ఆంధ్రటాప్ స్టోరీస్రాజకీయం

ఈ నెల 24న రాష్ట్ర బంద్‌కు జగన్‌ పిలుపు

ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపైనే అవిశ్వాసం పెట్టినా, చర్చలో మాత్రం రాజకీయ ఎజెండాను మాత్రమే అన్ని పార్టీలు బయటపెట్టాయంటూ విమర్శించారు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌. ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతోపాటు టీడీపీ ఎంపీలు వ్యవహరించిన తీరును దుయ్యబట్టారు. వీరి తీరుకు నిరసనగా, ప్రత్యేక హోదా సాధన పోరాటాన్ని మరింత ముమ్మరం చేయడం కోసం మంగళవారం రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు. అందరూ స్వచ్ఛందంగా ఈ బంద్‌లో పాల్గొనాలని కోరారు జగన్‌.

‘పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా జరిగిన తీరును.. మన రాష్టం మీద పెద్దలకు ఉన్న ప్రేమను చూసి నిజంగా బాధ వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి మొదలు పెడితే కాంగ్రెస్‌ పార్టీ దాకా.. మిగిలిన ఏ పార్టీలు చూసినా కూడా ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతిస్తూ మాట్లాడిన మాటలు ఒక్కరి నోటా రాలేదు. ఇది నిజంగా అన్నింటికన్నా బాధాకరమైన విషయం. పార్లమెంట్‌ సాక్ష్యంగా ఆదుకుంటామని చెప్పి అప్పటి అధికార పక్షం, ప్రతిపక్షం, అన్ని పార్టీలు, చంద్రబాబుతో సహా కలిసి రాష్ట్రాన్ని విడగొట్టారు. ఆ తర్వాత హామీలు నెరవేర్చకపోగా.. నరేంద్ర మోదీ మాట్లాడిన మాటలు చూస్తే ఇస్తామని కానీ, ఇవ్వాల్సిన బాధ్యత మాది అనే మాట కూడా రాలేదు.

తిరుపతిలో ఎన్నికల వేళ తానే ప్రత్యేక హోదాను 10 ఏళ్లు ఇస్తానని చెప్పిన మాటలు ఆయనకు గుర్తుకు రాలేదు. ఎన్నికల మ్యానిఫెస్టోలోని హామీలు ప్రధాని గారికి గుర్తుకు రాలేదు. ఒకవైపు ప్రధానమంత్రికి గుర్తుకురాకపోగా.. ఆయన చెప్పిన మాటల్లో బాధ కలిగించిన విషయం.. చంద్రబాబు అంగీకారంతోనే హోదాకు బదులు ప్యాకేజీ ఇచ్చామని చెప్పడం.. ప్యాకేజీ చాలు అని చెప్పడానికి చంద్రబాబు ఎవరు? ఆయనకు ఆ హక్కు ఎవరిచ్చారు. రాష్ట్ర యువత ఉద్యోగాలు లేక వలసబాట పడుతున్నారు. ప్రత్యేక హోదా వస్తనే పరిశ్రమలు వస్తాయి. ఉద్యోగాలు లభిస్తాయి. టాక్స్‌ మినహాయింపు , జీఎస్టీలు కట్టాల్సిన పని ఉండదు. ఈ వెసులుబాటుతో కంపెనీలు ముందుకువస్తాయి. కానీ ఇంతటి కీలకమైన విషయంలో రాజీపడటానికి చంద్రబాబు ఎవరు? ఏపీ ప్రజల హక్కును తాకట్టు పెట్టే అధికారం కేంద్ర ప్రభుత్వం, చంద్రబాబులకు ఎవరిచ్చారు?’ అని వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రం చేస్తోన్న మోసాన్ని ఎండగట్టేందుకే తమ ఎంపీలు రాజీనామాలు చేశారని, టీడీపీ కూడా ఇలానే రాజీనామాలు చేసి ఉంటే దేశం దృష్టంతా రాష్ట్రంపైనే ఉండేదన్నారు. ఒకవైపు బీజేపీతో యుద్ధం అంటూ చంద్రబాబు తరచూ చెబుతున్నారని, కానీ ఆయన ప్రవర్తన చూస్తుంటే మాత్రం ఇది నిజం కాదన్న అనుమానం సామాన్యుడికి కూడా వస్తోందన్నారు.

ఇప్పటికైనా టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించాలని డిమాండ్ చేశారు జగన్‌. 25 మంది ఎంపీలు నిరాహారదీక్షకు కూర్చుంటే దేశం మొత్తం మనవైపు ఎందుకు చూడదో చూద్దామన్నారు.

కాంగ్రెస్‌, బీజేపీ, చంద్రబాబు అందరూ ప్రజలను మోసం చేశారు. వీళ్లను ఎవరూ నమ్మొద్దని వచ్చే ఎన్నికల్లో 25 మంది వైఎస్సార్‌ సీపీ ఎంపీలను గెలిపించమని కోరారు. ఎవరు ప్రత్యేక హోదా ఇస్తే వారికే మద్దతు ఇస్తామని, ఏపీ హక్కులను నిజాయితీగా సాధిస్తామని జగన్ స్పష్టం చేశారు.

ఇక వైఎస్సార్‌సీపీపైన ప్రధాని మోడీ చేసి వ్యాఖ్యలనూ ఖండించారు జగన్‌. హోదాపై తమ నిజాయితీ బీజేపీకి ట్రాప్‌లా కనిపిస్తోందా అని ప్రశ్నించారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close