నెత్తురోడిన పాక్.. 133 మందికి పైగా మృతి

పాకిస్థాన్ శుక్రవారం నెత్తురోడింది. రెండు ఎన్నికల ర్యాలీలే లక్ష్యంగా జరిగిన పేలుళ్లలో ఓ జాతీయ స్థాయి నాయకుడు సహా మొత్తం 133 మంది మరణించారు. దాదాపు 162 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈనెల 25న జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం పార్టీలు ప్రచారంలో బిజీగా ఉండగా నాయకులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు.
బలూచిస్తాన్ ప్రావిన్సులోని మస్తుంగ్‌లో బలూచిస్తాన్ ఆవామీ పార్టీ నేత సిరాజ్ రైసాని నిర్వహిస్తున్న ఎన్నికల ర్యాలీపై ఉగ్రవాదులు దాడి చేయగా సిరాజ్ సహా మొత్తం 128 మంది ప్రాణాలు కోల్పోగా 125 మందికి పైగా గాయపడ్డారు. అంతకు ముందు ఖైబర్ ఫక్తున్వా ప్రావిన్సులోని బన్నూ ప్రాంతంలోనూ ముతహిద మజ్లిస్ అమల్ పార్టీ నేత అక్రం ఖాన్ దురానీ ర్యాలీ వద్ద కూడా ఉగ్రవాదులు పేలుళ్లు జరపగా ఐదుగురు మృతి చెందగా 37 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ ఘటనలో దురానీ క్షేమంగా బయటపడ్డారు. దురానీ పాకిస్తాన్ తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ప్రముఖ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్‌పై పోటీ చేస్తున్నారు.
దాదాపు 20 కిలోల పేలుడు పదార్ధాలతో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు బాంబ్ స్క్వాడ్ తనిఖీల్లో తేలింది. పేలుళ్లకు పాల్పడింది తామేనని ఐసిస్ ప్రకటించింది. గత మంగళవారం ఆవామీ నేషనల్ పార్టీ ర్యాలీలో తాలిబన్లు ఆత్మహుతి దాడికి పాల్పడగా 20 మంది మరణించారు. ఉగ్రవాదుదాడులను పాకిస్తాన్ అధ్యక్షుడు మమ్నూన్, ప్రధాని ముల్క్ ఖండించారు.