క్రీడలుటాప్ స్టోరీస్

తొలి టీ20 భారత్‌దే విజయం

గతేడాది వన్డే ప్రపంచకప్‌లో సెమీఫైనల్లో ఓడించిన న్యూజిలాండ్‌ను వారి సొంతగడ్డపైనే ఓడించింది భారత్‌.

  • అదరగొట్టిన రాహుల్‌, కోహ్లీ, అయ్యర్‌..
  • ఐదు టీ20ల సిరీస్‌లో భార‌త్ 1-0తో ఆధిక్యం

ఆక్లాండ్‌:   కొత్త ఏడాది తొలి విదేశీ పర్యటనను  టీమ్‌ఇండియా ఘన విజయంతో ఆరంభించింది.  గతేడాది వన్డే ప్రపంచకప్‌లో సెమీఫైనల్లో ఓడించిన న్యూజిలాండ్‌ను వారి సొంతగడ్డపైనే  ఓడించింది భారత్‌. గత కొన్నేండ్లుగా అన్ని ఫార్మాట్లలో ప్రతీ సిరీస్‌ల్లోనూ గెలుపొందుతున్న కోహ్లీసేన అదే జోరులో టీ20 సిరీస్‌ను అద్వితీయ గెలుపుతో మొదలెట్టింది. దీంతో ఆతిథ్య కివీస్‌తో  ఐదు టీ20ల సిరీస్‌లో భారత్‌  1-0తో ఆధిక్యంలో నిలిచింది.  204 పరుగుల   భారీ లక్ష్య ఛేదనలో కేఎల్‌ రాహుల్‌(56: 27 బంతుల్లో 4ఫోర్లు,3 సిక్సర్లు), విరాట్‌ కోహ్లీ(45: 32 బంతుల్లో 3ఫోర్లు, 1సిక్స్‌), శ్రేయాస్‌ అయ్యర్‌(58 నాటౌట్‌:29 బంతుల్లో 5ఫోర్లు, 3సిక్సర్లు) పరుగుల సునామీ సృష్టించారు. దీంతో   టీమ్‌ఇండియా ఒక ఓవర్‌ మిగిలుండగానే, 4వికెట్లు మాత్రమే కోల్పోయి 6 వికెట్ల తేడాతో  ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.  కీలకసమయంలో ఒత్తిడిలో ఉన్న భారత్‌ను అయ్యర్‌, మనీశ్‌ పాండే(14 నాటౌట్‌) కలిసి విజయ తీరాలకు చేర్చారు. కివీస్‌ బౌలర్లలో ఇష్‌ సోదీ రెండు వికెట్లు తీయగా.. టిక్నర్‌,  మిచెల్‌ సాంట్నర్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. ఆరంభంలో రోహిత్‌ శర్మ(7) స్వల్ప స్కోరుకే పెవిలియన్‌ చేరినా బ్యాట్స్‌మెన్‌ సమష్టిగా రాణించింది. 

మ‌న్రో ధ‌నాధ‌న్‌..

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ జట్టులో  కోలిన్‌ మన్రో(59: 42బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు), కేన్‌ విలియమ్సన్‌(51: 26 4ఫోర్లు, 4సిక్సర్లు), రాస్‌ టేలర్‌(54 నాటౌట్‌: 27 బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు న్యూజిలాండ్‌  203 పరుగులు చేసింది.   ఆరంభంలో ధనాధన్‌ బ్యాటింగ్‌తో అలరించిన  కివీస్‌ను.. ఆఖర్లో భారత్‌ కట్టడి చేసింది. ఓపెనర్లు గప్తిల్‌, మన్రో,  తమదైన శైలిలో వేగంగా ఆడటంతో తొలి ఐదు ఓవర్లలోనే కివీస్‌ 50కి పైగా పరుగులు రాబట్టింది. మొదట్లో కివీస్‌ జోరు చూస్తే అలవోకగా 230కి పైగా స్కోరు చేస్తుందని అనిపించింది.  

బుమ్రా, చాహ‌ల్ భళా..

కీలక సమయంలో శివమ్‌ దూబే.. గప్తిల్‌ను ఔట్‌ చేయడంతో భారత్‌ ఊపిరిపీల్చుకుంది. శివమ్‌ దూబే బౌలింగ్‌లో  గప్తిల్‌ భారీ షాట్‌ ఆడగా బౌండరీలైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న రోహిత్‌ అద్భుత క్యాచ్‌తో భారత్‌కు తొలి వికెట్‌ దక్కింది. అనంతరం మన్రో బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అర్ధశతకం సాధించిన తర్వాత  శార్దుల్‌ ఠాకూర్‌ వేసిన 12వ ఓవర్లో మన్రో.. చాహల్‌ చేతికి చిక్కాడు.   స్వల్ప వ్యవధిలోనే మన్రో,గ్రాండ్‌హోం వికెట్లను చేజార్చుకున్న  కివీస్‌ను  విలియమ్సన్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. ఆఖర్లో సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ రాస్‌ టేలర్‌ మెరుపు బ్యాటింగ్‌తో విజృంభించడంతో 200 పరుగుల మార్క్‌ను చేరుకుంది. భారత బౌలర్లలో  స్పీడ్‌స్టర్‌ బుమ్రా, స్పిన్నర్‌ చాహల్‌ ధాటిగా బంతులేస్తూ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. బుమ్రా, శార్దుల్‌, చాహల్‌, దూబే, జడేజా తలో వికెట్‌ దక్కించుకున్నారు.  

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close