క్రైమ్

రాజ‌స్థాన్‌లో దారుణం.. అర్చ‌కుడి స‌జీవ ద‌హ‌నం

జైపూర్‌: రాజ‌స్థాన్ రాష్ట్రం క‌రౌలి జిల్లాలోని ఓ గ్రామంలో దారుణం జ‌రిగింది. గ్రామంలోని రాధాకృష్ణ ఆల‌యంలో అర్చ‌కుడిగా ప‌నిచేస్తున్న బాబూలాల్ వైష్ణ‌వ్‌పై అత‌ని ప్ర‌త్య‌ర్థులు బుధ‌వారం మ‌ధ్యాహ్నం దారుణానికి పాల్ప‌డ్డారు. అత‌నిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయ‌ప‌డ్డ బాబూలాల్‌ను కుటుంబ‌స‌భ్యులు, బంధువులు క‌లిసి జైపూర్‌లోని ఎస్ఎంఎస్ ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. అక్క‌డ చికిత్స పొందుతూ గురువారం రాత్రి బాబూలాల్ మృతిచెందారు.

కాగా, బాబూలాల్ కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసిన పోలీసులు కైలాష్ మీనా అనే ప్ర‌ధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నాడు. ప‌రారీలో ఉన్న మ‌రో ఐదుగురి కోసం గాలిస్తున్నారు. పోలీసులు తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం.. అర్చ‌కుడు బాబూలాల్‌కు సాగుచేసుకోవ‌డం కోసం రాధాకృష్ణ ఆల‌య ట్ర‌స్టు గ‌తంలో 5.2 ఎక‌రాల భూమిని ఇచ్చింది. ఆ 5.2 ఎక‌రాల భూమిలో ఒక ప‌క్క‌న బాబూలాల్ ఇళ్లు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. 

అందులో భాగంగా జేసీబీ సాయంతో నేల‌ను చ‌దును చేయిస్తున్నాడు. అయితే అదే గ్రామానికి చెందిన కైలాస్ మీనా అత‌ని కుటుంబ‌స‌భ్యులు భూమి త‌మ‌దే అంటూ గొడ‌వ‌కు దిగారు. దీంతో బాబూలాల్ పెద్ద మ‌నుషులను ఆశ్ర‌యించాడు. పంచాయ‌తీ ఏర్పాటు చేసిన గ్రామ‌పెద్ద‌లు బాబూలాల్‌కే అనుకూలంగా తీర్పుచెప్పారు. అనంత‌రం బాబూలాల్ తాను ఇళ్లు నిర్మించాల‌నుకున్నంత వ‌ర‌కు భూమిని చ‌దును చేసి ముందు ఓ షెడ్ వేసుకున్నాడు. అందులో తాను పండించిన జోన్న బ‌స్తాల‌ను భ‌ద్ర‌ప‌ర్చాడు. 

ఈ నేప‌థ్యంలో బుధ‌వారం మ‌ధ్యాహ్నం బాబూలాల్‌ ఇళ్లు నిర్మిస్తున్న ప్రాంతానికి కైలాస్ మీనా అత‌ని మ‌నుషులు వ‌చ్చి గొడ‌వకు దిగారు. బాబూలాల్ దాచివుంచిన ధాన్యం బ‌స్తాల‌పై పెట్రోల్ పోసి త‌గుల‌బెట్టారు. అడ్డుకోబోయిన బాబూలాల్‌పైన కూడా పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయారు. కాగా, బాబూలాల్ బంధువులు ఈ ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదుచేసి ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా.. పోలీసులు అక్క‌డికి వెళ్లి బాబూలాల్ వాంగ్మూలం న‌మోదుచేశారు.

కైలాష్ మీనాతోపాటు మ‌రో ఐదుగురు వ్య‌క్తులు త‌న‌తో గొడ‌వ‌కు దిగార‌ని, మాటామాటా పెరుగ‌డంతో అప్ప‌టికే తెచ్చిపెట్టిన పెట్రోల్‌ను త‌న జొన్న‌బ‌స్తాల‌పై పోసి త‌గుల‌బెట్టార‌ని, అడ్డుకోవ‌డంతో త‌న‌పై కూడా పెట్రోల్ పోసి నిప్పంటించార‌ని బాబూలాల్ పోలీసుల‌కు ఇచ్చి వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఈ వాంగ్మూలం ఆధారంగా పోలీసులు ప్ర‌ధాన నిందితుడు కైలాస్ మీనాను అదుపులోకి తీసుకుని, ప‌రారీలో ఉన్న మ‌రో ఐదుగురికి కోసం గాలిస్తున్నారు. అయితే, ప‌రిస్థితి విష‌మించ‌డంతో గురువారం సాయంత్రం బాబూలాల్ మృతిచెందాడు. 

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close