సినిమా

పేరులో రిషీ .. రొమాంటిక్ హీరోగా ఇమేజ్

బాలీవుడ్ ఫస్ట్ ఫ్యామిలీ అంటారు కపూర్ల కుటుంబాన్ని. వారి ప్రస్తావన లేకుండా బాలీవుడ్ చరిత్ర రాయడం అసాధ్యం. ఆ కుటుంబంలోని నాలుగు తరాలు కొన్ని తరాలను అలరించాయి. తాత పృథ్విరాజ్ కపూర్, తండ్రి రాజ్ కపూర్, బాబాయిలు శమ్మీకపూర్, శశికపూర్, అన్న రణధీర్ కపూర్, మేనమామలు ప్రేంనాథ్, రాజేంద్రనాథ్, నరేంద్రనాథ్, ప్రేం చోప్డా, తర్వాతి కాలంలో తమ్ముడు రాజీవ కపూర్, రణధీర్ కపూర్ పిల్లలు కరిషఅమా, కరీనా, బాబాయిల పిల్లలు ఇలా తరాలుగా దిగ్వజయంగా కొనసాగిన కుటుంబం. 

బాల నటుడిగా అతడి కెరీర్‌ను కూడా కలుపుకుంటే బాలీవుడ్‌తో ఐదు దశాబ్దాల అనుబంధం రిషీది. తండ్రి రాజ్ కపూర్ హీరోగా కెరీర్ చివర్లో తీసిన ఫిలసాఫికల్ చిత్రం మేరా నామ్ జోకర్ లో బాలనటుడిగా రిషీ కపూర్ నటించాడు. ఆ నటకుగానూ జాతీయ ఉత్తమ బాలనటుని అవార్డు అందుకున్నాడు. అంతకన్నా ముందే శ్రీ 420లో రాజ్, నర్గీస్ గొడుగు పట్టుకుని ప్యార్ హువా ఇకరార్ హువా అని పాడుతుంటే దూరంగా వర్షంలో తడుస్తూ వెళ్లే పిల్లల్లో రిషీ కూడా ఉన్నాడు.

బాలీవుడ్ టాప్ కుటుంబం నుంచి వచ్చిన రిషీకపూర్ 1974లో బాబీతో తెరంగేట్రం చేశాడు. ఆ సినిమా సెన్సేషనల్ హిట్. గ్రేటెస్ట్ షోమ్యాన్‍‌గా పేరుపొందిన తండ్రి రాజ్‌కపూర్ తీసిన ఆ సినిమా రిషీని తారాపథంలోకి రాకెట్ వేగంతో లాంచ్ చేసింది. రాజ్ కపూర్ మార్కు మ్యూజికల్ హిట్. శంకర్-జైకిషన్ లేకుండా లక్ష్మికాంత్-ప్యారేలాల్ సంగీతంతో రాజ్ చేసిన తొలిసినిమా అంచనాలను మించింది. నూనూగు మీసాల లేత యవ్వనంలో రిషీ, అమాయకపు చూపుల డింపుల్ కపాడియా పండించిన పసితనపు రొమాన్స్ వెండితెర మీద నిత్యనూతనం. అలా ఫ్యామిలీ చెట్టునీడన తన కెరీర్ లాంచ్ అయినప్పటికీ రిషీ బాలీవుడ్‌లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. యాంగ్రీ యంగ్‌మ్యాన్ల కస్సుబుస్సుల నడుమ లవర్‌బాయ్‌గా నిలదొక్కుకున్నాడు.

రొమాంటిక్ సినిమాల సక్సెస్ పరంపరతో బాలివుడ్ దిగ్గజాల్లో ఒకడిగా ఎదిగాడు. సోలో హీరోగా, మల్టీస్టారర్ హీరోగా ఎన్ని సినిమాలు చేశాడో లెక్కే లేదు. బాబీ తర్వాత సోలో హీరోగా 51 సినిమాలు చేస్తే అందులో లైలా మజ్ను, రఫూ చక్కర్, సర్గమ్, కర్జ్, ప్రేమ్ రోగ్, నగీనా, హనీమూన్, చాందినీ, హీనా, బోల్ రాధా బోల్, యె వాదా రహా.. ఈ 11 సినిమాలే హిట్టు కొట్టాయి. అందుకే ఇద్దరు హీరోలు, ముగ్గురు హీరోల సినిమాల్లో సర్దుకున్నాడు. ఇద్దరు హీరోల్లో తాను కీలక పాత్ర వేసిన చిత్రాల్లో ఖేల్ ఖేల్ మే, కభీకభీ, హమ్ కిసీసే కమ్ నహీ, బదల్తే రిష్తే, ఆప్ కే దీవానే, సాగర్, అజూబా, చందినీ, దీవానా మొదలైనవి ఉన్నాయి. బిగ్ బీ అమితాబ్‌తో కలిసి అమర్ అక్బర్ అంథోనీ వంటి పలు మల్టీ స్టారర్ సినిమాల్లో నటించాడు. 

2000 తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో యెహై జల్వా, హమ్ తుమ్, ఫనా, నమస్తే లండన్, లవ్ ఆజ్ కల్, పటియాలా హౌస్ వంటి సినిమాల్లో నటించాడు. తనకు కామెడీ ఎక్కువగా నప్పుతుంది కనుక ఆ తరహా క్యారెక్టర్ రోల్స్‌ చేస్తూ రిటైర్మెంట్ కు దగ్గరవుతున్న దశలో క్యాన్సర్ అర్దాంతరంగా కెరీర్ ను బ్రేక్ చేసింది. 2019లో ఝూటా కహీకా, ది బాడీ సినిమాలు విడుదల అయ్యాయి. జూహీ చావ్లాతో కలిసి శర్మాజీ నమకీన్ సినిమా చేస్తుండగా కన్నుమూశాడు. తనతోపాటు 15 చిత్రాల్లో కలిసి నటించిన నీతూ‌సింగ్‌ను 1980లో పెళ్లి చేసుకున్నాడు. కొడుకు రణబీర్ కపూర్ హీరోగా నిలదొక్కుకున్నాడు. కూతురు రిద్దిమాకపూర్ డిజైనర్‌గా స్థిరపడింది. రిషీకి కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడడం అలవాటు. బీఫ్ ఈటింగ్‌పై చేసిన కామెంట్లుపై దుమారం చెలరేగింది. 

ఇటీవల కరోనా లాక్ డౌన్ ఉల్లంఘించే వారిపై కూడా గాటైన కామెంట్లే చేశాడు. ఖుల్లం ఖుల్లా పేరిట 2017లో ప్రచురించిన ఆత్మకథ కూడా పలు వివాదాలకు దారితీసింది. ముఖ్యంగా తన తండ్రితో కొందరు హీరోయిన్లకు గల సంబంధాల గురించి ఆయన రాసిన విషయాలు విమర్శలపాలయ్యాయి. తన తండ్రి బాబీ తనను లాంచ్ చేసేందుకు తీయలేదని ఓ సారి చెప్పాడు. మేరా నామ్ జోకర్ తీసి నష్టాల పాలయ్యాడు.  ఆ నష్టాలను పూడ్చుకునేందుకు ఓ యూత్ రొమాన్స్ తీయాలనుకున్నాడు. రాజేశ్ ఖన్నా రెమ్యూనరేషన్‌ను భరించే శక్తి లేకే తనను పెట్టి చవకగా తీశాడు అని చెప్పడం రిషీకే చెల్లింది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close