టాప్ స్టోరీస్తెలంగాణ

ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయి -కేటీఆర్‌

న్యూఢిల్లీ : గత కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీలు దేశాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని, ఇప్పుడు దేశంలో ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఢిల్లీలో నిర్వహించిన టైమ్స్‌ నౌ సమ్మిట్‌లో భాగంగా భారతదేశ నిర్మాణంలో రాష్ర్టాల పాత్ర అనే అంశంపై కేటీఆర్‌ మాట్లాడారు.

ప్రపంచమంతా తెలంగాణ వైపు చూస్తోంది అని కేటీఆర్‌ తెలిపారు. దేశాభివృద్ధిలో రాష్ర్టాల భాగస్వామ్యం కీలకమన్నారు.  బలమైన రాష్ర్టాలతోనే బలమైన దేశం నిర్మాణం అవుతోంది అని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో రాహుల్‌ను, మోదీని ప్రజలు తిరస్కరించారు. జాతీయ పార్టీలకు ప్రజల్లో ఆదరణ తగ్గిపోయింది. కాంగ్రెస్‌, బీజేపీ దేశానికి చేసిందేమీ లేదన్నారు కేటీఆర్‌. టీఆర్‌ఎస్‌ పార్టీ ఏ జాతీయ పార్టీకి బీ టీం కాదు. తాము తెలంగాణకు ఏ టీం అని కేటీఆర్‌ పేర్కొన్నారు. ప్రజా తీర్పును స్వీకరిస్తామని ఐటీ మంత్రి చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులు తమ శత్రువులు కాదని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

నోట్ల రద్దుకు మద్దతిచ్చినందుకు చింతిస్తున్నాం

నోట్ల రద్దుకు మద్దతు ఇచ్చినందుకు చింతిస్తున్నామని కేటీఆర్‌ అన్నారు. నోట్ల రద్దు సమయంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. క్రాంతి పథంలో నడుస్తామని ఆయన అన్నారు. కానీ అలా జరగడం లేదు. రాష్ట్ర అసెంబ్లీలో కూడా నోట్ల రద్దుకు మద్దతుగా తీర్మానం చేశాం. కానీ ఇప్పుడు చింతిస్తున్నాం అని కేటీఆర్‌ చెప్పారు. నోట్ల రద్దు మన ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఆటంకం కలిగించిందన్నారు కేటీఆర్‌. కేంద్రానికి తెలంగాణ ఎంతో తోడ్పాటును అందించిందన్నారు. కానీ కేంద్రం నుంచి రాష్ర్టాలకు మాత్రం మద్దతు లభించడం లేదని కేటీఆర్‌ పేర్కొన్నారు. 

సీఏఏను వ్యతిరేకిస్తున్నాం

సీఏఏ ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాసేదిగా ఉంది అని కేటీఆర్‌ తెలిపారు. సీఏఏ విషయంలో తాము స్పష్టతతో ఉన్నాం.. సీఏఏలో ముస్లింలను చేర్చకపోవడాన్ని తాము వ్యతిరేకిస్తున్నాం అని ఆయన చెప్పారు. సీఏఏకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో ఓటు వేశామని కేటీఆర్‌ గుర్తు చేశారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close