తెలంగాణ

చేపలను ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ -మంత్రి హరీశ్‌ రావు

సిద్దిపేట: రాష్ట్రంలో మత్స్యరంగానికి ఊపిరి పోసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ఒకప్పుడు చేపలంటే.. కోస్తా ప్రాంతం నుంచి దిగుమతి చేసుకుంటారనే భావన ఉండేదని, కానీ ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో ఏడేండ్లలోనే చేపలను ఉత్తర భారతంతోపాటు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామని చెప్పారు. సిద్దిపేటలోని రంగనాయక సాగర్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో కలిసి చేప పిల్లలను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. గోదావరి, కృష్ణా జలాల్లో పెరిగే తెలంగాణ చేపలకు మంచి డిమాండ్ ఉందన్నారు. ఈ అవకాశాన్ని మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా నుంచే ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.

ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంతో మత్స్యకారుల జీవితాల్లో సీఎం కేసీఆర్‌ కొత్త వెలుగులు తీసుకొచ్చారని, రాష్ట్రంలో నీలి విప్లవానికి శ్రీకారం చుట్టారని వెల్లడించారు. సిద్దిపేట జిల్లాలో రూ.4.87 కోట్లతో అన్ని జలాశయాలు, చెరువుల్లో 4 కోట్ల 19 లక్షల చేప, రొయ్య పిల్లలను వదులుతున్నామని చెప్పారు. గుక్కెడు మంచి నీళ్లకోసం గోసపడ్డ ప్రాంతం ప్రస్తుతం పచ్చని పంట పొలాలతో కళకళలాడుతున్నదని తెలిపారు.

ఎటు చూసినా ధాన్యపు సిరులే

తెలంగాణ.. దేశానికే అన్నపూర్ణగా, ధాన్యపు భాండాగారంగా భాసిల్లుతున్నదని, రాష్ట్రంలో ఎక్కడ చూసినా ధాన్యపు సిరులు, మత్స్య సంపద కళ్లముందు కనబడుతున్నదని చెప్పారు. మత్స్య సంపద పెరగడంతో మత్స్యకారులకు ఆదాయంతో పాటు ప్రజలకు ఆరోగ్యం పెంపొందుతున్నదన్నారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు, వారికి ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు సీఎం కేసీఆర్‌ ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని ప్రారంభించారని తెలిపారు.

జీవన ప్రమాణాలు పెంచడానికే

కులవృత్తులకు పూర్వ వైభవం కల్పించేoదుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచడానికే ప్రభుత్వం సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా 2014 నుంచి ఉచిత చేప పిల్లల విడుదల కార్యక్రమం చేపడుతున్నదని పేర్కొన్నారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close