జాతీయంటాప్ స్టోరీస్

దేశంలో క‌రోనా ప‌రిస్థితిపై ఆర్బీఐ కీల‌క వ్యాఖ్య‌లు..!

ముంబై: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి ఉధృతి చాలా తీవ్రంగా ఉన్న‌ద‌ని ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత‌దాస్ అన్నారు. దేశంలో కరోనా వైరస్‌ విలయ తాండ‌వం కొనసాగుతున్న తరుణంలో ఆయ‌న ఇవాళ ప్రెస్ మీట్ నిర్వ‌హించారు. ఏప్రిల్ నెల‌లో వైర‌స్ శ‌ర‌వేగంగా విజృంభించింద‌ని, అయితే దేశంలో కొవిడ్ ప‌రిస్థితిని ఆర్బీఐ ఎప్ప‌టిక‌ప్పుడూ ప‌ర్య‌వేక్షిస్తూనే ఉన్న‌ద‌ని చెప్పారు. క‌రోనా తొలి వేవ్ నుంచి కోలుకుని బలమైన ఆర్థిక పునరుద్ధరణ వైపు సాగుతున్న తరుణంలోనే ఇప్పుడు సెకండ్ వేవ్ రూపంలో తాజా సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌న్నారు.

కరోనా సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు దేశ బ్యాకింగ్ రంగం సిద్ధంగా ఉండాలని, అవసరమైన అన్ని వర్గాలను ఆదుకునేందుకు ఆర్బీఐ తనవంతు సహకారాన్ని అందిస్తుందని శక్తికాంత దాస్ తెలిపారు. వ‌చ్చే ఏడాది మార్చి 22 వ‌ర‌కు క‌రోనా సంబంధ‌ ఆరోగ్య స‌దుపాయాల మెరుగు, సేవ‌ల అభివృద్ధి కోసం రూ.50 వేల కోట్ల లిక్విడిటీని ఆర్బీఐ ప్ర‌క‌టిస్తున్న‌ద‌ని వెల్ల‌డించారు. మ‌రో ఏడాదిపాటు ద్రవ్యోల్బణాన్ని స్థానిక లాక్ డౌన్ లు, కరోనా వ్యాప్తి ప్రభావితం చేయనున్నాయని ఆయ‌న అంచ‌నా వేశారు.

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌ల‌హీన‌ప‌డింది
పరిస్థితిని నియంత్రించేందుకు ప్రభుత్వ వర్గాలన్నీ కృషి చేయాలని శ‌క్తికాంత‌దాస్‌ కోరారు. దేశంలో క‌రోనా కేసుల సంఖ్య ఇప్ప‌టికే రెండు కోట్లను దాటినందున‌ కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తాము నిర్ణయించామని తెలిపారు. కరోనాను పారదోలేందుకు మ‌రిన్ని క‌ఠిన‌ చర్యలు తీసుకోవాలని, అందుకోసం తమవద్ద ఉన్న అన్ని వనరులనూ వినియోగిస్తామని చెప్పారు. కొన్ని రోజుల క్రితం వ‌ర‌కు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితిలో కనిపించగా.. భారత ఆర్థిక‌వ్య‌వ‌స్థ‌ బలంగా ఉన్న‌దని, ఇప్పుడు భారత్ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ఆయన అన్నారు.

స‌మ‌స్య త్వ‌ర‌లోనే స‌మ‌సిపోతుంది
క‌రోనా మహమ్మారి బారి నుంచి భారత్ త్వ‌ర‌లోనే బయట పడుతుందన్న నమ్మకం ఉన్న‌దని శక్తికాంత దాస్ అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే, ఏప్రిల్‌లో జరిగిన మధ్యంతర పరపతి సమీక్షలో తీసుకున్న నిర్ణయాలకు విరుద్ధంగా తామేమీ సంచలన నిర్ణయాలు తీసుకోవాలని భావించడం లేదని ఆయన తెలిపారు. ద్రవ్య లభ్యత నిమిత్తం ఎటువంటి అటంకాలు లేకుండా చూస్తామని, రెపో రేటును మార్చి 2022 వరకూ ఓపెన్ గానే ఉంచుతామని అన్నారు.

మ‌రో రెండేండ్లు మార‌టోరియం..!
రుణ అవసరాల కోసం చూసేవారికి సులువుగా రుణాలను అందించేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉండాలని, ముఖ్యంగా ప్రాధాన్యతా అవసరాలను బట్టి రుణాలను అందించాలని శక్తికాంత దాస్ బ్యాంకులను కోరారు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు దీర్ఘకాల రెపో నిర్వహణ కింద రూ.10 వేల కోట్లను అందిస్తామని చెప్పారు. గతంలో రెండు సంవత్సరాలపాటు మారటోరియం సదుపాయం పొందిన వారికి మరో రెండేళ్ల మారటోరియం ప్రకటిస్తున్నట్టు ఆయన స్పష్టంచేశారు.

అనిశ్చితిలో భార‌త భ‌విష్య‌త్తు
భారత భవిష్యత్తు ప్రస్తుతం అనిశ్చితిలో ఉందని, దాన్ని తొలగించేందుకు కొన్ని తక్షణ చర్యలు అవసరమని శ‌క్తికాంత దాస్‌ అభిప్రాయపడ్డారు. భార‌త్‌ తరఫున విదేశీ మారక ద్రవ్య నిల్వలు ప్రస్తుతం 588 బిలియన్ డాలర్లు ఉన్నాయని, అదే దేశాన్ని కరోనా నుంచి కాపాడుతుందన్న నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. చిన్న, మధ్య తరహా కంపెనీలకు వన్ టైమ్ వర్కింగ్ కాపిటల్ నిమిత్తం ఇచ్చిన నిధులపై బ్యాంకులు నిబంధనలను సరళతరం చేసేలా ఆదేశాలు ఇచ్చామని ఆయ‌న వెల్లడించారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close