కక్షగట్టింది.. విషం కలిపింది..ఓ బాలిక కుట్ర

తమ్మడిని హత్య చేశారన్న కోపంతో..విద్యార్థులందరిపై కక్ష తీర్చుకునేందుకు ఓ బాలిక కుట్ర చేసింది. మధ్యాహ్న భోజనంలో విషం కలిపి పిల్లలందరి ప్రాణాలు తీయాలనుకుంది. ఈ విషయాన్ని వంట మనిషి ముందే పసిగట్టడంతో విద్యార్థులందరూ ప్రాణాలతో బయటపడ్డారు. గోరఖ్పూర్ జిల్లాలోని ప్రాథమిక పాఠశాలలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఐదో తరగతి విద్యార్థి.. మరో విద్యార్థిని ఇటుకతో కొట్టి చంపాడు. ఈ క్రమంలో సోదరి పాఠశాలపైనే కక్ష పెంచుకుంది. తన సోదరుడిని చంపింనందుకు గానూ..పిల్లలందరికి విషం ఇవ్వాలని ప్లాన్ చేసింది.
దీంతో మంగళవారం మధ్యాహ్నం స్కూల్లో భోజనం తయారు చేస్తుండగా.. ఆ ఆహారంలో ఆమ్మాయి విషం కలిపింది. దీన్ని గమనించిన వంట మనిషి పాఠశాల సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఆహారాన్ని ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కు పోలీసులు పంపించారు. ఆ నివేదిక రాగానే విద్యార్థినితో పాటు ఆమె తల్లిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అయితే విచారణలో భాగంగా బాలికను పోలీసులు ప్రశ్నించారు. తాను ఆహారంలో ఎలాంటి విషం కలపలేదని బాలిక పోలీసులకు స్పష్టం చేసింది.