ఆంధ్ర

ఛార్జీలు పెంచడం లేదు -ఆర్టీసీ ఎండీ

 విజయవాడ : రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సర్వీసులను రేపటి నుంచి పునఃప్రారంభించనున్నట్లు సంస్థ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ తెలిపారు. గురువారం ఉదయం 7గంటలకు తొలి బస్సు సర్వీస్ ప్రారంభిస్తున్నామన్నారు. సిటీ బస్సు సర్వీసులు తరువాత ప్రారంభిస్తామని చెప్పారు. అంతర్రాష్ట్ర సర్వీసులపై నిషేధం కొనసాగుతుందన్నారు. రాత్రిపూట కర్ఫ్యూ ఉంటుంది. అయినా వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని రాత్రి పూట బస్సులు నడుపుతామని పేర్కొన్నారు. కానీ, బస్ స్టాండ్‌కి రాత్రి 7 లోపు చేరుకోవాలని సూచించారు.

విశాఖ, విజయవాడలో సిటీ బస్సులు నడపడటం లేదు. అంతరాష్ట్ర సర్వీసులు నడపాలని భావించాం. ఆయా రాష్ట్రాల అనుమతి కోసం లేఖలు రాశాం. వారి నుంచి అనుమతి వచ్చాక అంతరాష్ట్ర సర్వీసులు ప్రారంభిస్తాం. సూపర్ లగ్జరీ బస్సుల్లో సీట్లను కుదించాం. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో కూర్చోకూడని సీట్లకు మార్క్ చేశాం. బస్సుల్లో ప్రయాణించే ప్రతి ఒక్క ప్రయాణికుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. బస్ స్టాండ్‌లలో మాస్క్‌లు అందుబాటులో ఉంటాయి. 10 రూపాయలకు మాస్క్ అమ్మాలని నిర్ణయించాం. 58 రోజుల నుండి ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.

నిత్యావసర వస్తువుల కోసం కొన్ని బస్సులు తిప్పాం. వలస కూలీల కోసం అన్ని చెక్ పోస్ట్‌లలో బస్సులు ఉంచాం. రిలీఫ్ సెంటర్‌లలో వాళ్లని చేరవేసేందుకు జిల్లా అధికారుల ఆదేశాల మేరకు బస్సులు ఏర్పాటు చేశాం. ప్రతి బస్ స్టాండ్‌లో శానీటైజర్ సదుపాయాన్ని కల్పిచాము. బస్సు ఎక్కే ముందు ప్రతి ఒక్క ప్రయాణికుడు శానిటైజర్‌తో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. నగదు రహితంగా, పేపర్ లేకుండా టికెట్ ఇవ్వాలని చాలా కాలం కసరత్తు చేశాం. ఆర్డినరి, ఎక్స్ ప్రెస్, అల్ట్రా డీలక్స్, డీలక్స్ బస్సులకు ఆన్లైన్ రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించాం.

ఏ రోజుకు ఆ రోజు బుకింగ్ చేస్తే, వాటికి రిజర్వేషన్‌ చార్జీలు వసూలు చేయడం లేదు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, గూగుల్ పే లాంటి అన్ని రకాల వ్యాలెట్‌ల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. 65 ఏళ్ళు దాటిన వాళ్ళు, 10 ఏళ్ల లోపు పిల్లలను అత్యవసర మైతేనే (మెడికల్ ఎమెర్జెన్సీ) బస్సులో అనుమతిస్తాం. నెమ్మదిగా ఆర్ధిక వృద్ధి పెంచే దిశగానే బస్సు సర్వీసులు పెంచుతున్నాం. కాబట్టి 70% సర్వీసులు, అంటే 1683 బస్సులు మాత్రమే ప్రారంభిస్తున్నాం. ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ఏసీ బస్సులు నడుపుతాం. కానీ దుప్పట్లు ఇవ్వము. ఛార్జీలను పెంచట్లేదు అని ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ చెప్పారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close