ఆంధ్ర

హైదరాబాద్‌లాగే అమరావతి..: మూడు రాష్ట్రాలంటూ జగన్‌పై జేసీ దివాకర్ రెడ్డి

అనంతపురం: మరోసారి రాజధాని అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. అంతేగాక, సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. మూడు రాజధానులంటూ ప్రకటనపై ఆయన మండిపడ్డారు.

జగన్‌పై విమర్శలు.. రాష్ట్రంలో కుల ద్వేషాన్ని ప్రాంతీయతత్వాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్నారని జేసీ దివాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. అమరావతి తాత్కాలికమైంది కాదని.. శాశ్వత రాజధాని అని ఆయన చెప్పారు. రాజధాని అంటే అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు ఒకే చోట ఉండాలన్నారు.

హైదరాబాద్‌లాగే అమరావతి.. హైదరాబాద్‌లో అసెంబ్లీ, సచివాలయం ఎలతా ఉన్నాయో.. అమరావతిలోనూ అలాగే ఉన్నాయని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. కేవలం కులాన్ని, మతాన్ని ఉపయోగించి రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేస్తారా? అని ప్రశ్నించారు.

మూడు రాష్ట్రాలుగా చేయాలనే జగన్.. రాష్ట్రంలో వైసీపీ సర్కారు పాలన ఇలాగే ఉంటే గ్రేటర్ రాయలసీమ ఉద్యమం వస్తుందని జేసీ తేల్చి చెప్పారు. గ్రేటర్ రాయలసీమగా విడగొట్టి కడపను రాజధానిగా చేసుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డికి సూచించారు. ఏపీని మూడు రాష్ట్రాలుగా చేయాలని జగన్ ప్రయత్నిస్తున్నారని జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు. అనంతపురంలో సోమవారం అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వివిధ పార్టీల నేతలు ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జోలెపట్టి విరాళాలు సేకరించారు. అనంతరం నిర్వహించిన సభలో జేసీ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

అప్పుడే విశాఖను రాజధానిగా చేసుకోండంటూ చంద్రబాబు ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రానికి ఒకటే రాజధాని అని.. అది అమరావతేనని అన్నారు. రాజధాని అమరావతిని రాష్ట్ర ప్రజలంతా ఒప్పుకున్నారని తెలిపారు. కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పింది తానేనని అన్నారు. ఇప్పుడు హైకోర్టును కూడా మూడు ముక్కలు చేస్తామని చెబుతున్నారని వైసీపీ సర్కారుపై మండిపడ్డారు. రాజధాని అమరావతిని మార్చాలనుకుంటే వైసీపీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని.. ఆ ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి అనుకూలంగా తీర్పు ఇస్తే అప్పుడు రాజధానిని విశాఖకే మార్చుకోవాలన్నారు. వైసీపీ గెలిస్తే తాను పూర్తిగా రాజకీయాలను వదిలేస్తానని స్పష్టం చేశారు చంద్రబాబు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close