ఆంధ్ర

ఇ-వ్యవసాయం.. ఒక్క క్లిక్‌తో సమగ్ర సమాచారం

అందుబాటులో సాగు వివరాలు

పెద్దాపురం: అన్నదాతకు అన్ని వేళల్లో అందుబాటులో ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇ–వ్యవసాయం వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సాగులో యాజమాన్య పద్ధతులు తెలుసుకునేందుకు ప్రతిసారీ వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలను కలవాలన్నా, ఫోన్‌లో సంప్రదించాలన్నా రైతులకు కష్టంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుపుచ్చుకొని, కర్షకులకు చేరువలో ఉండేందుకు వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టిందని పెద్దాపురం ఏడీఏ ఎం.రత్నప్రశాంతి తెలిపారు. పంటల వివరాలు, సాగు పద్ధతులు, రాయితీలు, సౌకర్యాలు తదితర అంశాలతో ఇ–వ్యవసాయం పేరుతో వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులోని సూచనలు, సలహాలు పాటిస్తే రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ శాఖాధికారులు పేర్కొంటున్నారు.

అంతా తెలుగులోనే.. 
అంతర్జాలంలో వ్యవసాయ శాఖకు సంబంధించిన సమస్త సమాచారాన్ని తెలుగులోనే పొందుపరిచారు. వరి, మొక్కజొన్న, కంది, జొన్న, పత్తి, వేరుశెనగ, తదితర 18 రకాల పంటలకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంచారు. విత్తనాలు విత్తే సమయం నుంచి ధాన్యం మార్కెట్‌కు తరలించే వరకూ తీసుకోవాల్సిన సూచనలు అందులో వివరించారు.

ప్రధానాంశాలు ఇవీ.. 
పొలంబడి, వర్మికంపోస్టు ఎరువు తయారీ, గ్రామీణ విత్తన పథకం, బ్యాంక్‌ ద్వారా రుణ సదుపాయాలు, పంటల యాజమాన్యానికి సంబంధించిన వీడియోలు వెబ్‌సైట్‌లో ఉన్నాయి. జీవ రసాయన ఎరువుల తయారీ, వాటి వినియోగం, పంటల కనీస మద్దతు ధరలు, ఎరువుల అమ్మకాలు, భవిష్యత్‌లో ధరల అంచనాల విషయాలు పొందుపరిచారు. వ్యవసాయ అనుబంధ శాఖల వెబ్‌సైట్‌ లింకులు, అధికారుల ఫోన్‌ నంబర్లు, చిరునామాలు, వారి సలహాలు తీసుకునే విధంగా ఇ– వ్యవసాయం పేరుతో రూపకల్పన చేశారు.

వ్యవసాయ పంచాంగం 
ఇ– వ్యవసాయం వెబ్‌పేజీలో కుడివైపు కింద భాగంలో వ్యవసాయ పంచాంగం ఆప్షన్‌ ఉంటుంది. దీనిపై క్లిక్‌ చేస్తే ఆహార ధాన్యాల వివరాలు, ఫొటోలతో సహా పంచాంగం ఓపెన్‌ అవుతుంది. అందులో పప్పు ధాన్యాలు, నూనె గింజలు, వాణిజ్య పంటలు, పండ్ల తోటలు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, ఔషధ, పూల మొక్కలు, ఇతర వివరాలు, పశు సంవర్ధక శాఖ, చేపలు, రొయ్యల పెంపకం వివరాలు ఉంటాయి. రైతులు గుగూల్‌ ఓపెన్‌ చేసి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్‌ అగ్రీస్‌నెట్‌ అని టైప్‌ చేస్తే ఇ– వ్యవసాయం పేజీ ఓపెన్‌ అవుతుంది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close