కలపర్రులో ఎస్వీ రంగారావు మ్యూజియం

ప్రముఖ నటుడు ఎస్వీ రంగారావుకు ఘనంగా నివాళులు అర్పించారు ఏపీ సీఎం చంద్రబాబు. పశ్చిమ గోదావరి జిల్లాలోని కలపర్రులో ఎస్వీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన, అక్కడే మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఆయన జీవిత చరిత్రను అందరికీ తెలిసేలా దీన్ని నిర్మిస్తామన్నారు చంద్రబాబు. ఎన్టీఆర్, ఎస్వీఆర్ ఇద్దరూ కూడ మంచి స్నేహితులని ఆయన గుర్తు చేశారు.
ఎన్టీఆర్, ఎస్వీరంగారావు కాంబినేషన్లో ఎన్నో మంచి సినిమాలు వచ్చాయన్నారు. ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో నటించి తెలుగు, తమిళ చిత్రసీమల్లో తిరుగులేని క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా ఎస్వీఆర్ పేరు గడించారని బాబు కొనియాడారు. విగ్రహాం ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని ఎస్వీఆర్ జంక్షన్‌గా పేరు మారుస్తున్నట్టు ఆయన ప్రకటించారు. తెలుగు సినీ పరిశ్రమ పేరును విశ్వవ్యాప్తం చేసేలా ఎస్వీరంగారావు కృషి చేశారని సీఎం గుర్తు చేసుకొన్నారు. ఎస్వీఆర్ మ్యూజియంతో పాటు రిసార్ట్స్ ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దనున్నట్టు ఎస్వీఆర్ ప్రకటించారు.
పశ్చిమ గోదావరి జిల్లాకు మెడికల్ కాలేజీని మంజూరు చేస్తామన్నారు ముఖ్యమంత్రి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించిన పశ్చిమకు.. ఎంత చేసినా తక్కువే అన్నారు. ఈ జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటానని, జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, ప్రజలు ఏది కోరుకుంటే దాన్ని మంజూరు చేస్తానని ఆయన హమీ ఇచ్చారు. అమరావతి తర్వాత ఏలూరులో రెండో టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేస్తామని చంద్రబాబునాయుడు ప్రకటించారు.