క్రైమ్

అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి

7వ తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్‌  

ప్రత్తిపాడు : విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి బాలిక బంధువులు దేహశుద్ధి చేసిన ఘటన ప్రత్తిపాడు మండలం వట్టిచెరుకూరులో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వట్టిచెరుకూరుకు చెందిన 12 ఏళ్ల బాలిక స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. సోమవారం పాఠశాలకు వెళ్లిన బాలికతో తరగతి గదిలో హిందీ ఉపాధ్యాయుడు రవిబాబు అసభ్యంగా ప్రవర్తించినట్టు బాలిక చెబుతోంది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన బాలిక మంగళవారం బడికి వెళ్లనని భీష్మించింది. ఎందుకని తల్లిదండ్రులు అడగ్గా.. ఈ విషయం చెప్పింది. దీంతో తల్లిదండ్రులు, బంధువులు స్థానికులతో కలిసి మంగళవారం ఉదయం పాఠశాలకు వెళ్లి హిందీ ఉపాధ్యాయుడు రవిబాబును బయటకు పిలిచి మూకుమ్మడిగా దాడి చేశారు.

రవిబాబు పారిపోయేందుకు ప్రయత్నించగా.. అతడిని వెంబడించి పట్టుకుని మరీ దేహశుద్ధి చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరికొందరు ఉపాధ్యాయులనూ కొట్టడంతో పాఠశాలలో ఉద్రిక్తత నెలకొంది. చేబ్రోలు సీఐ మధుసూదనరావు, ఎస్‌ఐ రాజ్‌కుమార్‌ అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని చదవకపోవడం వల్లే కాస్త మందలించినట్టు ఉపాధ్యాయుడు చెబుతున్నారు. ఘటనపై డీఈవో ఆర్‌ఎస్‌ గంగాభవాని ఆదేశాల మేరకు బుధవారం స్థానిక పాఠశాలలో తెనాలి డివిజన్‌ ఉప విద్యాధికారి శ్రీనివాసరావు విచారణ చేపట్టనున్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందజేస్తామని ఇన్‌చార్జి ఎంఈవో రమాదేవి తెలిపారు. 

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close