రాజకీయం

ఇవన్నీ మీకు కనిపించడం లేదా? -కేసీఆర్ పై కిషన్ రెడ్డి ఫైర్

  • మోదీని న్యూయార్క్ టైమ్స్ సహా 50 పత్రికలు ప్రశంసించాయి
  • కేంద్ర ప్యాకేజీతో తెలంగాణకు ఉపయోగం ఉండదా?
  • కేంద్ర ప్రభుత్వ సంస్కరణలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. అంకెల గారడీ తప్ప అందులో ఏమీ లేదని ఆయన దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పుబట్టారు. కేసీఆర్ ఉపయోగించిన భాష అభ్యంతరకరంగా ఉందని అన్నారు. మోదీ వెనుక యావత్ దేశం ఉందంటూ న్యూయార్క్ టైమ్స్ సహా 50 అంతర్జాతీయ పత్రికలు ప్రశంసించాయని చెప్పారు. ఎవరో అడ్రస్ లేని వాళ్లు చెప్పారంటూ ప్రధానిని కేసీఆర్ విమర్శించడం తగదని అన్నారు.

ప్రస్తుత సంక్షోభ సమయంలో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయవద్దని కేసీఆర్ కు కిషన్ రెడ్డి హితవు పలికారు. కేంద్రం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీతో తెలంగాణ ప్రజలకు లబ్ధి ఉంటుందా? లేదా? అనే ప్రశ్నకు కేసీఆర్ సమాధానం చెప్పాలని అన్నారు. ఉన్నంతలో కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన ప్యాకేజీని ప్రకటించిందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న పంటల విధానాన్ని బీజేపీ వ్యతిరేకించలేదని… అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు.

రైతులు, పేదలు, పేద మహిళల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేశామని కిషన్ రెడ్డి చెప్పారు. 80 కోట్ల మంది పేదలకు 5 కేజీల చొప్పున కేంద్రం ఉచితంగా అందించిన బియ్యం కేసీఆర్ కు కనిపించలేదా? అని ప్రశ్నించారు. భవన కార్మికులకు ఇస్తున్న సాయం, ఈపీఎఫ్, పెన్షన్లు కనపించడం లేదా? అని అడిగారు. దేశంలో ఉపాధి పనుల పని దినాలు పెంచామని గుర్తు చేశారు. ఉపాధి నిధులతో తెలంగాణలో అభివృద్ధి జరగలేదా? అని దుయ్యబట్టారు. కరోనాను ఎదుర్కొనే క్రమంలో రాజకీయాలను పక్కన పెట్టాలని సూచించారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close