అంతర్జాతీయం

కరోనా: ఉత్తర కొరియాలో పేషెంట్‌ కాల్చివేత!

ప్యాంగ్‌యాంగ్‌: కోవిడ్‌- 19(కరోనా వైరస్‌) పేరు చెబితేనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ప్రాణాలు బలిగొనే ఆ వైరస్‌ వ్యాపించకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ తమ పౌరులను కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఉత్తర కొరియా మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించింది. కరోనా వైరస్‌ సోకినట్లుగా భావిస్తున్న ఓ వ్యక్తిని పాశవికంగా హతమార్చింది. ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ నియంతృత్వ పోకడలకు అద్దంపట్టే ఈ ఘటనపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వివరాలు… చైనాలో కరోనా వైరస్ మూలాలు బయటపడిన నాటి నుంచి.. కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దౌత్యపరంగా తమకు మిత్రపక్షంగా ఉన్న ఏకైక దేశం చైనా సరిహద్దును సైతం మూసివేశారు. అంతేకాకుండా… కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో తమ దేశ పౌరులతో పాటు విదేశీయులను కూడా ఎప్పటికప్పుడు నిర్బంధంలోకి తీసుకున్నా.. అధికారులకు సహకరించాలని ఆదేశించారు. అదే విధంగా చైనాకు వెళ్లివచ్చిన తమ దేశ పౌరులు, అధికారులను నిర్బంధిస్తున్నారు.

ఈ క్రమంలో నిర్బంధం నుంచి బయటకు వచ్చి బయట స్నానం చేసేందుకు ప్రయత్నించిన ఓ పేషెంట్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సదరు వ్యక్తిని కాల్చివేశారు. ఈ మేరకు దక్షిణ కొరియాకు చెందిన డాంగ్‌- ఆ ఇల్బో అనే వార్తాపత్రిక ఓ కథనం ప్రచురించింది. ఉత్తర కొరియాలో ఒక్క కరోనా వైరస్‌ కూడా నమోదు కాలేదన్న విషయం అబద్ధమని.. ఇప్పటికే వైరస్‌ కారణంగా అక్కడ పలువురు వ్యక్తులు మృత్యువాత పడ్డారని పేర్కొంది. మరోవైపు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం ఉత్తర కొరియాలో కరోనా కారణంగా మరణాలు సంభవించినట్లు తమకు ఎటువంటి సమాచారం అందలేదని తెలిపింది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close