ఆంధ్రటాప్ స్టోరీస్బ్రేకింగ్ న్యూస్రాజకీయం

కాపు రిజర్వేషన్‌పై ప్రకటన జగన్‌కు ప్లస్సా.. మైనస్సా?

మాటలతో కోటలు కట్టాలి.. అరచేతిలో వైకుంఠం చూపించాలి. చేయగలమా లేక చేస్తామా అన్నది తర్వాత సంగతి, ముందు మాత్రం ఏదో ఒకటి చెప్పి పబ్బం గడుపుకోవాలి. రాజకీయం పక్కాగా ఒంటబట్టిన ఏ రాజకీయనాయకుడైనా చెప్పేది చేసేది అదే. రాజకీయాల్లో గీత గీసినట్లు కచ్చితంగా ఉండడం సాధ్యం కాదన్నది నానుడి కూడా. అలా ఉండాలనుకుంటే ఇప్పటి రాజకీయాల్లో మనుగడ సాగించలేరన్నది అనుభవజ్ఞులు చెప్పే మాట. అయితే, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు జగన్ మాత్రం ఈ విషయాన్ని ఎలా అర్థం చేసుకున్నారో గానీ, కాపులకు రిజర్వేషన్ ఇవ్వనంటూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పడమే ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. కాపుల్లో ఆగ్రహాన్ని కలిగిస్తోంది. రిజర్వేషన్ ఇవ్వమంటే కాపులు దూరమవుతారన్న సంగతి జగన్‌కు తెలియదా..? లేక తెలిసీ ప్రకటించారా? జగన్ వ్యూహం ఏంటి? వచ్చే ఎన్నికలపై అంచనా ఏంటి?

కాపులకు రిజర్వేషన్ ఇవ్వలేమంటూ జగన్ చెప్పడంలో ఎంతో రాజకీయ చాతుర్యం కనిపిస్తుంది. తాను నిజాయితీగా వ్యవహరిస్తానంటూ ప్రజల్లో ఇమేజ్ పెంచుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. చేయగలిగేవే హామీ ఇస్తానని, చేయలేని వాటి గురించి హామీ ఇవ్వలేనంటూ గత ఎన్నికల్లోనూ చెప్పారు జగన్, ఇప్పుడూ మళ్లీ దాన్నే పునరుద్ఘాటిస్తున్నారు. రైతులకు రుణమాఫీ సాధ్యం కాదని, అలాంటి హామీని తాను ఇవ్వలేనని చెప్పి గత ఎన్నికల్లో దెబ్బ తిన్నారు జగన్‌. రుణమాఫీనే టీడీపీని గెలిపించిందన్నది చాలా మంది విశ్లేషణ. అయితే, ఆ తర్వాత రుణమాఫీ అమలులో ఎదురైన ఇబ్బందులను ఎప్పటికప్పుడు తనకు అనుకూలంగా మలుచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఇప్పుడు కాపుల రిజర్వేషన్‌ అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

కాపులకు రిజర్వేషన్ సాధ్యం కాదా?

కాపుల రిజర్వేషన్ అనేది జగన్ చెప్పినట్లే రాష్ట్రం పరిధిలో తేలేది కాదు. దానికి కేంద్రం అంగీకరించాలి. రాజ్యాంగంలో మార్పులు చేయాలి. ఒక్క రాష్ట్రం కోసం అలా చేస్తే, మిగిలిన రాష్ట్రాలూ తమకూ రిజర్వేషన్లలో మార్పు కావాలంటూ వస్తాయి. అటు రిజర్వేషన్లు 50 శాతాన్ని మించి దాటకూడదని సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది. ఈ పరిస్థితుల్లో కాపులకు ప్రత్యేకంగా రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యమయ్యే పనే కాదు. అది కాపులకూ తెలుసు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగానే చిత్త శుద్ధి ఉంటే ఇప్పటికే ఉన్న బీసీ రిజర్వేషన్లలో కోత విధించి, కాపులకు రిజర్వేషన్ కల్పించవచ్చు. కానీ, అలా చేస్తే బీసీ కులాలన్నీ అధికార పార్టీకి వ్యతిరేకంగా మారతాయి. కాపులకు రిజర్వేషన్‌పై తీర్మానం చేసి కేంద్రానికి పంపించేసిన చంద్రబాబు, ఇక తన పనైపోయినట్లే చెబుతున్నారు కానీ, రిజర్వేషన్లు మాత్రం ఇంకా కాపులకు అందలేదు. అందే అవకాశాలు కనుచూపుమేరలో కనిపించడం లేదు.

జగన్‌ లెక్కేమిటి?

గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లోనే కాపులు ఎక్కువగా ఉన్నారు. ఉత్తరాంధ్రలో కూడా ఉన్నప్పటికీ అక్కడ కాస్త ప్రాబల్యం తక్కువే అని చెప్పొచ్చు. ఉభయగోదావరి జిల్లాల్లో వైసీపీ అంత బలంగా ఏమీ లేదు. వచ్చే ఎన్నికల్లోనూ భారీగా సీట్లు వస్తాయన్న గ్యారెంటీ లేదు. గత ఎన్నికల్లో టీడీపీ కన్నా ఎక్కువగా కాపులకు టికెట్లు ఇచ్చినా, వైసీపీ నుంచి గెలిచిన వాళ్లు తక్కువే. అందుకే, కాపులకు రిజర్వేషన్ ఇవ్వలేమని చెప్పడం ద్వారా ఇతర కులాలకు దగ్గర కావాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా ఈ విషయాన్ని కాపు ఉద్యమానికి కేంద్రంగా భావించే జగ్గంపేట నుంచే ప్రకటించడం ద్వారా తన ఉద్దేశ్యాన్ని స్పష్టంగా ప్రకటించినట్లు కనిపిస్తోంది. పైగా, పవన్ కళ్యాణ్‌ జనసేన వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగుతుండడంతో, ఎక్కువమంది కాపులు అటువైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. దీంతో, కాపులకు రిజర్వేషన్‌ ఇవ్వలేమనడం ద్వారా, ఇప్పటికే రిజర్వేషన్లు అనుభవిస్తున్న కులాలకు వైసీపీ దగ్గరయ్యే అవకాశం ఉంది.

కాపులు అవసరం లేదా?

జగన్ చేసిన ప్రకటనతో కాపులు పూర్తిగా వైఎస్సార్‌ సీపీకి దూరమయ్యే అవకాశం లేదు. రిజర్వేషన్ల విషయంలో కాపుల్లోనూ రెండు రకాల ఆలోచనలున్నాయి. అగ్రకుల హోదాలో ఉన్న కాపుల్లో చాలా మంది బీసీ హోదాను కోరుకోవడం లేదు. పైగా ఇప్పటికే కాపు కార్పొరేషన్ ద్వారా లబ్ధి పొందిన వాళ్లు టీడీపీ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. రాజకీయంగా ఎదగాలనుకుంటున్న కొంతమంది వైసీపీలోనే ఉంటారు. అయితే, కాపులను పూర్తిగా దూరం చేసుకోకుండా ఉండడానికి కాపు కార్పొరేషన్‌కు ఇచ్చే నిధులను రెట్టింపు చేస్తానంటూ వ్యూహాత్మకంగా ప్రకటించారు జగన్‌. కాస్త చదువుకుని, ఆలోచించే వారికి జగన్ చేసిన ఈ ప్రకటన నచ్చుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో కొంతవరకూ కాపు ఓట్లు వైసీపీకి పడతాయి. తాత్కాలికంగా రిజర్వేషన్లు ఇవ్వలేమన్న ప్రకటనతో ఇబ్బంది ఉన్నా, ఈ ఐదేళ్లలో ఒరిగింది ఏమీ లేదు కాబట్టి, ఎన్నికల నాటికి పరిస్థితి చక్కబడుతుందన్నది జగన్ అంచనా కనిపిస్తోంది.

జగన్ చేసిన ప్రకటనతో ఇప్పటికిప్పుడు నిరసనలు వచ్చినా, క్రమంగా పరిస్థితి ఆయనకు అనుకూలంగా మారే అవకాశం ఉంది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close