రాజకీయం

‘మహా’ సీఎం ఉద్ధవ్​ థాకరే సలహాదారు బినామీ డీల్​!

  • ఆదాయ పన్ను అధికారుల దర్యాప్తు
  • షెల్ సంస్థతో ఫ్లాట్ కొన్నట్టు గుర్తింపు
  • ఐటీ రిటర్నులే చూపని షెల్ సంస్థ యజమానులు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సలహాదారు, మాజీ ఐఏఎస్ అజయ్ మెహతాపై ఆదాయపన్ను శాఖ అధికారులు దృష్టి పెట్టారు. ముంబైలోని నారిమన్ పాయింట్ లో ఆయన కొన్న ఓ ఫ్లాట్ కు సంబంధించి బినామీ లావాదేవీలు జరిగాయని అధికారులు అనుమానిస్తున్నారు. అనామిత్ర ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఓ బూటకపు (షెల్) సంస్థతో ఈ డీల్ జరిగినట్టు గుర్తించారు. గత ఏడాది రూ.5.33 కోట్లకు 1,076 చదరపుటడుగుల విస్తీర్ణంలోని ఆ ఫ్లాట్ ను అజయ్ కొనుగోలు చేశారు.

వాస్తవానికి ఆ సంస్థలో ముంబైలోని చాల్ కు చెందిన ఇద్దరే షేర్ హోల్డర్లున్నారని, వారెప్పుడూ పన్నులు కట్టింది లేదని అధికారులు గుర్తించారు. కేవలం ఈ ఫ్లాట్ కొనుగోలు కోసమే ఆ సంస్థను ఏర్పాటు చేశారని అంటున్నారు. ఈ ఫ్లాట్ ను ఆ సంస్థ రూ.4 కోట్లకు 2009లో కొనుగోలు చేసినట్టు రికార్డులు చెబుతున్నాయి. అయితే, అందులో 99% వాటా ఉన్న కామేశ్ నాథూనీ సింగ్ అనే వ్యక్తి.. ఇప్పటిదాకా అసలు ఐటీ రిటర్నులే దాఖలు చేయలేదని ఐటీ అధికారుల పరిశీలనలో వెలుగు చూసింది.

మరో వాటాదారు దీపేశ్ రవీంద్ర సింగ్ గత ఏడాది రిటర్నులు దాఖలు చేసినా తన ఆదాయం కేవలం రూ.1.71 లక్షలే అని చూపించాడు. దీంతో అనుమానం వచ్చిన ఐటీ అధికారులు అనామిత్ర సంస్థ ద్వారా జరిగిన బినామీ లావాదేవీలపై దర్యాప్తు చేస్తున్నారు.

దీనిపై అజయ్ మెహతా స్పందించారు. ఫ్లాట్ అమ్మిన సంస్థతో తనకు ముడిపెట్టడం సరికాదన్నారు. అన్ని పద్ధతుల ప్రకారమే, చట్టబద్ధంగా డీల్ జరిగిందన్నారు. నాటి మార్కెట్ ధర ఆధారంగానే వారికి డబ్బు కట్టానన్నారు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో అజయ్ ను మహా రెరా చైర్మన్ గా ఉద్ధవ్ సర్కార్ నియమించింది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close