నిదేశాలు దృష్టిసారించాలని వక్తలు కోరారు. టీకాలపై ప్రజల్లో అపోహలను తొలిగించి.. వాటి సామర్థ్యంపై ప్రజలకు క్షుణ్ణంగా వివరించాలని సూచించారు.
ఆన్లైన్ వైద్యంతో బహుళ ప్రయోజనాలు

టెలీమెడిసిన్, ఆన్లైన్ వైద్యంతో బహుళ ప్రయోజనాలు ఉంటాయని అపోలో హాస్పిటల్స్ ఎండీ సంగీతారెడ్డి అన్నా రు. ‘వర్చువల్లీ కనెక్టెడ్ హెల్త్‌కేర్’ అంశంపై నిర్వహించిన చర్చ లో ఆమె మాట్లాడుతూ టెక్నాలజీ సాయంతో ప్రపంచంలో ఏ మూలన ఉన్న వ్యక్తికైనా ‘వర్చువల్ ట్రీట్మెంట్’ విధానంలో చికిత్స చేయవచ్చని వివరించారు. నాస్కామ్ అధ్యక్షురాలు డీ ఘోష్ మాట్లాడుతూ.. టెక్నాలజీని సామాన్య ప్రజలకు తక్కువ ధరలో అందించగలిగితే ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం అందించడం సులభం అవుతుందని అభిప్రాయపడ్డారు. హెల్త్ హోలాండ్కు చెందిన కేర్మన్ మాట్లాడుతూ.. ప్రతిదేశం డిజిటల్ హెల్త్ మిషన్ ప్రారంభించి, ప్రజల ఆరోగ్య పరిస్థితులతో హెల్త్ రికార్డులు తయారు చేయాలని సూచించారు. ప్రజల హెల్త్ డేటా ఉంటే ప్రభుత్వాలకు ఆరోగ్య ప్రణాళికలు రూపొందించడం సులభం అవుతుందని ఈవై ఇండియా సంస్థ ప్రతినిధి కైవాన్ మోవ్డావాలా అన్నారు. కొత్త వైరస్‌లను ముందుగానే గుర్తించి, వెంటనే టీకాలను అభివృద్ధి చేయగలిగేలా అన్ని దేశాలు సిద్ధం కావాలని వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు చెందిన గ్లోబల్ హెల్త్ అండ్ హెల్త్‌కేర్ హెడ్ అర్ణౌద్ సూచించారు.
ముప్పు ఇంకా తొలగలేదు

ప్రపంచానికి కరోనా ముప్పు ఇంకా తొలిగిపోలేదని, టీకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఐ)కు చెందిన సెంటర్ ఫర్ బయోలాజిక్స్ ఎవల్యూషన్ అండ్ రీసెర్చ్ (సీబీఈఆర్) డైరెక్టర్ పీటర్ మార్క్స్ సూచించారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో అన్నిదేశాలు ఏకమవడం శుభపరిణామమని అన్నారు. సుమారు 10 నెలల్లోనే కరోనా టీకా అందుబాటులోకి రావడం శాస్త్రవేత్తల నిబద్ధతకు నిదర్శనమన్నారు. తెలంగాణలో ఎఫ్‌డీఐ గుర్తింపు పొందిన సంస్థలు 200కుపైగా ఉండటం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు.
మరోవారంలో కొవాగ్జిన్ సామర్థ్య వివరాలు

కొవాగ్జిన్ ఫేజ్-3 ట్రయల్స్ సామర్థ్య వివరాలు (ఎఫికసీ డేటా) వచ్చేవారంలో అందుబాటులోకి వస్తుందని భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల తెలిపారు. ‘ఇమ్యూనైజింగ్ ద వరల్డ్’ అన్న అంశంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ చిన్నారులకు సైతం కొవాగ్జిన్ మంచిదని చెప్పారు. ఇనాక్టివేటెడ్ వైరస్ వ్యాక్సిన్ కావటంతో అందరికీ సురక్షితమని వెల్లడించారు. బయోలాజికల్ ఈ ఎండీ మహిమ దాట్ల మాట్లాడుతూ.. ఏడాదికి 1 బిలియన్ టీకా డోసులు ఉత్పత్తి చేసే సామర్థ్యం తమకు ఉన్నదని చెప్పారు. కొవిడ్ వ్యాక్సిన్‌తోపాటు ప్రపంచానికి అనేక వ్యాధుల నియంత్రణకు భారతదేశం టీకాలను అందించిందని డబ్ల్యూహెచ్‌వో ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ ప్రశంసించారు. టీకాల కోసం భారత్‌పై అనేక దేశాలు అధారపడ్డాయని తెలిపారు. చర్చలో ఐసీఎమ్మార్ డైరెక్టర్ బల్రామ్ భార్గవ, యునిసెఫ్ చీఫ్ ఆఫ్ ఇమ్యునైజేషన్స్ రాబిన్ నాండే, సౌత్ కొరియా ఇంటర్నేషనల్ వ్యాక్సిన్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ జీరోమ్ హెచ్ కిమ్ పాల్గొన్నారు.
భవిష్యత్తు విపత్తులకు సిద్ధం

కరోనా విపత్తు ప్రపంచానికి ఒక అవకాశంగా మారిందని.. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే శక్తిని ఇచ్చిందని సీఈపీఐ సీఈవో డాక్టర్ రిచర్డ్ హ్యాచెట్ అన్నారు. ‘హిట్స్/మిసెస్ అండ్ హిడెన్ పాండమిక్’ అనే అంశంపై ప్యానల్ చర్చలో ఆయన మాట్లాడుతూ కరోనా టీకాలు అందుబాటులోకి వచ్చినా ఇంకా 100కు పైగా దేశాలకు చేరలేదని తెలిపారు. ప్రపంచదేశాలు ఈ దిశగా దృష్టిసారించాలని కోరారు. పొరుగుదేశాలతోపాటు ఐక్యరాజ్యసమితికి భారత్ ఉచితంగా టీకాలు అందజేయడాన్ని ప్రశంసించారు. కరోనా సమయంలో సైన్స్ అండ్ టెక్నాలజీపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని శాస్త్రవేత్తలు, పారిశ్రామిక రంగం నిలబెట్టుకున్నాయని కేంద్ర బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి రేణు స్వరూప్ అన్నారు. లాక్డౌన్ సమయానికి దేశంలో కరోనాను గుర్తించే ఒక్క కిట్ కూడా లేదని.. ఆ పరిస్థితి నుంచి ప్రపంచానికి వ్యాక్సిన్ అందించే స్థాయికి అత్యంత వేగంగా చేరుకున్నామని డీసీజీఐ వీజీ సోమాని చెప్పారు. లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ డైరెక్టర్ పీటర్ పియాట్ మాట్లాడుతూ హెచ్ఐవీ వంటి వైరస్‌లకు 40 ఏండ్లయినా వ్యాక్సిన్ లేదని.. కరోనా విషయంలో మనందరం అదృష్టవంతులమని పేర్కొన్నారు. నీతిఆయోగ్ సభ్యుడు వీకే పాల్, మెడాంట హాస్పిటల్ సీఎండీ డాక్టర్ నరేశ్ట్రెహాన్ చర్చలో పాల్గొన్నారు.
బయాలజిస్టులకు ఆదర్శం పుష్పమిత్ర భార్గవ
- ఘనంగా సీసీఎంబీ ఫౌండర్స్ డే
సీసీఎంబీ మొదటి డైరెక్టర్ డాక్టర్ పుష్పమిత్ర భారత బయాలజిస్టులకు ఆదర్శప్రాయుడని ప్రస్తుత డైరెక్టర్ రాకేశ్‌మిశ్రా తెలిపారు. సీసీఎంబీ ఐదో ఫౌండర్స్ డే వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. పుష్పమిత్రా భార్గవ 93వ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా రాకేశ్‌మిశ్రా మాట్లాడుతూ.. డాక్టర్ భార్గవ మోడ్రన్ బయోలాజీ, బయోటెక్నాలజీకి ఆర్కిటెక్టర్ అని అభివర్ణించారు. ఆయన ఆలోచనలు నేటి సమాజానికి అనువుగా ఉన్నాయని చెప్పారు. పరిశోధనలకు ఎప్పుడు సీసీఎంబీ మద్దతుగా నిలుస్తుందని తెలిపారు. సీసీఎం బీ పూర్వ విద్యార్థులు వర్చువల్ విధానంలో ప్రసంగించారు. కార్యక్రమం లో డాక్టర్ సియారాంపాండే, డాక్టర్ శారద గొనేంకా, ప్రముఖ పర్యావరణవేత్త ఆశిష్కొటారి పాల్గొన్నారు.