తెలంగాణస్పెషల్

మేడారానికి భక్తజనం

  • ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు మహాజాతర
  • ముందస్తుగా తరలివస్తున్న భక్తులు
  • గత ఆదివారం తల్లుల గద్దెలను దర్శించుకున్న ఐదు లక్షలమంది
  • రూ.75 కోట్లతో అభివృద్ధి.. తుది దశకు చేరిన పనులు
  • ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న మంత్రులు, అధికారులు

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాత ర, తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించనున్నారు. రెం డేండ్లకోసారి జరిగే మహా జాతర మాఘ శుద్ధ పౌర్ణమి రోజున గిరిజన సంప్రదాయం ప్రకారం జరుపుకోవడం ఆనవాయితీ. ఈ మహా జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఒడిశా రాష్ర్టాలనుంచి లక్షలాది మంది తరలివచ్చి వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు. కోయగిరిజనుల ఆచారాల ప్రకారం  తల్లులను కొలువడం ఈ జాతర ప్రత్యేకత.

ఫిబ్రవరి 5 నుంచి జాతర 

మేడారం జాతర ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభం కానున్నది. 5న  సారలమ్మ గద్దెకు రావడం, 6న సమ్మక్క గద్దెకు రావడం, 7న భక్తులు మొక్కులు చెల్లించడం, 8న సమ్మక్క-సారలమ్మ వన ప్రవేశం చేయడం వంటి మహా ఘట్టాలు నిర్వహించనున్నారు. సమ్మక్క-సారలమ్మ పూజారులు జాతర ముందు నిర్వహించాల్సిన గుడిమెలిగే పండుగను ఈ నెల 22న వైభవంగా నిర్వహించారు. ఈ నెల 29న మండమెలిగే పండుగను ఘనంగా నిర్వహించనున్నారు. 

టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మేడారం జాతర నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించింది. కోట్లాది మంది భక్తుల సౌకర్యాల కోసం అనేక వసతులను ఏర్పాటు చేస్తున్నది. జాతర సమయంలో భక్తుల కోసం తాగునీరు, వైద్యం, విద్యుత్‌, రవాణా, సౌకర్యాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఈసారి మహా జాతరకు సీఎం కేసీఆర్‌ రూ.75 కోట్లను కేటాయించి అభివృద్ధి పనులను చేపట్టగా.. దాదాపుగా పూర్తి కావచ్చాయి. 

ముస్తాబైన మేడారం 

ఫిబ్రవరి 5 నుంచి 8వరకు జాతర జరుగనున్న నేపథ్యంలో మేడారాన్ని సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. జంపన్నవాగులో ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకున్నారు. పుణ్యస్నానాల కోసం స్నాన ఘట్టాలు, షవర్లు, కల్యాణకట్టలు ఏర్పాటు చేశారు. జంపన్న వాగులో నిత్యం 3 అడుగుల మేర నీరు మాత్రమే ప్రవహించేలా అడ్డుకట్టలు వేయించారు. 16 ప్రాంతాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. 

మంత్రుల సమీక్షలు..

మేడారం జాతర సందర్భంగా చేపట్టిన పను లు చివరిదశకు చేరుకున్నాయి. దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు జాతరలో చేపడుతున్న పనులపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే  క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు.

భారీ బందోబస్తు..

ములుగు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో సుమారు 10 వేల మంది పోలీసు బలగాలతో బందోబస్తు నిర్వహించనున్నారు. జాతరను నిత్యం పర్యవేక్షించేందుకు 330 బుల్లెట్‌ సీసీ కెమెరాలు, 20 పీటీజెడ్‌ కెమెరాలు, 4 డ్రోన్‌ కెమెరాలతోపాటు ఫేసియల్‌ రికగ్నైజ్‌డ్‌తోపాటు ఫింగర్‌ ప్రింట్స్‌ బ్యూరోను సైతం రంగంలోకి దింపి జాతరను పూర్తిస్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో పర్యవేక్షించనున్నారు. భక్తుల కోసం నాలుగువేల ఆర్టీసీ బస్సులను నిరంతరరాయంగా నడిపిస్తూ 12 వేల మంది ఉద్యోగులతో రవాణా శాఖ సేవలను అందించనున్నది. అటవీ, ఫైర్‌, ఆబ్కారీ శాఖలతోపాటు దేవాదాయ శాఖ జాతరకు చేపట్టాల్సిన ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేసింది. జాతరకు నలువైపులా ఉన్న ప్రవేశ ద్వారాలను ప్రాంగణంలోని ప్రవేశ ద్వారాలను సైతం రంగులతో అలంకరించారు. 

ముందస్తు మొక్కులు..

జాతర మరో 13 రోజుల్లో ప్రారంభంకానుండగా 15 రోజుల ముందు నుంచే లక్షలాది మంది భక్తులు తరలివస్తూ ముందస్తుగా మొక్కులను చెల్లించుకుంటున్నారు. గత ఆదివారం సుమారు 5 లక్షల మందికిపైగా భక్తులు తల్లులను దర్శించుకోగా ఈ వారం మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు భావిస్తున్నారు. కాగా జాతర సమయంలో భక్తుల సంఖ్య కోటిన్నర దాటే అవకాశం ఉన్నదనే అంచనాల మేర కు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close