తెలంగాణ

అతి భారీ వ‌ర్షాలు.. ఆ ఐదు జిల్లాల‌కు రెడ్ అల‌ర్ట్..

హైద‌రాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ‌, రేపు భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. మంగ‌ళ‌వారం ఐదు జిల్లాల‌కు, బుధ‌వారం నాలుగు జిల్లాల‌కు రెడ్ అల‌ర్ట్ హెచ్చ‌రిక జారీ చేసింది. పెద్ద‌ప‌ల్లి, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, ములుగు, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, ఖ‌మ్మం జిల్లాల్లో మంగ‌ళ‌వారం భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. బుధ‌వారం రోజు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మ‌ల్, నిజామాబాద్ జిల్లాల్లో అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. ఇక మిగ‌తా జిల్లాల్లో ఈ రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది.

ఉత్త‌ర‌, మ‌ధ్య బంగాళాఖాతంలో ఉన్న ఆవ‌ర్త‌న ప్ర‌భావంతో వాయ‌వ్య‌, తూర్పు మ‌ధ్య బంగాళాఖాతంలో ఈ అల్ప‌పీడ‌నం ఏర్ప‌డింది. ద‌క్షిణ ఒడిశా, ఉత్త‌రాంధ్ర తీరంలోని అల్ప‌పీడ‌నం ఆగ్నేయ దిశ‌గా తూర్పు, మ‌ధ్య బంగాళాఖాతం వ‌ర‌కు కొన‌సాగుతున్న‌ట్టు అధికారులు పేర్కొన్నారు. రెండు, మూడు రోజుల్లో ఇది ప‌శ్చిమ వాయ‌వ్య దిశ‌గా వెళ్లే అవ‌కాశం ఉంద‌న్నారు.

ఉమ్మడి ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ జిల్లాల్లో సోమ‌వారం వాన దంచికొట్టింది. ఈ ప్రాంతాల్లో ప‌లు కాల‌నీల్లోకి వ‌ర్ష‌పు నీరు చేర‌డంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాగులు, వంక‌లు పొంగిపొర్లాయి. దీంతో ప‌లువురు వాగుల్లో చిక్కుకున్నారు. వ‌ర్షాల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉన్న అధికారులు.. ఎప్ప‌టిక‌ప్పుడు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టి ప‌లువురిని ర‌క్షించారు. కొన్ని ప్రాంతాల్లో అయితే రోడ్లు తెగిపోవ‌డంతో.. ఆయా గ్రామాల‌కు సంబంధాలు తెగిపోయాయి.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close