మాన్సూన్ కార్లపై ఆఫర్ల జడివాన

మాన్సూన్ ఆఫర్ల పేరుతో రాయితీల వర్షం కురిపించేందుకు కార్ల తయారీ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ట్యాక్సేషన్, సుంకం, రెగ్యులేషన్ మార్పులతో గతేడాది అష్టకష్టాలు పడిన ఆటోమొబైల్ రంగం ఈ ఏడాది కొంత కోలుకుంది. గత కొన్ని త్రైమాసికాలుగా ప్యాసింజర్ వాహనాల అమ్మకం ఊపందుకోవడంతో ఈ జోరును మరింత పెంచాలని కారు మేకర్లు యోచిస్తున్నారు.
ఇందులో భాగంగా మాన్సూన్ పేరుతో ఆగస్టులో ఆఫర్ల వర్షం కురిపించేందుకు సిద్ధమవుతున్నాయి. రూ.90 వేలతో మొదలు రూ. 7 లక్షల వరకు ఆఫర్ చేస్తున్నాయి. అధునాతన ఫీచర్లతో దేశంలోని వాహనదారులను ఆకర్షిస్తున్న ఫోర్డు ఫిగో లక్ష రూపాయల తగ్గింపుతో వస్తుండగా, హ్యుందయ్ ఐ20పై రూ.90 వేల రాయితీ లభించనుంది. హ్యుందయ్ గ్రాండ్ ఐ10పై లక్ష రూపాయల వరకు రాయితీ లభించనుంది.
మారుతి సుజుకి వేగన్ ఆర్‌పై రూ.75 వేలు, మారుతి సుజుకి ఇగ్నిస్‌పై రూ.45 వేల రాయితీ పొందే అవకాశం ఉంది. ఎస్యూవీ, వీపీవీల విషయానికొస్తే టాటా హెక్సాపై రూ. లక్ష, మెర్సిడెస్ బెంజ్‌పై రూ.6 లక్షలు, ఆడి క్యూ3పై రూ.3.5 లక్షలు, టొయోటా ఇన్నోవా క్రిస్టా (పెట్రోల్)పై రూ.55 వేలు, బీఎండబ్ల్యూ 330ఐ ఎం-స్పోర్ట్‌పై రూ.7 లక్షలు, ఆడి ఏ3పై రూ.5 లక్షలు, ఫోర్డ్ యాస్పైర్పై రూ. లక్ష, మారుతి సియాజ్ (డీజిల్)పై 80 వేల రూపాయల రాయితీ లభించే అవకాశం ఉంది.