తెలంగాణస్పెషల్

మహాజాతరకు వేళాయె..

  • రేపే మేడారం జాతర ప్రారంభం.. భక్తులు మురిసేలా సకల వసతులు
  • సోమవారం తల్లులను దర్శించుకున్న 2 లక్షల మంది
  • యాపలగడ్డ నుంచి బయలుదేరిన పగిడిద్దరాజు

ఆదివాసీ గిరిజన ఆరాధ్యదైవాలైన సమ్మక్క-సారలమ్మల మహాజాతర బుధవారం నుంచి ప్రా రంభం కానున్నది. ఈనెల 5నుంచి 8 వరకు ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరిగే ఈ జాతరకు  మునుపెన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం అసాధారణ ఏర్పాట్లు చేసింది. ‘చల్వాయి తొవ్వళ్లు.. సన్నపు దుబ్బలూ అబ్బియా..’ అంటూ శిగాలూగే శివసత్తుల పూనకాల్లోని పురాజ్ఞాపకాలు.. పూర్వకాలంలో సౌకర్యాల లేమి నుంచి.. కేవలం ఎడ్ల బండ్ల జాతరగా ఖ్యాతికెక్కిన మేడారం మహాజాతరగా అవతరించిన క్రమంలో అనేక ఆధునిక హంగులు సంతరించుకున్నది. జాతర నిర్వహణకు ప్రభుత్వం రూ.75 కోట్లు కేటాయించింది.

భక్తులకు ఎక్క డా అసౌకర్యం కలుగకుండా రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికలు రూపొందించి అమలుచేసింది. జాతరకు మూడు నెలల ముందు నుంచే ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా మంత్రులను, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, డీజీపీ సహా అన్ని శాఖల ఉన్నతాధికారులను క్షేత్రస్థాయిలో పర్యటించేలా ఆదేశిస్తూ పనుల పర్యవేక్షణ చేయించారు. గత పదిరోజులుగా రోజూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా సంబంధిత శాఖల ఉన్నతాధికారులు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహిస్తూ జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కాగా, సోమవారం దాదాపు 2 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

మెరిసేలా రోడ్లు..

మేడారం జాతరలో ప్రధాన పాత్ర రోడ్లు. దూర తీరాలను చెరిపేసి భక్తిపారవశ్యంతో తరలివచ్చే భక్తులు సురక్షితంగా సుఖవంతంగా ప్రయాణం చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ఈసారి మేడారం దారులన్నీ మెరిసిపోతున్నాయి. జాతీయ రహదారి (163)తోపాటు ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ రోడ్లన్నీ మరమ్మతులు చేశారు. హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ మీదుగా వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా నగర పొలిమేరల్లోని రాంపూర్‌ నుంచి ఆరేపల్లి (జాతీయ రహదారి 163)కి అనుసంధానం చేశారు. ఈసారి కొత్తగా కాల్వపల్లి నుంచి కాటారం మీదుగా రోడ్డు ప్రారంభించారు.

శాశ్వత నిర్మాణాలు..

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సారి జాతర ప్రాంగణంలో శాశ్వత నిర్మాణా లు చేపట్టారు. భక్తులకు మిషన్‌భగీరథ నీళ్లు అందివ్వాలన్న సంకల్పంతో పనులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేశారు. రోజుకు 30 లక్షల లీటర్ల చొప్పున తాగునీరు అందించాలన్న లక్ష్యంతో చేపట్టిన పనులు పూర్తయ్యాయి. మూడు వేల మంది భక్తులు విడిది చేసేలా గిరిజన సంక్షేమ శాఖ నుంచి మూడు చోట్ల ప్రత్యేకంగా పిలిగ్రిమ్‌ షెడ్స్‌ నిర్మించారు. పంచాయతీరాజ్‌, గిరిజన సంక్షేమశాఖ అధికారుల సమన్వయంతో జాతర ప్రాంగణంలో దాదాపు పదివేల తాత్కాలిక టాయిలెట్లను నిర్మించారు. జాతర పరిసరాల్లో ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా వీఐపీ, వీవీఐపీ సహా సాధారణ భక్తుల కోసం ప్రాజెక్టునగర్‌, నార్లాపూర్‌, కొ త్తూర్‌, తాడ్వాయి, మేడారం పరిసరాల్లో వందలాది ఎకరాల్లో పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేశారు. 

అడుగడుగునా నిఘా..

మేడారానికి వచ్చే భక్తులు తిరిగి గమ్యస్థానాలకు చేరుకునే వరకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం సాంతికేక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నది. ములుగు నుంచి పస్రా వరకు ట్రాఫిక్‌ నియంత్రించేందుకు 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. జాతర ప్రాంగణంలో 300 సీసీ కెమెరాలతో కంట్రోల్‌ రూమ్‌లను తెరిచింది. 100 భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసి డ్రోన్‌ కెమెరాలతో అనుసంధానం చేసింది.  

గిరిజన సంప్రదాయం ఉట్టిపడేలా..

ఆదివాసీ గిరిజన సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా జాతర నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ స్పష్టమైన ఆదేశాలివ్వడంతో అధికార యంత్రాంగం ముందుకెళ్తున్నది. కొన్ని శక్తులు పనిగట్టుకొని జాతర ప్రాశస్థ్యాన్ని దెబ్బతీసే విధంగా దుష్ప్రచారం చేస్తున్నాయని, కరోనా వైరస్‌ వంటి మహమ్మారి సోకుతుందని అనవసర ప్రచారం చేస్తున్నాయని, రాష్ట్ర ప్రభు త్వం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది.  

రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు

మేడారం జాత ర కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మేడారానికి చేరువగా ఉండే వరంగల్‌ రైల్వేస్టేషన్‌ మీదుగా ఇప్పటికే 20 ప్రత్యేక రైళ్లను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన అధికారులు తాజాగా ఆయా మార్గంలో వెళ్లే రైళ్లకు అదనంగా బోగీలు అమర్చుతున్నట్టు స్పష్టం చేశారు. హైదరాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌, హైదరాబాద్‌-ఖాజీపేట్‌ ప్యాసింజర్‌, వరంగల్‌-సికింద్రాబాద్‌ ప్యాసింజర్‌, వరంగల్‌-హైదరాబాద్‌ ప్యాసింజర్లకు ఈ ప్రత్యేక బోగీలను ఫిబ్రవరి 8 వరకు కొనసాగించనున్నట్టు తెలిపారు. ప్రత్యేక రైళ్లలో సీనియర్‌ సిటిజన్‌, దివ్యాంగులు, చిన్నారులు, మీడియా, అంధులు.. తదితర పాసుల ద్వారా ప్రయాణానికి అనుమతి ఉంటుందని పేర్కొంది.

మేడారానికి బయలుదేరిన పగిడిద్దరాజు

ఆదివాసీల ఆరాధ్య దైవం సమ్మక్క భర్త పగిడిద్దరాజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలోని యాపలగడ్డ నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడారానికి సోమవారం బయలుదేరారు. పగిడిద్దరాజు యాపలగడ్డ గ్రామానికి చెందిన అరెం వంశీయులకు చెందిన వారు కావడంతో ఇక్కడి అరెం వంశీయులు ప్రతీ జాతరకు పగిడిద్ద రాజును గుడి నుంచి గద్దెలపైకి చేర్చి పూజలు నిర్వహిస్తారు. మూడు రోజులపాటు కాలి నడకన మేడారం తీసుకెళ్తారు. గిరిజన సంప్రదాయాల ప్రకారం అక్కడ ఎదుర్కోళ్లు నిర్వహించి పగిడిద్దరాజు-సమ్మక్కకు వివాహం జరుపుతారు. మేడారంలో నాగవెల్లి జాతరను నిర్వహించి వన దేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు. ఈనెల 5న రాత్రి 9 గంటలలోపు పగిడిద్ద రాజు మేడారం గద్దెల వద్దకు చేరుకోవడంతో మహా జాతర మొదలవుతుంది.  

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close