తెలంగాణస్పెషల్

బ్లాక్‌స్పాట్స్‌ పై నజర్‌

  • ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీసులు
  • నల్లగొండలో సత్ఫలితాలు.. మూడేండ్లలో సగానికి తగ్గిన ప్రమాదాలు
  • రాష్ట్రవ్యాప్తంగా 3517 బ్లాక్‌స్పాట్స్‌!
  • తమిళనాడు మోడల్‌పై తెలంగాణ పోలీసుల అధ్యయనం

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలతోపాటు, మృతుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా తెలంగాణ పోలీస్‌శాఖ చర్యలు చేపడుతున్నది. 2020 సంవత్సరాన్ని డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి ఇప్పటికే రోడ్‌, విమెన్‌సేఫ్టీ ఇయర్‌గా ప్రకటించారు. ఆ దిశగా పోలీసు యంత్రాంగం దృష్టిసారించింది. ఇందులోభాగంగా ప్రమాదాలు జరుగడానికి గల కారణాలను విశ్లేషిస్తూ మరోమారు ఆ ప్రమాదాలు జరుగకుండాముందస్తుచర్యలు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా జాతీయ, రాష్ట్రరహదారులు, ఇతర రోడ్లలో 2015 నుంచి 2018 వరకు 3,517 బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తించారు. 

ఈ ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలు చేపడుతున్నారు. ముందస్తుగా ప్రమాదప్రాంతాలను బ్లాక్‌స్పాట్స్‌గా గుర్తించి, లోపాలు సరిదిద్దుతుండటంతో రోడ్డు ప్రమాదాలు తగ్గుతున్నాయి. ఇందుకోసం పోలీసులు, ఆర్‌అండ్‌బీ, ట్రాన్స్‌పోర్టు, మెడికల్‌, ఫైర్‌ తదితర విభాగాలు భాగస్వామ్యంతో చర్యలు చేపడుతున్నారు. అన్ని విభాగాల్లోని అధికారులు ఒక బృందంగా ఏర్పడి ప్రమాదస్థలాలను  గుర్తిస్తున్నారు. ఆ ప్రాంతంలో మూలమలుపు, సరైన వెలుతురు, సైన్‌బోర్డు లేకపోవడం, ఇరుకైన వంతెనలు ఇలా.. ఏ కారణంతో ప్రమాదం జరిగిందో ముందుగా విశ్లేషించి.. వాటిని పరిష్కరిస్తున్నారు. 

నల్లగొండ జిల్లాలో ఈ రకంగా తీసుకున్న తాత్కాలిక చర్యలతో మూడేండ్లలో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి. అతివేగంతోనే ప్రమాదాలు జరుగుతుండటాన్ని గుర్తించిన నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాథ్‌.. ఆర్‌అండ్‌బీ అధికారులతో మాట్లాడి వేగ నియంత్రణకు బొల్లార్ట్స్‌ పెట్టించారు. 2017లో నల్లగొండలో 362 ప్రమాదాల్లో 393 మంది మృతిచెందగా, 2018 లో 342 ప్రమాదాల్లో 367 మంది ప్రాణాలు కోల్పోయారు. 2019 నాటికి రోడ్డు ప్రమాదాలు 286కి, మృతుల సంఖ్య 314కి తగ్గాయి. హైదరాబాద్‌ పరిధిలో 2017లో 303, 2019లో 259 ప్రమాదాలు జరిగాయి.

తమిళనాడు విధానంపై అధ్యయనం

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు తమిళనాడులో విజయవంతంగా అమలవుతున్న ‘తమిళనాడు యాక్సిడెంట్‌ అండ్‌ ఎమర్జెన్సీ కేర్‌ ఇన్సియేటివ్‌’ విధానంపైనా తెలంగాణ పోలీసులు అధ్యయనం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన నిమిషాల వ్యవధిలోనే క్షతగాత్రులను దవాఖానలకు చేర్చడం, అక్కడ వైద్యబృందాలు అందుబాటులో ఉండడం, ప్రమాదం జరిగిన వెంటనే పోలీస్‌, మెడికల్‌, ఆర్‌అండ్‌బీ ఇలా అన్నివిభాగాలను సమన్వయంచేసే విధానాన్ని తెలంగాణ పోలీస్‌ బృందం పరిశీలించింది. అడిషనల్‌ డీజీలు, ఐజీలు, ఇతర పోలీస్‌ ఉన్నతాధికారుల బృందం చెన్నై ప్రభుత్వ ఆసుపత్రి ట్రామా సెంటర్‌ను సందర్శించింది. ప్రభుత్వానికి పూర్తి నివేదికను సమర్పించింది. 

ఆ నాలుగు జిల్లాల్లో ఎక్కువ ప్రమాదాలు

కామారెడ్డి, మెదక్‌, నిజామాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో గత మూడేండ్లలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఆ జిల్లాల్లో జాతీయ రహదారులపై ఎక్కువ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మిగిలిన జిల్లాల్లో కొంతమేర ఫలితాలు కనిపిస్తున్నాయి. 

బ్లాక్‌స్పాట్స్‌ మూడు రకాలు

తరచూ ఒకేచోట ప్రమాదం జరిగితే దాన్ని బ్లాక్‌ స్పాట్‌గా పరిగణిస్తారు. వీటిలోనూ పరిమితకాలంలో ప్రమాదాల సంఖ్యను బట్టి ఏ,బీ,సీలుగా వర్గీకరించి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఒకే ప్రదేశంలో ఆరునెలల కాలంలో ఐదు నుంచి తొమ్మిది వరకు ప్రమాదాలు జరిగితే దాన్ని సీ క్యాటగిరీగా, 10 నుంచి 19 జరిగితే బీ క్యాటగిరీగా.. 20 అంతకుమించి జరిగితే ‘ఏ’ క్యాటగిరీగా విభజించారు. అదేవిధంగా ప్రమాదానికి కారణమవుతున్న అంశాలను నాలుగురకాలుగా విభజించారు. రోడ్డు ఇంజినీరింగ్‌లో లోపాలు, మానవ తప్పిదాలు, మెకానికల్‌ డిఫెక్ట్స్‌, వాతావరణం ప్రతికూలంగా ఉండడం.. వీటి లో చాలావరకు ప్రమాదాల్లో మానవ తప్పిదాలే ఉంటున్నట్టు గుర్తించారు. 

వేగ నియంత్రణతో ప్రమాదాలు తగ్గుముఖం

ప్రమాదాలకు అతివేగమే ముఖ్యకారణం. జిల్లాలో అతివేగం కారణంగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ వేగ నియంత్రణకు బొల్లార్ట్స్‌, రోడ్డుకు అడ్డుగా కొద్దిపాటి మందంగా ఉండే పెయింటింగ్‌ వేయించాం. వెలుతురు లేనిచోట లైట్లు ఏర్పాటు, తరచూ ప్రమాదాలు జరిగే గ్రామాల ప్రజాప్రతినిధులతో అవగాహన సమావేశాలు తదితర చర్యలతో జిల్లాలో ప్రమాదాలు 25 శాతం వరకు తగ్గించాం. మరింత తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నాం. 

– రంగనాథ్‌, ఎస్పీ, నల్లగొండ

అవగాహన లేమితోనే ప్రమాదాలు

మెదక్‌ జిల్లా పరిధిలో బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తించడంతోపాటు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కువ వరకు వాహనదారులకు రోడ్డు భద్రతానియమాలు తెలియకపోవడంతోనూ ప్రమాదాల బారినపడుతున్నారు. అవగాహన కల్పించడంతోపాటు, నిబంధనలు అతిక్రమించకుండా జరిమానాలు విధిస్తే ప్రమాదాలను నియంత్రించవచ్చు. 

– చందనా దీప్తి, ఎస్పీ, మెదక్‌

గత మూడేండ్లలో జనవరిలో నమోదైన ప్రమాదాలు 

ఏడాది
ప్రమాదాల సంఖ్య 
2018
475
2019
523
2020
491 

రాష్ట్రంలో బ్లాక్‌ స్పాట్స్‌

ఏ రకమైన రోడ్డు
2015 ఏడాది
 2016 ఏడాది2017 ఏడాది
2018 ఏడాది
ప్రమాదాలు సంఖ్య
జాతీయ రహదారులు
582
551
545
554
2232
రాష్ట్ర రహదారులు
180
174
179
168
701
ఇతర రోడ్లు
145
140
151
148
584
మొత్తం 
907
865
875
870
3517


Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close