క్రైమ్జాతీయంటాప్ స్టోరీస్బ్రేకింగ్ న్యూస్

మహారాష్ట్రలో మరాఠా ఉద్యమం.. తీవ్ర ఉద్రిక్తత

రిజర్వేషన్లు కల్పించాలని మహారాష్ట్రలో మరాఠాలు చేస్తున్న ఉద్యమం సోమవారం మరోసారి భారీ విధ్వంసానికి దారి తీసింది. మరాఠా కోటా ఆందోళనకారులు పలు ఇళ్లకు నిప్పంటించారు. రోడ్లను దిగ్బంధించి, పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. బంద్‌లు, బస్సులపై దాడులకు తెగబడటంతో మహారాష్ట్రలోని పలు ప్రాంతాలు హింసాత్మకంగా మారాయి. ఈ ఆందోళలో ఓ వ్యక్తి రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పుణె జిల్లాలోని చఖన్‌ ప్రాంతంతో పాటు ఉస్మానాబాద్‌, షోలాపూర్‌, కొల్హాపూర్‌, నందుర్బర్‌, ఔరంగాబాద్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. చఖన్‌లోని పుణె-నాసిక్‌ హైవేపై ఆందోళనకారులు 40 బస్సులను తగలబెట్టి మరో 50 బస్సులను ధ్వంసం చేశారు. దీంతో ప్రయాణికులు, ఉద్యోగులు తమ ప్రయాణాలను రద్దు చేసుకుని కార్యాలయాలు, ఇతర ప్రాంతాల్లో బసచేశారు.

రాజ్‌గుర్‌నగర్‌లో పోలీసులపై రాళ్లు రువ్వడంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. పలు ప్రాంతాల్లో ఐదుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. షోలాపూర్‌లోని పండర్‌పూర్‌ తో పాటు కొల్హాపూర్‌ చుట్టుపక్కల ఆందోళనకారులు ఆర్టీసీ బస్సులను లక్ష్యంగా చేసుకుని విధ్వంసానికి పాల్పడ్డారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి రోడ్ల దిగ్బంధం, బస్సుల దహనానికి పాల్పడుతుండటంతో ప్రభుత్వం తాత్కాలికంగా  బస్సు సర్వీసులను రద్దు చేసింది. పలు ప్రాంతాల్లో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. తమకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఔరంగాబాద్‌లో ప్రమోద్‌ పాటిల్‌ రైలుముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వారంరోజులుగా జరుగుతున్న ఆందోళనలో ఇది మూడో ఆత్మహత్య. కోటా ఉద్యమం తీవ్రహింసకు దారితీయడంతో కాంగ్రెస్‌, ఎన్సీపీ పార్టీలు తమ ఎమ్మెల్యేలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించాయి. అనంతరం ఇరుపార్టీలకు చెందిన ప్రతినిధి బృందాలు వేర్వేరుగా గవర్న్‌ చెన్నమనేని విద్యాసాగర్‌రావును కలిసి సమస్యను వివరించాయి. కమిటీల రిపోర్టులతో సంబంధం లేకుండా అత్యవసరంగా రిజర్వేషన్లు ప్రకటించాలని, అసెంబ్లీని సమావేశపరిచి తీర్మానాన్ని కేంద్రానికి పంపాలని శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే డిమాండ్‌ చేశారు.

ఇదిలా ఉండగా మారాఠాల రిజర్వేషన్ల అమలుపై మంగళవారం లోపు ప్రకటన చేయాలని.. లేనిపక్షంలో ఆగస్టు 1 నుంచి ఆందోళనలు ఉధృతం చేస్తామని మరాఠా క్రాంతి మోర్చా కన్వీనర్‌ వినోద్‌పాటిల్‌ హెచ్చరించారు. మరోవైపు వచ్చేనెల 9న ముంబైలో భారీ ర్యాలీ నిర్వహించాలని మరాఠా సంఘాలు నిర్ణయించాయి.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close