జియో ఫైబర్ కొత్త ప్లాన్లు

న్యూఢిల్లీ : ‘ట్రూలీ అన్లిమిటెడ్ ఇంటర్నెట్’ పేరిట సరికొత్త ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను ప్రవేశపెడుతున్నట్టు రిలయన్స్ జియో ప్రకటించింది. డాటా వినియోగం, వేగంపై ఎలాంటి పరిమితి లేని ఈ నెలవారీ ప్లాన్లు రూ.399 నుంచి ప్రారంభమవుతాయని, మంగళవారం నుంచి ఇవి అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. జియో ఫైబర్ ప్లాన్లలో ఇప్పటివరకు నిర్దేశిత వినియోగ పరిమితి దాటిన తర్వాత వేగం 1 ఎంబీపీఎస్‌కు పడిపోయేది. కానీ కొత్త ప్లాన్లలో ఇలాంటి పరిస్థితి ఉండదు. అత్యంత చౌకగా రూ.399కి లభించే నెలవారీ ప్లాన్ కింద 30 ఎంబీపీఎస్ డౌన్లోడ్/అప్లోడ్ వేగంతో, రూ.699 ప్లాన్‌లో 100 ఎంబీపీఎస్ వేగంతో డాటా లభిస్తుంది. అలాగే 150 ఎంబీపీఎస్ వేగంతో కూడిన రూ.999 ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్ మినహా 11 ఓటీటీ యాప్స్‌ను, 300 ఎంబీపీఎస్ వేగంతో కూడిన రూ.1,499 ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్‌తో కలిపి 12 ఓటీటీ యాప్స్‌ను ఉచితంగా పొందవచ్చు. మరోవైపు కొత్త వినియోగదారులను ఆకట్టుకునేందుకు 150 ఎంబీపీఎస్ వేగంతో నెల రోజులు ఫ్రీ ట్రయల్‌ను అందజేయనున్నది. ఈ ట్రయల్ పీరియడ్‌లో 10 ఓటీటీ యాప్స్ ఉచితంగా లభిస్తాయి.