తెలంగాణ

కేంద్రం బాధ్యతారాహిత్యం

  • బాయిల్డ్‌ రైస్‌ తీసుకునేది లేదంటున్నారు
  • వానకాలంలో 62 లక్షల ఎకరాల్లో వరిపంట
  • కోతలు స్టార్ట్‌ అయినయి.. ధాన్యం వస్తున్నది
  • ఎంత ధాన్యం తీసుకుంటరో కేంద్రం చెప్పట్లే

హైదరాబాద్‌ : ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం పూర్తి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కాలికి పెడితే మెడకు.. మెడకు పెడితే కాలికన్నట్టు మెలికలు తిప్పుతున్నదని మండిపడ్డారు. ‘ఎంవోయూ చేస్తరు. ధాన్యం తీసుకోవడానికి నిరాకరిస్తరు. కన్ఫ్యూజ్‌ చేస్తరు’ అని విమర్శించారు. ‘ఈ మధ్య నేనే స్వయంగా ఢిల్లీకి వెళ్లి సంబంధితశాఖ మంత్రిని కలవడం జరిగింది. ఎఫ్‌సీఐ ఎంవోయూ చేయడం.. మీరు నిరాకరించడం సరైన పద్ధతికాదని చెప్పా. ఒక సంవత్సరంలో రాష్ట్రం నుంచి ఎంత తీసుకుంటరో చెప్పండి, దాని ప్రకారమే రైతులకు చెబుతాం. పంట మార్పిడి చేసుకుంటామని చెప్పినం. పంట మార్పిడి చేయించండని, పంట మారిస్తే ఇన్సెంటివ్‌ ఇస్తమని మూడుసార్లు లేఖలు ఇచ్చారు’ అని తెలిపారు. ఆదివారం ప్రగతిభవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యాంశాలు సీఎం మాటల్లోనే..

సైంటిఫిక్‌ నిల్వ సామర్థ్యం ఎఫ్‌సీఐ వద్దే
దేశంలో ఆహార కొరత రాకుండా కాపాడే బాధ్యతను రాజ్యాంగ నిర్మాతలు కేంద్రంపై పెట్టారు. అందులోంచి పుట్టిందే ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా. ఎఫ్‌సీఐకి దేశవ్యాప్తంగా అన్ని తాలుకా సెంటర్లలో సైంటిఫిక్‌ గోదాములున్నయి. నెలలు, సంవత్సరాల తరబడి ధాన్యాన్ని నిల్వ చేయాల్సి వచ్చినా పనిచేయగల సదుపాయం ఎఫ్‌సీఐ వద్ద తప్పిస్తే ఏ రాష్ట్రం వద్ద లేదు. రాష్ర్టాలకు గోదాములు ఉన్నా కొద్ది రోజుల కోసమే ఉంటవి తప్ప సైంటిఫిక్‌ గోదాములు ఉండవు. ధాన్యం ఎగుమతి చేయాలన్నా, విత్తనాల వాడకానికి వినియోగించాలన్నా కేంద్రమే చేయగలదు. ఆ అధికారం ఏ రాష్ట్రప్రభుత్వానికి ఉండదు.

బాయిల్డ్‌ రైస్‌ను తీసుకోరట
బియ్యం వెనుకో కథ ఉన్నది. వానకాలం పంట తక్కువ టెంపరేచర్‌లో వస్తది. నూకరాదు. మిల్లర్స్‌కు ప్రాబ్లమ్‌ కాదు. తెలంగాణలో యాసంగి పంట ఫిబ్రవరి తర్వాత ఈనితేనే ధాన్యం వస్తది. లేకపోతే తాలైతది. ఫిబ్రవరి 20 తర్వాత టెంపరేచర్‌ పెరుగుతది. మార్చి, ఏప్రిల్‌ దాక కోతలు జరగుతయి. అప్పుడు 35 డిగ్రీల ఉష్ణోగ్రతలుంటయి. కొన్ని రాష్ర్టాల్లో బాయిల్డ్‌రైస్‌ వినియోగం ఉన్నది. కేంద్రమే అన్ని రాష్ర్టాలకు పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ స్కీమ్‌ కింద బాయిల్డ్‌ రైస్‌ను కేటాయిస్తది. వాళ్లే బాయిల్డ్‌రైస్‌ తీసుకుని రాష్ర్టాలకు పంపిస్తరు. ఈ బాయిల్డ్‌ రైస్‌ను కేంద్రం తీసుకోబోమంటున్నది. తెలంగాణలో యాసంగి పంట అంటే బాయిల్డ్‌ రైసే. వానకాలంలో రా రైస్‌ వస్తది. రా రైస్‌ పడితే నూక ఎక్కువయ్యి బియ్యం పర్సంటేజీ తగ్గి గిట్టుబాటు కాదు. అందుకే రా రైస్‌ పట్టరు.

బలవంతంగా రాసిచ్చినం
క్రితంసారి 80% బాయిల్డ్‌, 20% రారైస్‌ తీసుకుంటమని అన్నరు. ఎఫ్‌సీఐ జనరల్‌ మేనేజర్‌ ఇదే తీరున సివిల్‌ సప్లయిస్‌ అధికారులకు లెటర్‌ ఇచ్చిన్రు. 50 లక్షల టన్నులు తీసుకుంటమన్నరు. 24 లక్షల టన్నులు తీసుకుని, మిగతాది తీసుకోమని మెలికపెట్టిన్రు. పైగా భవిష్యత్తులో బాయిల్డ్‌రైస్‌ తీసుకోబోమని, లిఖితపూర్వకంగా ఇస్తేనే ఈ సంవత్సరం తీసుకుంటమని చెప్పిన్రు. వేల కోట్ల వ్యవహారమని, రైతులు నష్టపోవద్దని బలవంతంగా రాసిచ్చినం. మొదలు 24 లక్షల టన్నులు, తర్వాత 20 లక్షల టన్నులు తీసుకున్నరు. ఇంకో 5 లక్షల టన్నులు తీసుకోలేదు. గత యాసంగి వడ్లే 5 లక్షల టన్నులు మిగిలింది. వాటి సంగతే కేంద్రం తేల్చలేదు. ఇటీవలే నేను ఢిల్లీ వెళ్లినప్పుడు సంబంధిత మంత్రిని కలిసి ఈ సంవత్సరం ఎంత తీసుకుంటరో చెప్పమని అడిగితే.. ఇప్పటివరకు చెప్పలే. యాసంగి పంటేకాదు ఈ కాలం, ఆ కాలంలో ఎంత తీసుకుంటరో స్పష్టం చేయలే. బాయిల్డ్‌ రైస్‌ ఒక్క కేజీ తీసుకోమని చెప్పడమే కాకుండా, రారైస్‌ గురించిన ముచ్చటే లేదు. వర్షాకాలంలో 62 లక్షల ఎకరాల వరిపంట వేసిన్రు.

కోతలు స్టార్ట్‌ అయినయి. ధాన్యం వస్తున్నది. ఎంత ధాన్యం తీసుకుంటరో ఈరోజు వరకు కమ్యూనికేషన్‌ లేదు. సుమారు కోటి 70 లక్షల టన్నుల వరకు ధాన్యం వస్తే, కోటి 10 లక్షల టన్నుల వరకు రైస్‌ వస్తుంది. వర్షాకాలం పంటనే తీసుకునే దిక్కులేదు. దానికే లెటర్‌ రాలేదు. మొన్ననే మంత్రికి ఫోన్‌ చేసిన. ‘విదేశాలకు పోయిన. వన్‌ టూ డేస్‌ల చెప్తం’ అన్నరు. ఇంతవరకు చెప్పలే. ఇది ఇట్లుంటే. ‘మీ దగ్గర 62 లక్షల ఎకరాల పంట లేనట్లుంది. శాటిలైట్‌ పిక్చర్‌ చూపిస్తలేదు’ అని మనల్ని కించపరిచే మాట మాట్లాడిన్రు. ‘కొంటే కొంటమని చెప్పండి.. ఒక రాష్ట్ర ప్రభుత్వంగా లేనివి చెబుతమా. రికార్డులు డిజిటలైజ్‌ చేసినం. ధరణి పోర్టల్‌ తెచ్చినం. రైతుబంధు డబ్బులిస్తున్నం. బ్యాంక్‌ ఖాతాల పడుతున్నయి. ఇంత పారదర్శకంగా చేస్తే దానిని మీరు కాదని చెప్తే చాలా టూమచ్‌’ అని నేను కోపానికి వచ్చిన. సరే మీవాళ్లను పంపమంటే అగ్రికల్చర్‌, ఫైనాన్స్‌ సెక్రటరీలు మొన్న ఢిల్లీకిపోయి మూడ్రోజులు ఉండివచ్చిన్రు. దానిమీద ఉలుకులేదు.. పలుకుపోలేదు. 62 లక్షల ఎకరాల్లో వచ్చే కోటి 70 లక్షల టన్నులదే అతీగతీలేదు.

కిషన్‌రెడ్డీ..హుందాగా ఉండాలె
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా తప్పుడు మాటలు మాట్లాడుతున్నరు. ఇది మంచిదికాదు. నేను కూడా కేంద్రంలో మంత్రిగా ఉన్న. చాలా హుందాగా ఉండాలె. కేసీఆరే బాధ్యుడని హుజూరాబాద్‌లో మాట్లాడిండు. అన్నీ అబద్ధాలే. నేను అప్పుడు యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా ఉండే, అప్పుడు నేను చేసిన పనికి ఇప్పుడు ధరలు పెంచుతున్నాం అంటున్నారు. ఉన్నదా నీ దగ్గర లెక్క? చూపిస్తవా? వస్తవా? ప్రతి విషయాన్ని లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు, భ్రమలు కల్పించి అబద్ధాలు చెబుతున్నరు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close