ఆంధ్రస్పెషల్

చూడ‘చెక్క’ నగిషీలు..!

  • హస్తకళానైపుణ్యానికి కేరాఫ్‌ ఉదయగిరి
  • ఇక్కడి వస్తువులకు దేశవ్యాప్త గుర్తింపు
  • శభాష్‌ హుస్సేన్‌.. మోదీ మెచ్చిన తెలుగోడు..

హస్తకళా నైపుణ్యంతో తెలుగోడు తయారు చేసిన వస్తువులు భారత ప్రధాని నరేంద్ర మోదీ మనసు దోచుకున్నాయి. నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన ప్రముఖ హస్తకళాకారుడు షేక్‌ జకీర్‌ హుస్సేన్‌ పనితనాన్ని ప్రధాని మోదీ అభినందించారు. హుస్సేన్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారి పని విధానం, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీలోని రాజ్‌పథ్‌ వద్ద ఏర్పాటు చేసిన ‘హునార్‌ హాట్‌’ హస్తకళా ప్రదర్శన దీనికి వేదికైంది. ఈ ప్రదర్శనను బుధవారం అకస్మాత్తుగా సందర్శించిన మోదీ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు.

ఈ సందర్భంగా సాక్షాత్తు ప్రధానమంత్రి తమ వస్తువులను చూసి, నైపుణ్యాన్ని అభినందించడంతో హుస్సేన్‌ కుటుంబం ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇది తమ అదృష్టంగా భావిస్తున్నామని హుస్సేన్‌ అన్నారు. ఏపీ ప్రభుత్వం తరఫున ఏపీఎ్‌సఎ్‌సడీసీ ఆధ్వర్యంలో ఈ స్టాల్‌ను ఏర్పాటు చేశారు. కాగా ఈ స్టాల్‌ను మోదీ సందర్శించడం పట్ల ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ హనుమ నాయక్‌, ప్రభుత్వ కార్యదర్శి డా. అర్జా శ్రీకాంత్‌ ఆనందం వ్యక్తం చేశారు.

హస్తకళానైపుణ్యానికి కేరాఫ్‌ ఉదయగిరి

హస్త కళారూపాలు చూడముచ్చటగా ఉంటాయి. చూడగానే మనసు దోచేస్తాయి. అందుకేనేమో నెల్లూరుజిల్లా ఉదయగిరి చెక్క నగిషీలు ప్రధాని మోదీని మెప్పించాయి. ఇక్కడి నగిషీ కేంద్రాల్లో మహిళల చేతి నుంచి జాలువారిన కళారూపాలు ఆయన్ను ఆకర్షించాయి. ఈ పనితనానికి శభాష్‌ అనేలా చేశాయి. ఉదయగిరి చెక్క నగిషీలకు 50 ఏళ్ల చరిత్ర ఉంది.

ఇక్కడి నగిషీ కేంద్రంలో హస్తకళ ప్రాణం పోసుకుంటూ.. దేశవ్యాప్తంగా కళాభిమానులను ఆకట్టుకుంటోంది. నేడు ప్రధాని ప్రశంసలు అందుకున్న ఈ సంస్థకు ఆద్యుడు ఉదయగిరికి చెందిన షేక్‌ బషీర్‌. ఆయన కళకు వారసురాలిగా ఆయన కుమార్తె గౌసియా కొనసాగుతుండగా, సంస్థ నిర్వాహకుడిగా ఆమె కుమారుడు జాకీర్‌ హుస్సేన్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఉదయగిరిలోని దిలావర్‌భాయ్‌ వీధికి చెందిన బషీర్‌ చెక్కనగిషీ వస్తువుల తయారీలో నేర్పరి.

1973లో 12 మంది మహిళలతో కలిసి చెక్కవస్తువుల తయారీని ప్రారంభించారు. అప్పట్లో ఈ వస్తువులకు మంచి డిమాండ్‌ ఉన్నా అనంతరం మార్కెట్‌లోకి వచ్చిన రకరకాల వస్తువుల వల్ల ఆదరణ తగ్గింది. అయినా వెనకడుగు వేయకుండా బషీర్‌ ఈ వస్తువులు తయారు చేసి ప్రదర్శనలు నిర్వహించేవారు. ఆయన ప్రతిభకు లేపాక్షి ద్వారా రాష్ట్రస్థాయిలో అవార్డు దక్కింది. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థల సహాయ సహకారాలు అందించాయి. దీంతో పలువురు మహిళలకు ఆ వృత్తిలో నైపుణ్యం సాధించేలా చర్యలు తీసుకొన్నారు.

గతంలో ప్రస్తుత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సహకారంతో రూ.10 లక్షలు మంజూరు చేయించి కామన్‌ ఫెసిలిటీ కేంద్రాన్ని (ఉడ్‌ అండ్‌ కట్లర్‌) ఏర్పాటు చేశారు. అలాగే చైతన్యజ్యోతి వెల్ఫేర్‌ వారి సహకారంతో కర్రలు కత్తిరించే యంత్రాలను ఏర్పాటు చేయించి దీని బాధ్యతలను తన కుమార్తె గౌసియాకు అప్పగించారు. ఆమె సైతం అంకితభావంతో పని చేసి స్థానిక మహిళలకు చెక్కనగిషీ కళను నేర్పించారు. ఇప్పుడీ కేంద్రం మహిళలకు ఉపాధి చూపడంతోపాటు ఆర్థికంగా ముందుకు సాగేందుకు తోడ్పాటునందిస్తోంది. 

కలపతోనే సకలం

రాష్ట్రంలో చెక్క వస్తువుల తయారీ కేంద్రాలు నాలుగు ఉన్నాయి. అందులో నర్సీపట్నం, రాజంపేట, కొండపల్లిలో చెక్క బొమ్మలు తయారు చేస్తారు. ఉదయగిరిలో మాత్రం చెక్క నగిషీ వస్తువులు తయారు చేస్తారు. దీంతో ఉదయగిరికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇక్కడ స్పూన్లు, డైనింగ్‌ టేబుల్‌ మ్యాట్‌లు, గరిటెలు, హస్తాలు, జడపిన్నులు, కీచైన్‌లు, ఫోటోప్రేమ్‌లు, బొమ్మలు, ట్రేలు, పేపర్‌కట్‌ నైఫ్‌లు, ఫోర్క్‌లు తదితర 150 రకాల వస్తువులు తయారు చేస్తారు. 

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close