ఆంధ్ర

అర్ధరాత్రి అరెస్టులు, నిర్బంధాలతో జనసైనికులను అడ్డుకోలేరు -పవన్ కల్యాణ్

  • నిరుద్యోగులకు జనసేన మద్దతు
  • ఎంప్లాయిమెంట్ ఎక్చేంజీలలో వినతులు
  • పోలీసులు అడ్డుకున్నారన్న పవన్
  • నిబంధనలు మాకేనా? అంటూ ఆగ్రహం

నిరుద్యోగులకు మద్దతుగా ఏపీలో అన్ని జిల్లాల్లో ఉన్న ఎంప్లాయిమెంట్ ఎక్చేంజీలలో జనసేన వినతిపత్రాలు ఇచ్చే కార్యాచరణను పోలీసులు అడ్డుకోవడంపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. నిరుద్యోగ యువతను ప్రభుత్వం మోసం చేయడంపై ప్రశ్నిస్తున్న జనసేన శ్రేణులను అక్రమంగా అరెస్ట్ చేస్తూ, గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

2.30 లక్షల ఉద్యోగాలని ఆశచూపి, 10 వేల ఉద్యోగాలతో సరిపెట్టడంతో యువత ఆక్రోశిస్తోందని తెలిపారు. వారికి సంఘీభావంగా జనసేన నేతలు, కార్యకర్తలు ఎంప్లాయిమెంట్ ఎక్చేంజీలలో వినతిపత్రాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తే, సోమవారం అర్ధరాత్రి నుంచే అరెస్టులు, గృహనిర్బంధాలు చేస్తూ పార్టీ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేశారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. నిబంధనలు జనసేనకు మాత్రమే వర్తిస్తాయా? అధికార పార్టీ భారీ జనంతో నిర్వహించే కార్యక్రమాలకు, ఊరేగింపులు, సన్మానాలకు ఈ నిబంధనలు వర్తించవా? అని జనసేనాని నిలదీశారు.

ధర్మం, న్యాయం పక్షాన మాట్లాడడం, ప్రజాస్వామ్యయుతంగా ముందుకు వెళ్లడం జనసేన నైజం అని ఉద్ఘాటించారు. నిర్భంధాలు, అరెస్టులతో తమ గొంతు నొక్కాలనుకోవడం అసాధ్యమని స్పష్టం చేశారు. ఎంత కట్టడి చేయాలని చూసినా జనసైనికులు నిరుద్యోగుల తరఫున జిల్లాల ఉపాధి అధికారులకు వినతి పత్రాలు అందించడంలో విజయవంతం అయ్యారని వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క జనసైనికుడికి హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నట్టు వివరించారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close