అంతర్జాతీయంబిజినెస్

బ్రిటన్‌ ఆర్థిక మంత్రిగా ఇన్ఫోసిస్‌ మూర్తి అల్లుడు

జాన్సన్‌ కొత్త మంత్రివర్గంలో రిషీకి చోటు

ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు, భారత సంతతి యువ రాజకీయవేత్త రిషి సునక్‌.. బ్రిటన్‌ నూతన ఆర్థిక మంత్రిగా నియమితులైయ్యారు. బ్రిటిష్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌ తన మంత్రివర్గ విస్తరణ, పునర్‌వ్యవస్థీకరణలో రిషీకి దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతల్ని అప్పగించారు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో జాన్సన్‌కు భారీ మెజారిటీ వచ్చిన విషయం తెలిసిందే. కాగా, పాకిస్తాన్‌ సంతతికి చెందిన సాజిద్‌ జావిద్‌ తన ఆర్థిక మంత్రి పదవి (ఖజానా చాన్స్‌లర్‌)కి అనూహ్యంగా రాజీనామా చేయడంతో రిషీ తెరపైకొచ్చారు. జావిద్‌ జూనియర్‌గా ఉన్న రిషీ.. నిరుడు జూలై 24 నుంచి ట్రెజరీ చీఫ్‌ సెక్రటరీగా పనిచేస్తూ వచ్చారు. ఈ క్రమంలో గురువారం ఏకంగా దేశ ఖజానాకు చాన్స్‌లరైయ్యారు. యార్క్‌షైర్‌లోని రిచ్‌మండ్‌ కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీగా ఉన్న 39 ఏండ్ల రిషీ.. మూర్తి కూతురు అక్షతను 2009లో పెండ్లి చేసుకున్నారు. 

వీరికిద్దరు సంతానం. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, స్టాన్‌ఫోర్డ్‌ గ్రాడ్యుయేటైన రిషీ.. 2015లో బ్రిటన్‌ పార్లమెంట్‌లోకి తొలిసారి అడుగుపెట్టారు. ఆ తర్వాత కన్జర్వేటివ్‌ పార్టీలో అంచలంచెలుగా ఎదిగారు. బ్రెగ్జిట్‌ (యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలిగే ప్రక్రియ)లో జాన్సన్‌ వ్యూహాలకు రిషీ విధేయుడిగా పనిచేసి ఆయనకు దగ్గరైయ్యారు. ఇప్పుడు బ్రిటన్‌ ఆర్థిక మంత్రి అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. రిషీ తల్లి ఫార్మసిస్టు అవగా, తండ్రి నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ జనరల్‌ ప్రాక్టీషనర్‌. ఇదిలావుంటే తాజా మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భారత సంతతికి చెందిన ఎంపీలు అలోక్‌ శర్మ, సుయెల్లా బ్రవర్మన్‌ మరికొందరికి మంత్రి పదవులు దక్కుతాయన్న అంచనాలు వ్యక్తమైయ్యాయి. ప్రస్తుత మంత్రుల్లో పలువురి రాజీనామాలు, తొలగింపులతో కొత్తవారు చాలానే ఆశలు పెట్టుకున్నారు.

Tags
Back to top button
error: Content is protected by G News !!
Close
Close