తెలంగాణ

ఆదర్శంగా సాగుదాం

  • నియంత్రిత సాగుతో సత్ఫలితాలు సాధిద్దాం
  • రైతులకు ఎక్కువ ప్రయోజనమే సర్కారు లక్ష్యం
  • ఏఈవో నియామకాల్లో స్థానికులకే అవకాశం
  • సిరిసిల్ల పర్యటనలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌
  • అధికారులతో సమీక్ష.. పలు బ్రిడ్జిల ప్రారంభోత్సవం

పకడ్బం దీ వ్యూహం, కార్యాచరణతో ముందుకు సాగితే, నియంత్రిత సాగు విధానంలో సత్ఫలితాలు సాధిస్తే తెలంగాణ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందని మున్సిపల్‌, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు ఆశాభావం వ్యక్తంచేశారు. రైతాంగానికే ఎక్కువగా ప్రయోజనం చేకూర్చాలనే సదుద్దేశంతో ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత పద్ధతిలో సాగుకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. వెక్కిరించినవాళ్లే ఆశ్చర్యపోయేలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమైందని, ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని జలాశయాలన్నింటినీ నిండుకుండల్లా నింపుతామన్నారు. మంగళవారం కేటీఆర్‌ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ముస్తాబాద్‌ మండలం తెర్లుమద్ది, హనుమాన్‌నగర్‌, గండిలచ్చపేట, కొండాపూర్‌, జిల్లెల్ల భరత్‌నగర్‌లలో రూ.33 కోట్లతో నిర్మించిన బ్రిడ్జిలను ప్రారంభించారు. పోతుగల్‌లో అనారోగ్యంతో మృతిచెందిన తన్నీ రు కిషన్‌రావు, గుండెపోటుతో మరణించిన ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లికి చెం దిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త బాబు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం సిరిసిల్లలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులపై  సమీక్ష నిర్వహించారు. 

రైతుబంధు అందరికీ అందేలా చూడాలి

రైతులందరికీ రైతుబంధు ఇవ్వాలన్నది ప్రభు త్వ ఉద్దేశమని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. గతంలో రైతుబంధుకు రూ.12వేల కోట్లు కేటాయించగా, ప్రస్తుత ఏడాదిలో రూ.14 వేల కోట్లు కేటాయించినట్టు వివరించారు. దీంతోపాటు ఉచిత విద్యుత్‌, సాగునీరు, విత్తనాలు, ఎరువులు.. అన్నీ ప్రభుత్వమే సమకూర్చుతున్నదని చెప్పారు. రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మరింత ప్రయోజనం చేకూర్చాలని ప్రభు త్వం నియంత్రిత సాగు విధానాన్ని చేపట్టిందన్నారు. ఈ విధానాన్ని రైతులందరూ పాటించేలా చూడాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారులు, రైతుబంధు సమితి సభ్యులదని తెలిపారు. ప్రభుత్వం సూచించిన పంటలను సాగు చేసిన రైతులకు రైతుబంధు ఇస్తామని స్పష్టంచేశారు. జిల్లాలో ఎరువులు, విత్తనాలకు ఇబ్బందులు లేకుండా వ్యవసాయాధికారులు ముం దస్తు చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల మధ్యలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌ నిర్మాణానికి స్థలాన్ని సేకరించాలని అధికారులను ఆదేశించారు. ముస్తాబాద్‌, తంగళ్లపల్లి మండలాల్లో ఒకచోట 210 ఎకరాల స్థలాన్ని గుర్తించాలన్నారు. జిల్లాలో కొత్తగా ఏర్పాటైన వీర్నపల్లి, రుద్రంగి మండలాల్లో ఒక్కో మండలంలో 5 వేల టన్నుల సామర్థ్యం గల గోదాంలను నిర్మించనున్నట్టు చెప్పారు. సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్‌ యార్డును ఆగస్టులోగా ప్రారంభించేలా పనులు వేగవంతం చేయాలని సూచించారు. 

ఇది కర్షక ప్రభుత్వం..

రైతాంగానికి విత్తు నాటిన నుంచి ధాన్యం అమ్ముకొనే వరకు అన్నివిధాలుగా సహాయం అందిస్తున్న దేశంలోనే ఏకైక ప్రభుత్వం సీఎం కేసీఆర్‌దని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. రూ.36వేల కోట్ల రైతు రుణమాఫీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఉచిత విద్యుత్‌, రైతుబీమా, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వంటి కార్యక్రమాల ద్వారా రైతు కేంద్ర బిందువుగా సీఎం కేసీఆర్‌ పనిచేస్తున్నారని కొనియాడారు. రానున్న 24 గంటల్లో సిరిసిల్ల నియోజకవర్గంలో రైతు యూనిట్‌గా గ్రామం, మండలాలవారీగా రైతు పేరు, సర్వే నంబర్‌, విస్తీర్ణం, భూమి సాగు వివరాలు సేకరించాలని రైతుబంధు సమితి అధ్యక్షుడు, వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. అనువైన పంటలను సాగు చేయడమే కాకుండా అవసరమైన మేర మాత్రమే ఎరువులను వాడేలా రైతులను చైతన్యం చేయాలని సూచించారు. అక్టోబర్‌లో కాళేశ్వరం ప్యాకేజీ 9 ద్వారా 87,500 ఎకరాలకు సాగునీరందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 

ఈ ఏడాది డిసెంబర్‌వరకు ఎగువమానేర్‌కు కాళేశ్వర జలాలతో జలకళ వస్తుందన్నారు. ఔట్‌సోర్సింగ్‌ ఏఈవో నియామకాల్లో స్థానిక యువతకే అవకాశం కల్పించాలని సూచించారు. జిల్లాలో సాగునీటి సౌకర్యం మెరుగుపడటంతో ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరిగిందన్నారు. ప్రస్తుతం రైతులు ధాన్యాన్ని రోడ్లపై ఆరబెడుతున్నారని, ఉపాధి హామీ పథకం ద్వారా పొలంలోనే కల్లాలు నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీని ఆదేశించారు. సాగునీటి ఫీడర్‌ చానళ్ల నిర్మాణాలు ఉపాధి హామీలో భాగంగా చేపట్టాలన్నారు. సమావేశంలో కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, అదనపు కలెక్టర్‌ అంజయ్య, టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, రైతుబంధు సమితి కన్వీనర్‌ గడ్డం నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close