జాతీయంటాప్ స్టోరీస్

నేతల నేరాలపై యాక్షన్‌ప్లాన్‌

  • 9 అంశాలతో సమగ్ర వివరాలు సేకరించాలి
  • ఎన్ని కోర్టులు, ఎందరు జడ్జీలు అవసరమో తేల్చాలి
  • స్టే ఉన్న కేసులపై రెండునెలల్లో విచారణ పూర్తి
  • విచారణ పర్యవేక్షణకు హైకోర్టులో ప్రత్యేక ధర్మాసనం
  • అన్ని హైకోర్టుల సీజేలకు సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ : ప్రజాప్రతినిధులపై ఉన్న పెండింగ్‌ కేసుల విచారణపై సుప్రీంకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీచేసింది. ఈ కేసుల విచారణకు సంబంధించి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను వారంలోగా తమకు పంపాలని అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను ఆదేశించింది. కేసుల విచారణకు జిల్లాల్లో అందుబాటులో ఉన్న ప్రత్యేక కోర్టులు, జడ్జీల సంఖ్య, వారి పదవీకాలం, ఒక్కో న్యాయమూర్తి ఎన్ని కేసులు విచారించగలరు తదితర 9 అంశాలతో యాక్షన్‌ ప్లాన్‌ను సుప్రీంకోర్టు అమికస్‌ క్యూరీగా నియమించిన సీనియర్‌ న్యాయవాది విజయ్‌ హన్సారియాకు మెయిల్‌ ద్వారా పంపాలని జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత, జస్టిస్‌ రిషికేశ్‌ రాయ్‌లతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తదుపరి విచారణను రెండువారాలకు వాయిదా వేసింది.

కేసులెన్ని.. కోర్టులెన్ని?

రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులపై ఎన్నికేసులు ఉన్నాయో లెక్కతీసి.. వాటి సత్వర విచారణకు ఎన్ని కోర్టులు అవసరం అవుతాయో గుర్తించాలని హైకోర్టు సీజేలకు సూచించింది. ప్రస్తుతం ఉన్న ప్రత్యేక కోర్టులు సరిపోతాయా? కొత్తగా కోర్టులు ఏర్పాటు చేయాలా? ఇప్పుడు అందుబాటులో ఉన్న ప్రత్యేక న్యాయమూర్తులు ఎలాంటి కేసులను, ఎంతకాలంలో విచారించగలరు? విచారణ ముగింపునకు పట్టే కాలమెంత? కోర్టుల మధ్య దూరం ఎంత? మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి? అనే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. ఇప్పటికే విచారణలో ఉన్న కేసులను ప్రత్యేక కోర్టులకు బదిలీ చేయాలా వద్దా అనే అంశాన్ని హైకోర్టు సీజేలే నిర్ణయించేందుకు అనుమతి ఇచ్చింది. కేసుల విచారణ ఆలస్యం వల్ల దేశంలో రాజకీయాలు మరింత నేరమయం కావటమే కాకుండా అధికారాన్ని ఉపయోగించి నిందితులు విచారణను ప్రభావితం చేసు అవకాశాలు కూడా ఉంటాయన్న ఉద్దేశంతోనే మేం త్వరగా విచారణ పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

హైకోర్టులో ప్రత్యేక ధర్మాసనం

ప్రత్యేక కోర్టుల్లో విచారణలో ఉన్న కేసులన్నింటినీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రతి హైకోర్టులో ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటుచేయాలని సీజేలకు సుప్రీం ధర్మాసనం సూచించింది. కేసుల విచారణను త్వరగా ముగించేందుకు సూచనలు కూడా ఇవ్వవచ్చని పేర్కొంది. హైకోర్టుల్లో స్టేలు ఉన్న కేసుల్లో ఆ స్టేలను కొనసాగించాలా? వాటి విచారణకు ప్రత్యేక కోర్టుకు అనుమతించాలా? అన్న అంశాలపై సుప్రీంకోర్టు తగ తీర్పుల ఆధారంగా నిర్ణయించాలని ఆదేశించింది. స్టే ఉన్న కేసులపై రోజువారీ విచారణ చేపట్టి రెండు నెలల్లో కొలిక్కి తేవాలని స్పష్టంచేసింది. 

నేతలపై 4,442 కేసులు 

ప్రజాప్రతినిధులపై నమోదైన క్రిమినల్‌, సివిల్‌ కేసులను సత్వరం విచారించేలా చర్యలు తీసుకోవాలని 2016లో  దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు వరుసగా రెండోరోజు గురువారం కూడా విచారించింది. దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులపై 4,442 కేసులు విచారణలో ఉన్నాయని అమికస్‌ క్యూరీ హన్సారియా సుప్రీం ధర్మాసనానికి వివరించారు. సిట్టింగ్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలపైనే 2,556 కేసులు విచారణలో ఉన్నాయని తెలిపారు.  200 కేసులు పీసీఏ, పీఎంఎల్‌ఏ, పోస్కో చట్టాల కింద నమోదయ్యాయి.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close