క్రైమ్జాతీయం

ఆ పోలీస్ అధికారి ఉగ్రవాదుల బంటు..

జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులతో పట్టుబడ్డ పోలీసు అధికారి దేవిందర్ సింగ్ చెప్తున్న కథనంలో నిజం లేదని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఆయనను కూడా ఉగ్రవాదిగానే పరిగణించాలని నిర్ణయించారు. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ రియాజ్ నాయికూను హతమార్చేందుకు తాను ఉగ్రవాదులతో దోస్తీ చేసినట్టు ఆయన చెప్పారు. అయితే అందుకు తగిన ఆధారాలేవీ ఆయన సమర్పించలేకపోయారని దర్యాప్తు అధికారులు పేర్కొంటున్నారు. శ్రీనగర్ విమానాశ్రయంలో యాంటీ-హైజాకింగ్ విభాగంలో పనిచేస్తున్న దేవిందర్ సింగ్‌ను సస్పెండ్ చేశారు. ఆయన చెప్తున్నట్టుగా ఉగ్రవాదులకు సంబంధించి రహస్య బాధ్యతలేవీ ఆయనకు పైఅధికారులు అప్పగించలేదు. అంతేకాకుండా ఆయన సదరు బాధ్యతల గురించి ఇతరులకు తెలియపర్చనూ లేదు.
నిజానికి ముడుపులు తీసుకుంటూ ఉగ్రవాదులకు వసతి, రవాణా సౌకర్యాలు దేవిందర్ సింగ్ కల్పిస్తున్నట్టు దర్యాప్తు అధికారుల దృష్టికి వచ్చినట్టు తెలిసింది. ఈ మేరకు ఆయన ఇదివరకు నిర్వర్తించిన డ్యూటీలపై, ఆదాయవ్యయాలపై లోతైన విశ్లేషణ చేపట్టారు. నవీద్ బాబు, అల్తాఫ్ అనే ఇద్దరు ఉగ్రవాదులతో కలిసి ప్రయాణిస్తుండగా దేవిందర్‌సింగ్‌ను శనివారం ఓ చెక్ పోస్టు వద్ద పట్టుకున్నారు. ఆయన తన గుర్తింపును దాచిపెట్టకుండా కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తున్నట్టు తనిఖీ అధికారులకు చెప్పారు.

కానీ ఉగ్రవాదులను గుర్తించిన అధికారులు వెంటనే అందరినీ అదుపులోకి తీసుకున్నారు. తర్వాత శ్రీనగర్‌లోని ఇంద్రానగర్‌లో సింగ్ నివాసం నుంచి ఒక ఎకె-47, రెండు పిస్టల్స్, లక్షలాది రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులకు సాయపడేందుకు సింగ్ రూ.12 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఓ అధికారి చెప్పారు. సింగ్ తోపాటుగా పట్టుబడ్డ ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకరైన నవీద్ బాబు గత ఏడాది 11 మంది వలస కార్మికుల కాల్చివేత కేసులో ఉన్నాడని తెలుస్తున్నది.

Tags
Back to top button
error: Content is protected by G News !!
Close
Close