ఆంధ్ర

ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం

గుంటూరు: ఉద్యమం ముసుగులో టీడీపీ కార్యకర్తలు గుండాగిరీకి పాల్పడ్డారు. ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాన్వాయ్‌పై రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో రామకృష్ణారెడ్డి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆయన తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వివరాలు… అభివృద్ధి వికేంద్రీకరణకు అడ్డుపడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేతలు ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టీడీపీ కార్యకర్తలు చిన్న కాకాని వద్ద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. కాజా టోల్‌గేట్‌ దగ్గర ఆయన కారుపై రాళ్లతో దాడి చేశారు. భద్రతా సిబ్బందిపై సైతం దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో రామకృష్ణారెడ్డి సంయమనం పాటించి.. వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. వెనుక నుంచి దాడి చేసేందుకు ప్రయత్నించారు. 

చంద్రబాబుకు పిన్నెల్లి సవాల్‌
తన కాన్వాయ్‌పై రాళ్ల దాడి ఘటనను ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిరికపంద చర్యగా అభివర్ణించారు. రైతుల ముసుగులో చంద్రబాబు తన కార్యకర్తలతో దాడి చేయించారని ఆరోపించారు. కుట్రలో భాగంగానే తనపై, గన్‌మెన్‌లపై రాళ్లు, కర్రలతో దాడి చేశారని పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించి తన ఆస్తులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రైతుల పేరిట చంద్రబాబు రాజకీయాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

దమ్ముంటే చంద్రబాబు ధైర్యంగా ముందుకు రావాలని సవాల్‌ విసిరారు. అదే విధంగా రాజధాని ప్రాంత రైతులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తప్పకుండా న్యాయం చేస్తారని పిన్నెల్లి స్పష్టం చేశారు. ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. రైతులు ముసుగులో దాడులకు పాల్పడితే తాము భయపడమని స్పష్టం చేశారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close