కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఆలోచన లేదు -రిలయన్స్ సంస్థ

కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు కార్పొరేట్ సంస్థలకు ఉపయుక్తంగా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పందించింది. రైతులతో కాంట్రాక్ట్ కుదుర్చుకోవడం కానీ, కార్పొరేట్ ఫార్మింగ్ వ్యాపారం చేసే ఆలోచన తమకు లేదని రిలయన్స్ సంస్థ పేర్కొన్నది. తామెప్పుడు వ్యవసాయ భూముల్ని.. కార్పొరేట్ ఫార్మింగ్ కోసం లీజు తీసుకోలేదన్నది. భవిష్యత్తులోనూ కార్పొరేట్ వ్యవసాయం కానీ కాంట్రాక్టు వ్యవసాయం చేసే ఉద్దేశం లేదని రిలయన్స్ సంస్థ స్పష్టం చేసింది. రైతుల ఆరోపణలపై ఇవాళ ప్రకటన చేసిన రిలయన్స్ సంస్థ.. తామెప్పుడు ఆహార ధాన్యాలను రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేయలేదని పేర్కొన్నది. తమకు సప్లై చేసేవాళ్లు మాత్రం రైతుల నుంచి కనీస మద్దతు ధరకే ఆహార ఉత్పత్తుల్ని కొనుగోలు చేస్తారని రిలయన్స్ సంస్థ పేర్కొన్నది.
టవర్ల ధ్వంసంపై కేసు..
తక్కువ ధరకే ఆహార ధాన్యాలను కొనుగోలు చేసేందుకు ఎవరితోనూ సుదీర్ఘ కాల ఒప్పందాన్ని కుదుర్చుకోలేదని రిలయన్స్ తెలిపింది. భారతీయ రైతుల ఆశలకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు రిలయన్స్ చెప్పింది. కష్టపడి పంట పడించిన రైతుకు న్యాయం చేయడమే తమ ఉద్దేశమని వెల్లడించింది. కనీస మద్దతు ధర విధానాన్ని పాటించాలని తమ సరఫరాదారులకు సూచిస్తున్నట్లు ఆ సంస్థ పేర్కొన్నది. రిలయన్స్ సంస్థ కానీ, అనుబంధ సంస్థలు కానీ.. వ్యవసాయ భూముల్ని కొనలేదని చెప్పింది. కార్పొరేట్ కానీ కాంట్రాక్ట్ ఫార్మింగ్ కోసం భూమి కొనలేదని, అటువంటి ప్రణాళికలు కూడా లేనట్లు ఆ సంస్థ స్పష్టం చేసింది. పంజాబ్, హర్యానాలో కమ్యూనికేషన్ టవర్లను కూల్చిన ఘటనపై కోర్టులో పిటీషన్ వేశామని, అయితే తమ ప్రత్యర్ధులు స్వార్ధ ప్రయోజనం కోసం ఆ విధ్వంసం సృష్టించినట్లు రిలయన్స్ సంస్థ ఆరోపించింది.