అంతర్జాతీయం

ఆస్ట్రేలియాలో పశుమేధం.. 5,000 ఒంటెల కాల్చివేత

అడవి మంటలతో అట్టుడుకుతున్న ఆస్ట్రేలియాలో అధికారులు పశుమేధం చేపట్టారు. ఏకబిగిన ఐదు వేల ఒంటెలను కాల్చిచంపారు. హెలికాప్టర్లలో కూర్చున్న గన్‌మెన్లు ఒంటెల తలల మీదకు తుపాకులు ఎక్కుపెట్టి తూటాలను దింపుతూ పోయారు. ఇదంతా ఎందుకు? అంటే జనావాసాల పరిరక్షణ కోసమని అధికారులు అంటున్నారు. నిజానికి ఆ ఒంటెలు ఆస్ట్రేలియాకు చెందినవి కావు. 1840లలో వాటిని ఆస్ట్రేలియాలో ప్రవేశపెట్టారు. ఆస్ట్రేలియా భూభాగం విశాలమైందే. కానీ నీరు వంటి సహజవనరులు అరకొరగానే ఉంటాయి. సువిశాలమైన ఆస్ట్ర్రేలియా అన్వేషణకుగానూ ఒంటెలను రప్పించారు. తర్వాత ఆరు దశాబ్దాల్లో భారత్ నుంచి 20 వేల ఒంటెలను దిగుమతి చేసుకున్నారు. వీటి ఉపయోగం తగ్గడంతో క్రమంగా ఇవి అడవుల్లోకి వెళ్లాయి. చెట్టూచేమా తింటూ తామరతంపరగా పెరిగిపోయాయి.
ప్రస్తుతం ప్రపంచంలోని అడవి ఒంటెల్లో అత్యధికం ఆస్ట్రేలియాలోనే ఉన్నాయంటారు. పెరిగిపోయిన ఒంటెల మందలు చెట్టూచేమలను, నీటివనరులను పాడు చేస్తూ ఆదివాసీలకు ఇక్కట్లు కల్పిస్తున్నాయి. ప్రస్తుత పశుమేధం దక్షిణ ఆస్ట్రేలియాలోని అనంగు ఆదివాసీ ప్రాంతంలో జరిగింది. పచ్చదనం కొంచెం అధికమొత్తంలో కనిపించే ఆ ప్రాంతంలో 2300 మంది ఆదివాసీలు జీవిస్తున్నారు.

జంతు ప్రేమికుల ఆందోళనను అర్థం చేసుకుంటాం.. కానీ ఆ మారుమూల ప్రాంతంలోని స్థానిక తెగలవారు ఒంటెల కారణంగా అనుభవిస్తున్న దుర్భర పరిస్థితులను తప్పించాల్సి ఉందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. బయటి నుంచి దిగుమతైన ఒంటెలు స్థానికుల పాలిట చీడలా తయారయ్యాయని ఆయన చెప్పారు. రోడ్లమీద కార్లలో ప్రయాణించేవారికీ అవి తలనెప్పిగా తయారయ్యాయని ఆయన వివరించారు. ఈ ఐదురోజుల వేట మంగళవారంతో ముగిసింది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close