అలా చేయాలంటే చాలా ధైర్యం కావాలి.. ఆర్ఎక్స్100 నటి

రామ్‌గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అజయ్ భూపతి తన దర్శకత్వ ప్రతిభను ‘ఆర్ఎక్స్100’ ద్వారా అందరికీ చూపించాడు. యూత్ ఓరియెంటెడ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ఆర్ఎక్స్100’ భారీ కలెక్షన్లు రాబడుతోంది. జులై 12న విడుదలైన ఈ సినిమా మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకొని రోజు రోజుకీ తన స్పీడ్ పెంచేస్తోంది.
హీరో హీరోయిన్లు కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్‌ల మధ్య షూట్ చేసిన పలు సన్నివేశాలు యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇందులో.. రోటీన్‌కి భిన్నంగా ఉన్న హీరోయిన్ క్యారెక్టర్ మాత్రం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. నిజానికి ఎంతోమంది హీరోయిన్లు ఈ క్యారెక్టర్ రిజెక్ట్ చేశాక చివరకు పాయల్ రాజ్ పుత్ ఓకే చేసింది.
అయితే పూర్తి నెగెటివ్ పాత్ర పోషించిన తనకు.. పాజిటివ్ కామెంట్స్ రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పింది పాయల్. ఇలాంటి బోల్డ్ డేరింగ్ క్యారెక్టర్లు చేయాలంటే.. చాలా దైర్యం, సాహసం చేయాలని, అవి తనలో ఉన్నాయి కాబట్టే ఏ మాత్రం భయపడకుండా ఓకే చెప్పేశానని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఆమె క్యారెక్టర్, అందుకు తగ్గ అభినయం చూసిన విశ్లేషకులు.. ఆమెకు ముందు ముందు మంచి అవకాశాలు రావడం ఖాయం అంటున్నారు.