బిజినెస్

పండగ సీజన్‌లో రుణాలపై భారీ ఆఫర్లు

న్యూఢిల్లీ : కోవిడ్‌-19తో ముంచుకొచ్చిన ఆర్థిక విధ్వంసం భారత్‌లో డిమాండ్‌ సంక్షోభానికి దారితీసింది. రానున్న పండగ సీజన్‌లో డిమాండ్‌ను పునరుద్ధరించేందుకు పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణాలపై భారీ ఆఫర్లను ప్రకటించాయి. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ యోనో యాప్‌లో ఆటోమొబైల్‌, గోల్డ్‌, వ్యక్తిగత రుణాలకు దరఖాస్తు చేసే కస్టమర్ల నుంచి ప్రాసెసింగ్‌ ఫీజును పూర్తిగా మాఫీ చేసింది. ఆమోదం లభించిన ప్రాజెక్టుల్లో గృహాలను కొనుగోలు చేసేవారి గృహ రుణాలపై ప్రాసెసింగ్‌ ఫీజునూ నూరు శాతం మాఫీ చేయనున్నట్టు ఎస్‌బీఐ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. క్రెడిట్‌ స్కోర్‌ ఆధారంగా ఎంపిక చేసిన కస్టమర్లకు వడ్డీ రేట్లలో 10 బేసిస్‌ పాయింట్ల వరకూ రాయితీ కల్పించనుంది.

ఇక ఎస్‌బీఐ యోనోపై గృహ రుణానికి దరఖాస్తు చేసుకున్నవారికి అదనంగా వడ్డీరేటుపై మరో 5 బేసిస్‌ పాయింట్ల రాయితీని ప్రకటించింది. గోల్డ్‌ లోన్‌లకు దరఖాస్తు చేసుకునే కస్టమర్లకు 7.5 శాతం వడ్డీ రేటుతో 36 నెలల్లోగా తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పిస్తోంది. ఇక వ్యక్తిగత రుణాలపై 9.6 శాతం నుంచి వడ్డీ వసూలు చేయనున్నట్టు బ్యాంకు ప్రకటన పేర్కొంది. యోనో యాప్‌ ద్వారా దరఖాస్తు చేసే కారు, గృహ రుణాల దరఖాస్తులకు సూత్రప్రాయ ఆమోదం తెలుపుతామని ఎస్‌బీఐ పేర్కొంది. ప్రస్తుత ఎస్‌బీఐ కస్టమర్లు యోనో యాప్‌పై వ్యక్తిగత రుణానికి ఆమోదం పొందవచ్చని తెలిపింది.

Tags
Back to top button
error: Content is protected by G News !!
Close
Close