టాప్ స్టోరీస్సినిమా

రానా రాక్షస అవతారానికి రూ.180 కోట్లా..?

ప్రతీ సినిమాలో విభిన్నమైన పాత్రలను పోషిస్తూ, తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను తెచ్చుకున్నాడు దగ్గుబాటి రానా. తెలుగు సినీ ఇండస్ట్రీలో తన కుటుంబం చక్రం తిప్పే స్థానంలో ఉన్నా, తన ప్రతిభతోనే కొత్త కొత్త పాత్రలను తనను వెదుక్కుంటూ వచ్చేలా చేసుకుంటున్నాడు. కృష్ణం వందే జగద్గురంలో తన నటనాచాతుర్యాన్ని ప్రదర్శించి.. బాహుబలిలో భల్లాల దేవుడిగా ఛాన్స్ దక్కించుకున్నాడు. ప్రభాస్‌కు దీటుగా మెప్పించి, ఆ పాత్రలో మరెవరినీ ఊహించుకోలేకుండా చేశాడు. భల్లాల దేవ క్యారెక్టర్‌తో దేశవ్యాప్తంగా రానా పేరు మారు మోగిపోయింది.

ఇప్పుడు మరో అద్భుతమైన క్యారెక్టర్‌తో ప్రేక్షకులను మెప్పించబోతున్నాడు. అదే హిరణ్యకశిపుడు. విష్ణువును నరసింహావతారంలో రప్పించి, ఆయన చేతిలో హతమైన హిరణ్యకశిపుడు క్యారెక్టర్‌ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ, టాలీవుడ్‌లో అలాంటి పాత్రను పోషించాలంటే రానాను మించిన వారు లేరని నమ్ముతున్నాడు డైరెక్టర్ గుణశేఖర్‌. రుద్రమదేవితో చారిత్రక సినిమాలను సమర్థవంతంగా తీయగలనని నిరూపించుకున్న గుణశేఖర్‌, ఇప్పుడు హిరణ్యకశిపుడి స్క్రిప్ట్ పనిలో పడ్డారు. దీన్ని చేయడానికి రానా కూడా చాలా ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. అయితే, భారీ సెట్లు వేయాల్సిన అవసరం ఉండడంతో, దీని బడ్జెట్‌ కూడా చాలా ఎక్కువగానే ఉండొచ్చంటున్నారు. దాదాపు రూ. 180 కోట్లు ఖర్చు పెట్టాల్సి రావచ్చని భావిస్తున్నారు.

అయితే, గుణశేఖర్‌ను నమ్మి అంత బడ్జెట్‌ పెట్టడానికి ఎవరూ సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. దీంతో.. సురేశ్‌ ప్రొడక్షన్ బ్యానర్‌పై రానా తండ్రి సురేశ్ బాబే ఈ సినిమాను నిర్మించాలని భావిస్తున్నారట. కొడుకుకు క్రేజ్‌ను విశ్వవ్యాప్తం చేయగలిగే సినిమా కావడం, క్యారెక్టర్‌లో దమ్ముండడం, హిందీ సహా అన్ని భారతీయ భాషల్లోనూ బిజినెస్‌ చేసుకునే అవకాశం ఉండడంతో అన్ని లెక్కలు పక్కాగా వేసుకునే ఈ బడ్జెట్ పెట్టడానికి సురేశ్‌ బాబు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ప్రస్తుత హాథీ మేరీ సాథీ సినిమాలో నటిస్తున్న రానా, అది పూర్తి కాగానే, హిరణ్యకశిపుడి సినిమాకు పనిచేసే అవకాశం ఉంది.

Tags
Back to top button
error: Content is protected by G News !!
Close
Close